logo

రాజానగరంలో ఎత్తుగడ

జనసేనాని పవన్‌కల్యాణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం.

Published : 27 Apr 2024 06:22 IST

బత్తుల పేరుతో ఆరుగురు అభ్యర్థులు

 

సీతానగరం, న్యూస్‌టుడే: జనసేనాని పవన్‌కల్యాణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. తెదేపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంపై జనసేన అధ్యక్షుడే స్వయంగా ప్రకటించడంతో నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బీవీఆర్‌ చౌదరి ఒక్కమాట కూడా మాట్లాడకుండా జనసేన అభ్యర్థిని బలపరిచారు. అసంతృప్తులను బుజ్జగిస్తూ బత్తుల బలరామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ స్థానం జనసేనకు కేటాయించడంతో ఒక బలమైన సామాజిక వర్గంలో వచ్చే వ్యతిరేకత, తమకు అనుకూలంగా మారుతుందని వైకాపా భావించింది. ఆ దిశగా పావులు కదిపినా లబ్ధి పొందలేకపోయింది. దీంతో మరో కొత్త ఎత్తుగడను తెరమీదకు తెచ్చింది.

వెతికి మరీ తీసుకొచ్చారు..

తొలుత 50 వేల మెజార్టీతో గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేసిన వైకాపా నాయకులు.. ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇక కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేరు కలిగిన వ్యక్తులను ఇతర జిల్లాల నుంచి మరీ తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు. రాజానగరం అసెంబ్లీతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంటు సీటుకు నామినేషన్‌ వేయించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థులుగా, నవరంగ కాంగ్రెస్‌, జాతీయ జనసేన పార్టీల తరఫున ఆరుగురు అదే పేరుతో ఉన్నారు. జనసేన అభ్యర్థి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పేరుతో ఉన్న మరో ఇద్దరు మహిళలతోనూ నామినేషన్లు వేయించారు. వీరంతా పల్నాడు, కాకినాడ, అమరావతి కృష్ణా జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం.  

పక్కా ప్రణాళికతో..

బత్తుల పేరుతో ఉన్న మిగతా అభ్యర్థులకు ఓట్లు వేయడంతో తమకు ప్రయోజనం చేకూరుతుందని వైకాపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఓటింగ్‌ సమయంలోనూ రెండు బ్యాలెట్‌ల వద్ద బత్తుల పేర్లు కనిపించి క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందనేది వైకాపా నేతల విశ్వాసం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని