logo

అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి

ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్‌టాప్‌ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు.

Updated : 27 Apr 2024 06:36 IST

పలువురికి పథకం దూరం చేసిన వైకాపా సర్కారు

మీ పిల్లల చదువులకు పెట్టుబడి కోసం ఆలోచించకండి..  నేనే చదివిస్తా..  మేనమామలా ఆదుకుంటా.. అందరికీ ఫీజు మేమే చెల్లిస్తాం.. అమ్మఒడి పేరుతో నగదు నేరుగా అమ్మల ఖాతాలకే జమ చేసేస్తాం.
ఇదీ.. ఎన్నికల ముందు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ. ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామన్నారు. 2019-20లో అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 9న అట్టహాసంగా ఈ పథకం ప్రవేశ పెట్టారు.   జిల్లాలో అర్హత ఉండి ఎంతోమంది అమ్మఒడికి దూరమయ్యారు. నిబంధనలు ముడిపెట్టి లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేయడానికి ప్రభుత్వం పన్నిన పన్నాగంలో  పలువురికి పథకం దరిచేరకుండా పోయింది.

న్యూస్‌టుడే, పామర్రు తూ.గో.


ల్యాప్‌టాప్‌లంటూ హడావుడి చేసి..

ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్‌టాప్‌ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 76 వేల మంది వరకూ ల్యాప్‌టాప్‌లు కావాలని దరఖాస్తులు ఇచ్చారు. ల్యాప్‌టాప్‌ ధర రూ.25 వేలు దాటిపోతోందని కొటేషన్‌ రావడంతో అమ్మఒడి కన్నా ఎక్కువ ఖర్చు అయిపోతోందని, అది సానుకూలం కాలేదని చేతులెత్తేశారు.

కోసిన నిధులు జమచేయడం మానేశారు

మొదటి ఏడాది రూ.15 వేలు ఇచ్చారు. తరువాత వెయ్యి రూపాయలు తగ్గించారు. మరుసటి ఏడాది మరో రూ.వెయ్యి తగ్గించారు. ఒక వెయ్యి మరుగుదొడ్ల నిర్వహణకు, మరో వెయ్యి పాఠశాల నిర్వహణకు అన్నారు. మొక్కుబడిగానే ఈ నిధులను జమ చేశారు. ఈ నిధులను పాఠశాలల ఖాతాలకు వేయకుండా వేరే అవసరాలకు మళ్లించేశారు. ఇలా ప్రతి తల్లి సుమారుగా ఏడాదికి ఆరువేల రూపాయలను కోల్పోయారు. ఇలా ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30 కోట్లు నష్టాన్ని మిగిల్చారు.

వెయ్యి.. వెయ్యి తగ్గించి...

  • 1 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో బడి మానేయకూడదనే ఉద్దేశం అని చెప్పి వైకాపా ప్రభుత్వం 2019-20లో ఈ పథకాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రారంభంలో రూ.15 వేలు ఇచ్చారు. 2020-21కు సంబంధించి వెయ్యి రూపాయిలు తగ్గించి రూ.14 వేలు మాత్రమే తల్లుల ఖాతాకు జమచేశారు.
  • మిగిలిన వెయ్యి పాఠశాలల తల్లిదండ్రుల ఖాతాకు జమకాలేదు
  • 2021-22కి సంబంధించి జూన్‌లో అమ్మఒడి ఇస్తామన్నారు. ఇపుడు మరో రూ.వెయ్యి తగ్గించారు. దాంతో కోత రూ.2 వేలకు చేరింది. ఇచ్చే రూ.13 వేలు.. అవీ పలువురి ఖాతాల్లో పడలేదు.

రూ.683 కోట్లు మిగుల్చుకున్నారు..

ఏటా అమ్మఒడి నిధులు ఇస్తామన్నారు. మొదటి రెండు సంవత్సరాలూ జనవరిలో ఇచ్చారు. మూడో సంవత్సరం నుంచి జూన్‌లో లబ్ధి ఇవ్వడం మొదలు పెట్టారు. దీనికి హాజరు శాతాన్ని వంకగా చూపారు. విద్యార్థి పాఠశాలకు వచ్చే రోజులు పూర్తవ్వాలి.. కదా అన్నారు. దీంతో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు నిధులు ఇవ్వలేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.683 కోట్లను మిగిల్చుకున్నారు.

లబ్ధిదారులను దూరం చేశా రిలా..

  • హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో పిల్లవాడు, తల్లి ఒకే మ్యాపింగ్‌లో ఉండాలి.

అసలు మ్యాపింగే పూర్తి చేయలేదు

  • పిల్లల 75 శాతం హాజరు విధిగా నమోదై ఉండాలి.

దీనివల్ల హాజరు శాతం కాదు కదా బడిలో చేరికలే తగ్గిపోయాయి.

  • వివరాలు సీఎస్సీసైట్‌లో ఛైల్‌ ఇన్ఫో డేటాతో సరిపోవాలి.

 ఇది  లబ్ధిదారుల సంఖ్యను  భారీగా తగ్గించడానికి సాధనగా మారింది.

  • కరెంటు బిల్లు నెలకు రూ.300 కన్నా తక్కువగా ఉండాలి.

 విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచేసి బాదుడే బాదుడు అనేలా బిల్లులు వసూలు చేస్తున్నారు.

  • అప్‌డేట్‌ ఈకేవైసీ పిల్లవాడు చేయించుకుని ఉండాలి.

బ్యాంకులకు వెళ్లి చేయించుకోలేని లబ్ధిదారులు పథకానికి దూరమయ్యారు.

  • నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.

అద్దెకు తిప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న వాహనాలను కూడా లెక్కలోకి తీసుకు న్నారు.

  • బ్యాంకు అకౌంట్‌ నంబరు ఆధార్‌కు లింక్‌ అయిందో లేదో సరిచూసుకోవాలి.

 అలా చేసుకోవడం చాలా మందికి తెలియ లేదు.

  • ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపు పన్ను కట్టేవారికి అమ్మఒడి పథకం వర్తించదు.

 రూ.10 వేల ప్రభుత్వ ఆదాయం పొందే చిరుద్యోగులను సైతం ఈ జాబితాలో చేర్చేశారు.

  • బియ్యం కార్డు కొత్తది కావాలి.

ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేయడమే మానేసింది.

  • ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్‌పీసీఐ చేయించుకోవాలి.

ఎన్‌పీసీఐ చేయాలంటే మొదటగా ఆధార్‌ కార్డుకు చరవాణి నంబర్‌ లింక్‌ చేసుకోవాలి. ఇది చేయించుకున్న తరువాత బ్యాంకుకు వెళ్లాలి. ఇవేవీ తెలియని పలువురు తల్లులు.. లబ్ధి వస్తే వస్తుంది.. లేకపోతే పోతుందని ఊరుకున్నారు.

సాంకేతిక కారణాలంట...

గోపాలపురం: పథకం అమలు చేసిన ఏడాది మా అబ్బాయి శేషువర్మకు సంబంధించి సొమ్ములు జమ అయ్యాయి. తీర రెండో ఏడాది ఏ కారణం చెప్పకుండా పథకం నిలిపి వేశారు. మొదట్లో కార్యాలయాల చుట్టూ తిరిగితే అసలు సమాధానం చెప్పేవారు కాదు. కొద్ది రోజుల అనంతరం సాంకేతిక కారణాల వల్ల అమ్మఒడి నిలిచిపోయినట్లు తెలిపారు. ఆరా తీస్తే విద్యుత్తు బిల్లు ఎక్కువగా వస్తోందని చెబుతున్నారు. మాది చాలా సాధారణ కుటుంబం. అయినా అమ్మఒడి ఆపేయడం దారుణం.

కొడవటి రాణి, ఉప్పరగూడెం

కార్యాలయాల చుట్టూ తిరిగాం

శ్యామలాసెంటర్‌: నేను తొమ్మిదో తరగతి చదువుతుండగా అమ్మఒడి పథకం నిధులు జమయ్యాయి. పదోతరగతి చదువుతుండగా ల్యాప్‌టాప్‌ కావాలా.. నిధులు కావాలా అన్నప్పుడు ఎంపిక సమయంలో ల్యాప్‌టాప్‌పై ఆమోదం తెలిపాను. ఆ ఏడాది ల్యాప్‌టాప్‌, అమ్మఒడి నిధులు రెండూ రాలేదు. ఇందుకోసం నా తండ్రి లక్ష్మణరావు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇప్పటివరకు జమ కాలేదు.

పి.శ్రీదేవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని