logo

అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ

సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది.

Published : 27 Apr 2024 06:25 IST

జిల్లా కేంద్రంలో పలువురి నేతల ఆగడాలు
కమీషన్ల పేరిట కాసుల వసూళ్లు
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. అధికారమే అండగా అధికార పార్టీ నేతలు అందినంత దోచేస్తుకున్నారు. ఈ అయిదేళ్ల పాలనలో అధికారం అడ్డు పెట్టుకొని జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో ప్రజా పాలనకు అడ్డుతగిలి ఇష్టానుసారం వ్యవహరించారు. ఓ వైపు నగరపాలక సంస్థలో పెత్తనం చెలాయిస్తూ అభివృద్ధికి అడ్డుపడగా.. మరోవైపు పనుల పేరుతో రూ.లక్షలు గుంజుకొన్న విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతా గుత్తేదారే చూసుకుంటారు

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువులుగా ఉన్న గుత్తేదారుడు నగరపాలక సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కీలక పనుల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పనుల్లో కమీషన్లు కార్యాలయంలో జమ చేసేందుకు సేకరిస్తూనే, తానుకూడా బాగా బాగుపడినట్లు వినిపిస్తోంది. కొంతమంది గుత్తేదారులను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు సమాచారం.

ఖాళీ స్థలాలపై కన్ను..

ఖాళీ స్థలాల ఆక్రమణకు ప్రత్యేకంగా బ్యాచ్‌ తిరుగుతోంది. సమీప నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తోంది. ఉద్యోగం, ఇతర కారణాలతో విదేశాల్లో ఏళ్ల తరబడి ఉన్నవారిని గుర్తించి వారి ఆస్తులపై కన్ను వేస్తారు. దొంగపత్రాలు సృష్టించి తిరిగి వారితోనే ఈ స్థలాలు మావి అంటూ తగాదాలకు దిగి రాజీచేసే ప్రయత్నంలో రూ.లక్షలు గుంజుకొంటున్నారు. ఇటీవల చెన్నై ఎల్‌అండ్‌టీ కంపెనీ ఇంజినీరుకు చెందిన కొంతమూరు పరిధిలోని రెండు ప్లాట్లు కబ్జా చేసిన సంఘటనలో ఆయన నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లాలాచెరువు, బొమ్మూరు జాతీయ రహదారిని ఆనుకొని రూ.కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసిన ఘటనలో ఇంకా విచారణ జరుగుతోంది. నగరంలో భూతగాదాల్లో తలదూర్చి చక్కబెట్టినందుకు రూ.15-25 లక్షల వరకూ డిమాండ్‌ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ః రోడ్డు పక్కన వ్యాపార సంస్థలు, దుకాణాలు ఏర్పాటు చేయడం, అక్కడికి ఏ ప్రభుత్వ సిబ్బంది రాకుండా అడ్డుపడటం, వ్యాపార సంస్థలు పెట్టిన వారినుంచి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది.

బ్లేడ్‌ బ్యాచ్‌కు అండగా..

ఆర్యాపురంలో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలపై నేరుగా మహిళలు ధర్నాకు దిగిన ఘటనలున్నాయి. అధికార పార్టీ నేతలు బ్లేడ్‌ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి మనుషుల వ్యవహారాల్లో పోలీసులు తలదూర్చరు. పోలీస్‌ స్టేషన్లలో కూడా వీరికి ప్రత్యేకంగా సహకరించే యంత్రాంగం ఉంటుంది. ఇంతకముందు పనిచేసిన ఎసీˆ్ప ఏకంగా 240 మందిపై కేసులు పెట్టారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

నగరపాలక సంస్థపై పెత్తనం

నగరానికి చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు నగర సమీప నియోజకవర్గ నేత వర్గీయులు నగరపాలక సంస్థలో పాగా వేశారు. కొంతమంది అధికారులు వారికి సహాయకారులుగా ఉంటూ పనులను చక్కబెడుతున్నారు. వీరి అండ చూసుకొని ఉన్నతాధికారులను లెక్క చేయడం లేదు. కొంతమంది గతంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ రాజకీయ జోక్యంతో ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. ప్రధానంగా భవన నిర్మాణ అనుమతులు, రోడ్లపై వ్యాపారాల నిర్వహణ, దుకాణాలు కట్టబెట్టడం, మున్సిపల్‌ పనులు అప్పగించడం.. ఇవన్నీ నిర్దేశించిన వారికి కేటాయించేందుకు పట్టుబట్టడమే వీరి లక్ష్యం. ప్రతి అభివృద్ధి పనిలో తలదూర్చి అనుకూలంగా మార్చుకోవడం ఆనవాయితీగా మారింది.  

భవనానికి ఓ రేటు

మెయిన్‌రోడ్డు, కంబాలచెరువు, దేవీచౌక్‌, తాడితోట, దానవాయిపేట, ప్రకాశంనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులు, భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలు చేపట్టాలంటే ఇద్దరు అధికార పార్టీ నేతల వద్దనున్న ఎవరో ఒకరిని ఆశ్రయిస్తే సరిపోతుంది. వెంటనే వారి అనుయాయులు వచ్చి ధర నిర్ణయిస్తారు. ఇటీవల కాలంలో నల్లమందు సందు, గంటాలమ్మగుడి వీధి, గుండువారి వీధిలో భవన నిర్మాణాల కోసం రూ.5 లక్షల -15 లక్షల వరకూ ఒక్కొక్కరి నుంచి వసూలు చేశారు. డబ్బు చేతికి అందగానే నేరుగా మున్సిపల్‌ అధికారుల ఫోన్‌ వెళ్లిపోతుంది. అటువైపు కన్నెత్తి చూడరు. ఒక్క మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఇలా 20 నుంచి 30 భారీ భవనాలకు సొమ్ము లాగేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని