logo

చక్కెరకు చెక్‌ పెట్టేలా..!

చక్కెర (మధుమేహం) వ్యాధి.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అందరికీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎనిమిది కోట్ల మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.

Published : 30 Jan 2023 05:31 IST

ఉమ్మడి జిల్లాలో 90 వేల మందికి పరీక్షలు నిర్వహించేలా లయన్స్‌ కార్యాచరణ

సామర్లకోట: ప్రాజెక్టును ప్రారంభిస్తున్న లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ విజయకుమార్‌ రాజు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, గాంధీనగర్‌: చక్కెర (మధుమేహం) వ్యాధి.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అందరికీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎనిమిది కోట్ల మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. మారుతున్న జీవన సరళి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడికి గురవ్వడమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు సైతం చక్కెర వ్యాధి బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిని అదుపు చేయాలన్న సంకల్పంతో లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఎంపిక చేసింది. ఇరవై క్లబ్‌లను ఎంపిక చేసి వాటి ద్వారా చక్కెర వ్యాధికి చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తోంది.

రూ.కోటి వ్యయంతో..

ఉమ్మడి జిల్లాలోని 20 లయన్స్‌ క్లబ్‌లు ఆయా ప్రాంతాలు, గ్రామాలను ఎంపిక చేశాయి. రూ.27 లక్షలు మాచింగ్‌ గ్రాంటుగా ఇవ్వగా, లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ రూ.81 లక్షలు జోడించి విడుదల చేసింది. ఈ సొమ్ముతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో లయన్స్‌క్లబ్‌ల ప్రతినిధులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు ఇంటింటికీ వెళ్లి చక్కెర వ్యాధి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక ఓపీ కార్డుల్లో పూర్తి వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వైద్య నిపుణులతో ఆయా ప్రాంతాల్లో చక్కెర వ్యాధిపై 300 వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. 20 క్లబ్‌లకు చక్కెర వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు, ఓపీ కార్డులు, అవగాహన పత్రాలు, ప్రత్యేక బుక్‌లెట్‌లు అందజేశారు. ఈ నెల 8న సామర్లకోటలో లయన్‌్్స ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి వి.విజయకుమార్‌రాజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

చక్కెర వ్యాధి నిర్ధారణకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లు

నిర్ధారణ.. ఉచిత వైద్య సేవలు

లయన్స్‌క్లబ్‌ల ఆధ్వర్యంలో కాకినాడలోని 8, 28, 29, 30 డివిజన్లు, తూరంగి, రేపూరు, వాకలపూడి, యానాం, తాళ్లరేవు, అమలాపురంలో భీమనపల్లి, జనుపల్లి, గొల్లలమామిడాడ, సామర్లకోట, మండపేట, రాజమహేంద్రవరంలోని పుణ్యక్షేత్రం, పిడింగొయ్యి, బొమ్మూరు, కాతేరు వంటి 20 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇంటింటికీ వెళ్లి ఇంట్లో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి బాధితులను గుర్తించి వారికి ఆహారపు అలవాట్లు, వ్యాధి అదుపు చేసేందుకు చేయాల్సిన కసరత్తును వివరిస్తారు. అవసరమైన వారికి వైద్య నిపుణుల సేవలను ఆరు నెలల పాటు ఉచితంగా అందిస్తారు.


బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
- డాక్టర్‌ బాదం బాలకృష్ణ, లయన్స్‌ డిస్ట్రిక్ట్‌ డయాబెటిక్‌ ప్రాజెక్టు ఛైర్మన్‌

ప్రమాదకరమైన చక్కెర వ్యాధి ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే జాగ్రత్తలు పాటిస్తూ, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాల్సిందే. లేకుంటే ప్రతి అవయవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. సరైన సమయంలో దాన్ని గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ బృహత్తర  కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.


పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికవ్వడం అదృష్టం
- మాటూరు మంగతాయారు, లయన్స్‌క్లబ్‌ జిల్లా గవర్నర్‌

లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ దక్షిణ భారతదేశంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఎంపిక చేయడం మన అదృష్టం. వ్యాధి అదుపునకు ప్రత్యేక బృందాల ద్వారా కృషి చేస్తున్నాం. పలువురు వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు ఉచిత సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని