logo

ఓట్లకు ‘సామాజిక’ గాలం

 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

Published : 10 May 2024 05:12 IST

జాబితాల తయారీలో అధికార పార్టీ నేతలు
న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

  • అమలాపురం మండలంలోని ఓ గ్రామంలో అత్యధికంగా ఓ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. వీరి ఓట్లు కూటమికి పడే అవకాశం ఉంది. దీంతో ఈ గ్రామంపై వైకాపా నేతలు గురిపెట్టారు. కూటమికి వేస్తారనుకునే ఓట్లను చీల్చేందుకు గాలం వేస్తున్నారు. ప్రధానంగా జాబితాను సిద్ధం చేయాలని చోటామోటా నేతలకు నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
  • ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామంలో ఓసీ, ఎస్సీ సామాజిక వర్గాలు బలంగా ఉన్నచోట్ల వైకాపా పాగా వేయాలని చూస్తోంది. ఈ గ్రామంలో ఓటుకు అధిక మొత్తంలో నగదు పంపిణీ చేసి కూటమి ఓట్లు చీల్చేందుకు పావులు కదుపుతున్నారు. రాత్రి వేళల్లో నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడంతోపాటు ఏ ఓటు ఎవరికి పడుతుందో అంచనా వేసి తద్వారా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇందులో కూటమి అభ్యర్థి బలంగా ఉన్నారని.. వారి ఓట్లు చీల్చేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

నేతలతో చర్చలు

నియోజకవర్గంలో అమలాపురం పట్టణం, గ్రామీణం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలున్నాయి. వీటి పరిధిలో రెండు లక్షలకు పైగా ఓట్లున్నాయి. వీటిలో అధిక శాతం ఎస్సీ, కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవే కావడంతో వారి ఓట్లపైనే రెండు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. కూటమి అభ్యర్థికి మూడు సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు సగానికిపైగానే పడతాయనే నమ్మకంతో ఉన్నారు. దీంతో ఆ వర్గాలపైనే వైకాపా నేతలు దృష్టి సారిస్తున్నారు. గ్రామ, వార్డు స్థాయిల్లోని వైకాపా నేతలతో నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడే అవకాశాలున్నాయో బేరీజు చేసుకునే పనిలో కీలక ప్రజాప్రతినిధి తలమునకలవుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం నేతలతో మాట్లాడటంతోపాటు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితులు తెలుసుకుంటున్నారు.

ఓట్ల లెక్కలు.. తాజా అంచనాలు..

గత ఎన్నికల్లో ఏ గ్రామం నుంచి ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా కొనుగోలు చేశామనే లెక్కలతోపాటు తాజాగా ఎన్ని ఓట్లు వస్తే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందనే అంశాలపైనా చర్చలు సాగిస్తున్నారు. ప్రధానంగా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు ఎస్సీల్లో తమకు అనుకూలంగా లేని ఓటర్లపైనా దృష్టి సారిస్తున్నారని విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

దశల వారీగా పంపకాలు..

మూడు దశల్లో పంపకాలు చేపట్టేందుకు వైకాపా నేతలు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. తటస్థ ఓటర్లకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. వైకాపా నేతలు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తారనే వాదన వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు