logo

పోలవరానికి బండ్లు తిప్పాం... పైసలెప్పుడిస్తారు సారూ!

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ అధికారులు కోసం నెలవారీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న కార్లకు సంబంధించి బిల్లు బకాయి రూ.కోట్లలో పేరుకుపోయింది.

Updated : 30 Jan 2023 06:12 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ అధికారులు కోసం నెలవారీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న కార్లకు సంబంధించి బిల్లు బకాయి రూ.కోట్లలో పేరుకుపోయింది. ఏడాదిన్నర కాలంగా కార్ల అద్దె బకాయి బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో సంబంధిత ట్యాక్సీ క్యాబ్‌ ఓనర్లు, డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను అడుగుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప బకాయిలు మాత్రం రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం కేంద్రంగా పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షించే అధికారులు తిరిగేందుకు, సంబంధిత కార్యాలయాలు, శాఖాపరమైన అవసరాల నిమిత్తం ఏపీ ట్యాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు చెందిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 115 కార్లను ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన తీసుకుంది. 2021లో జరిగిన ఒప్పందం ప్రకారం ఒక్కొక్క ట్యాక్సీ క్యాబ్‌కు నెలకు రూ.35 వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించాల్సి ఉంది. ఒప్పందం మేరకు ప్రతినెలా నిర్ణీత తేదీల్లోగా కార్ల అద్దె చెల్లించాల్సి ఉండగా 2021 ఆగస్టు నుంచి బిల్లులు నిలిచిపోయినట్లు ట్యాక్సీ ఓనర్లు, డ్రైవర్లు చెబుతున్నారు. మధ్యలో కొంత బకాయి చెల్లించినప్పటికీ ఇంకా ప్రభుత్వం నుంచి తమకు రూ.3.44 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నారు.

అప్పులతో అవస్థలు

కొందరు ఫైనాన్స్‌లో కార్లు తీసుకుని ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్యాలయాలకు తిప్పుతున్నారు. అద్దె బకాయిలు రాకపోవడం కారణంగా సంబంధిత రుణ సంస్థలకు ప్రతినెలా వాయిదా (ఈఎంఐ)లు కట్టలేక అవస్థలు పడుతున్నారు. మరోపక్క కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎంఐలు చెల్లించకుంటే ఫైనాన్స్‌లో తీసుకున్న కార్లను సీజ్‌ చేసే పరిస్థితి ఉండటంతో బయట అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని వాయిదాలు చెల్లిస్తుండటం వల్ల మరింత అప్పుల్లో కూరుకుపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పందనలో విన్నవించినా...

కార్ల అద్దె బకాయిలపై గతేడాది నవంబరు 21న అసోసియేషన్‌ నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో నేరుగా కలెక్టర్‌కు అర్జీ అందించినప్పటికీ ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సేవలను వినియోగించుకుంటున్న సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు స్పందించి పాత బకాయిలు విడుదల చేయడంతోపాటు ఒప్పందం ప్రకారం సక్రమంగా నెలవారీ కార్ల అద్దె చెల్లింపులు జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.


మార్చిలోగా బకాయిలు చెల్లింపు
- సుధాకర్‌బాబు, చీఫ్‌ ఇంజినీర్‌, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు

కార్ల అద్దె బకాయిల గురించి ఇప్పటికే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై గత బడ్జెట్‌ సమావేశంలో కూడా ప్రస్తావన వచ్చింది. పెండింగ్‌ బిల్లులు ఎంతనేది వివరాలు పంపించమంటే ప్రధాన కార్యాలయానికి రాసి పంపించాం. ఈ ఏడాది మార్చిలోగా బిల్లులన్నీ చెల్లింపులు జరుగుతాయి.


ప్రభుత్వం తక్షణం స్పందించాలి
-ఎం.సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ టాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

రూ.3.44కోట్ల వరకు బిల్లు బకాయి ఉండిపోవడంతో సంబంధిత ట్యాక్సీక్యాబ్‌ ఓనర్లు కం డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఫైనాన్సులో వాహనాలు తీసుకుని తిప్పుతున్నవారు ఈఎంఐలు కట్టేందుకు బయట అప్పులు చేయాల్సివస్తోంది. అసలే వాహనాలకు సంబంధించి హరితపన్ను(గ్రీన్‌ట్యాక్సు) ఫిట్‌సెస్‌ ఇతర పన్నులు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కార్ల అద్దె బకాయిలను చెల్లించకపోవడంతో వాహనాల నిర్వహణ, కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. తక్షణం ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని