logo

2.50 లక్షల మందికి పెంచిన పింఛను అందిస్తాం

కూటమి ప్రభుత్వం రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాలు, మ్యానిఫెస్టో అమలు చేసి అభివృద్ధి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతామని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి, దివంగత లోక్‌సభ సభాపతి జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథూర్‌ చెప్పారు.

Updated : 08 May 2024 07:29 IST

మహిళ, యువత, రైతులకు అండగా నిలుస్తా
అమలాపురం ఎంపీ (కూటమి) అభ్యర్థి హరీష్‌ మాథుర్‌

కూటమి ప్రభుత్వం రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాలు, మ్యానిఫెస్టో అమలు చేసి అభివృద్ధి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతామని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి, దివంగత
లోక్‌సభ సభాపతి జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథూర్‌ చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తామని, ఉపాధి దొరికేవరకు ప్రతినెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. ప్రతినెలా రూ.1,500 అందిస్తామన్నారు. నాన్న ఆశయం, కోనసీమ వాసుల చిరకాల కోరిక.. పచ్చని కొబ్బరి తోటల మధ్య కూత పెడుతూ రైలు పరుగులు సాకారం చేస్తామన్నారు. కూటమి మ్యానిఫెస్టోతో ప్రజలకు జరిగే మేలును ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన వివరించారు.

ఈనాడు, రాజమహేంద్రవరం

మహిళలకు మహాపీఠం వేసిన చంద్రబాబు

ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున  అందజేస్తాం.

  • తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అందరికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇచ్చి ప్రోత్సహిస్తాం. జిల్లాలోని సుమారు   1.40 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది.
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల వరకు పరిమితి పెంచుతాం. జిల్లాలోని సుమారు 3.5 లక్షల మందికి ఆర్థిక చేయూత లభిస్తుంది.
  • సుమారు 3,500 మందికి ప్రయోజనం కలిగేలా అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ చెల్లింపు, ఆశ కార్యకర్తల వేతనం పెంపునకు కృషిచేస్తాం.

ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ యువతకు నమ్మక ద్రోహం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్పీ పైనే. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

ప్రణాళికలు పూర్తిచేసి ప్రజల హృదయాల్లో నిలుస్తా

కోనసీమలో 1996లో తుపాను సమయంలో అధినేత చంద్రబాబుతో కలిసి నాన్న జీఎంసీ బాలయోగి స్థానికంగా రింగ్‌ రోడ్‌ అవసరాన్ని గుర్తించారు. దాని పూర్తికి కృషి చేస్తా. గతంలో రూపొందించిన ప్రణాళికలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పూర్తి చేసి ప్రజల హృదయాల్లో స్థానం పొందుతా.

తొలి సంతకం డీఎస్సీపైనే..

కోనసీమ ప్రాంతం నుంచి విదేశాలకు ఎక్కువ మంది వెళ్లే క్రమంలో ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. యువతకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచి స్థానిక చమురు, ఇతర సంస్థల్లో ఉపాధి కల్పిస్తాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తాం. సీఎం జగన్‌ మాదిరిగా అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేయడం కాదు.. సంపద సృష్టించి అన్ని వనరులు సమకూర్చుతాం.

ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను..

తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4 వేల పింఛను ఇంటి వద్దకే ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ మొత్తం ఏప్రిల్‌ నుంచి అందిస్తాం. జిల్లాలో సుమారు 2.50 లక్షల మందికి భరోసా లభిస్తుంది. ప్రతి ఇంటికీ రక్షిత జలాలు, రోడ్ల నిర్మాణం, కోనసీమలో కాజ్‌వేలు నిర్మిస్తాం. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, రేషన్‌ పంపిణీ విధానాన్ని బలోపేత చేసి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతాం.

పంటకు కాదు.. వైకాపాకు రాజకీయ విరామం

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు పంట విరామం అనే మాట వినిపించదు... వైకాపాకు రాజకీయ విరామం తప్పదు. రైతుకు ఏటా రూ.20 వేలు పంట సాయం అందిస్తాం.

జిల్లాలో 1.50 లక్షల మంది రైతులున్నారు. వైకాపా ప్రభుత్వం కాలువల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో శివారు ప్రాంతాలకు నీరందక రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితికి వచ్చారు. సాగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రాయితీపై సోలార్‌ పంపుసెట్టు, ఇతర పరికరాలు అందిస్తాం. కౌలు రైతులను ఆదుకుంటాం.

కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తా

కోనసీమలో పర్యాటక రంగం అభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరులన్నీ సద్వినియోగం చేసుకుంటాం. టెంపుల్‌, రివర్‌ టూరిజాన్ని వృద్ధిచేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గానికి అనుసంధానంగా రైలు మార్గం వస్తే స్థానిక ఆక్వా, కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతులకు అవకాశం మెరుగుపడుతుంది. ప్రధానంగా విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టిసారిస్తా.

ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు

వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వర్తించారు. పోలీసులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని వర్గాలూ నలిగిపోయాయి. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలన్నీ కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఒకటో తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు