logo

పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి

పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్నిఅనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం.

Updated : 20 Apr 2024 05:46 IST

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరాశ
మాటలే తప్ప.. మేలు చేయని జగన్‌ సర్కారు

పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని
అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు దక్కేలా ఇప్పటికే చట్టం చేశాం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మంది ఉపాధి పొందుతారు.

  2022 నవంబరు 5న గోకవరం పర్యటనలో సీఎం జగన్‌


ఈనాడు, రాజమహేంద్రవరం

యువత కోసం ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం.. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.. కానిస్టేబుల్‌ పోస్టులు ఏటా భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ మోసపూరిత హామీల పరంపరలోని డొల్లతనం ఇప్పటికే బయటపడగా.. తూర్పుగోదావరి జిల్లాలో పలు పరిశ్రమల స్థాపనకు భూమిపూజ చేసినా ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి. గతంలో ఉన్న పరిశ్రమల విస్తరణకు శంకుస్థాపన చేసిన పనుల్లో కొంత పురోగతి ఉన్నా కొత్త యూనిట్లు లేవు. గోకవరం మండలంలో 2022 నవంబరులో శంకుస్థాపన చేసిన అస్సాగో పరిశ్రమ పనులు మాత్రం జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంపై ఆసక్తితో సొంతంగా ఎదుగుదామని ముందుకొచ్చినవారి ఆశలపైనా నీళ్లు జల్లారు జగన్‌. వైకాపా ప్రభుత్వ చర్యల వల్ల కొత్తవాళ్లు ముందుకురావడం పక్కన పెడితే.. ఆసక్తి ఉన్నవాళ్లు సైతం నిరాశకు గురవుతున్నారు.

పారిశ్రామికవాడకు రెండుసార్లు శంకుస్థాపన చేసినా...

రాజానగరం నియోజకవర్గం కలవచర్లలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 104 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇక్కడ రూ.20.65 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పూర్తవ్వకుండానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబరు 29న వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ 369 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు అయిదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇవే పనులకు టెండర్లు పూర్తయిన తరువాత ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేస్తోందన్న హడావుడిలో ఈ ఏడాది మార్చి 12న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, స్థానిక ఎమ్మెల్యే రాజాతో కలిసి మరోసారి శంకుస్థాపన చేసి నిరుద్యోగులకు తామేదో ఉద్ధరించేస్తున్నట్లు ప్రగల్భాలు పలికారు. 50 రోజులు దాటుతున్నా తట్టెడు మట్టి వేయకపోగా.. వేసిన శిలాఫలకాన్ని సైతం మాయం చేశారు.

కలవచర్లలో పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలం

 తెదేపా హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కడియం మండలం జేగురుపాడులో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. 20 రకాల పరిశ్రమలకు సంబంధించి 216 యూనిట్లు మంజూరు చేశారు. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లపట్టాలుగా ఇచ్చేసింది. ఆ స్థలానికి ప్రత్యామ్నాయంగా రాజానగరం మండలం కలవచర్లలో స్థలాన్ని సేకరించారు.

స్థలం ఎక్కడుందో అధికారులకే తెలియదు..!

గత ఏడాది అక్టోబర్‌ 4న తాడేపల్లి నుంచి వర్చువల్‌లో కోరుకొండ మండలం కణుపూరులో హైటెక్‌ ఫార్మా మిల్లెట్‌ ప్రాసెస్‌ యూనిట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు 3 ఎఫ్‌ ఆయిల్‌పామ్‌తో రూ.250 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు స్థలం ఎక్కడుందో అక్కడి అధికారులకే తెలియందంటే.. జగన్‌ జమానాలో నిరుద్యోగులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని