logo

ఏదో జరుగుతోంది..!

కాకినాడ జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సమయంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు అందజేసినా జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated : 08 May 2024 07:33 IST

పోస్టల్‌ బ్యాలట్‌ జాబితాలో పేర్లు గల్లంతుతో ఉద్యోగుల అంతర్మథనం
జిల్లాస్థాయి కేంద్రం వద్ద మళ్లీ గందరగోళం

ఉద్యోగులతో చర్చిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

కాకినాడ కలెక్టరేట్‌: కాకినాడ జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సమయంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు అందజేసినా జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మరోవైపు వీటి జారీ విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

పదేపదే ఎందుకిలా..?

ఈ నెల 4 నుంచి కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అవకాశం కల్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వెళ్లిన కొందరు ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఓటరు జాబితాలో పేర్లు లేవని, మీ సొంత నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారి వద్ద ఓటు వినియోగించుకోవాలని సూచించడంతో అధికారుల తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ స్పందించి మంగళవారం నుంచి రెండు రోజులపాటు కాకినాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అనుమతించారు. ఈ మేరకు పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో జిల్లాస్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

మళ్లీ అదే కథ

మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లుకు అవకాశం కల్పించారు. వీరిలో పదుల సంఖ్యలో ఉద్యోగుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పడంతో కంగుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను ప్రశ్నించారు. ఒక దశలో నిరసన తెలిపారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారి, జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. జాబితాలో పేర్లు లేని ఉద్యోగుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. వీరందరికి బుధవారం ఇక్కడే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న ఉద్యోగులు ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే అవకాశం కల్పించారు. అందులోనూ కొందరి పేర్లు జాబితాలో లేకపోవడంతో వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు.

ఇతర జిల్లాల ఓటర్లకూ తిరస్కారం..

తిరుపతి జిల్లాలో ఓటున్న ఒక వైద్యురాలు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. ఆమె నాగులాపల్లి పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఓటేయానికి వెళ్తే.. లేదు పొమ్మమన్నారని సదరు వైద్యురాలు ‘ఈనాడు-ఈటీవీ’ వద్ద వాపోయారు. ఇలా పలు జిల్లాలకు చెందిన వారికి ఇక్కడ ఓటు ఇవ్వలేదు.

అందరికీ ఓటిచ్చేందుకు ఏర్పాట్లు..

కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో గందరగోళం నెలకొందని తెలుసుకున్న కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ హుటాహుటిన ఇక్కడకు చేరుకుని ఉద్యోగులతో చర్చించారు. వివిధ కారణాలతో కొందరికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ కాలేదన్నారు. వీరందరికి బుధవారం ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ దరఖాస్తు అందజేయాలని, వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయించి, ఓటు వేసే అవకాశం ఇస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు