logo

ఖరీఫ్‌ ఎరువుల ప్రణాళిక ఖరారు..!

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్‌లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 17 May 2024 05:20 IST

ఏటా ప్రైవేటుగా కొనే దుస్థితి ఏలని రైతుల ఆవేదన

అల్లవరం రైతు భరోసా కేంద్రంలో ఎరువుల నిల్వలు పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

అన్నదాతలకు సాగులో పంటల దిగుబడి పెంచడంలో ఎరువులు కీలక భూమిక పోషిస్తాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఎరువులకోసం అన్నదాతలు రైతుభరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పూర్తి స్థాయిలో అవి అందడం లేదు. గడిచిన రబీలో అన్నదాతలను ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. సకాలంలో ఎరువులు అందక చేలల్లో భూసారం తగ్గి ఆ ప్రభావం నేరుగా పంట దిగుబడిపై పడింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువుల సరఫరాలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాగుకు అవసరమైన ఎరువుల ప్రణాళిక ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్‌లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కొరవడిన  నియంత్రణ

కొందరు ప్రైవేటు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్న సంఘటనలు ఉంటున్నాయి. ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హెచ్చరికలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎరువుల కొరత ఏర్పడినపుడు వ్యాపారులు చెప్పిన ధరకే వాటిని కొనుగోలు చేయాల్సివస్తోందని, దీని వల్ల తమపై అధిక భారం పడుతోందని కర్షకులు వాపోతున్నారు. అధికారులు ఎరువుల విక్రయ దుకాణాలపై గట్టి నిఘా ఉంచి అధిక ధరలు, కల్తీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

42,689 మెట్రిక్‌ టన్నులకు అంచనా..

జిల్లాలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు అన్ని రకాల రసాయన ఎరువులు కలిపి 42,689 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు. రైతులకు కావాల్సిన ఎరువులను పూర్తి స్థాయిలో ఆర్‌బీకేల్లో నిల్వఉంచాలి. జిల్లాకు వచ్చిన ఎరువుల కోటాలో ప్రైవేటు వ్యాపారులకు కేటాయించిన అనంతరం అన్నదాతలకు రైతుభరోసా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా అమ్మాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో 38,049 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిలబడే రకాలకు  ప్రా‘ధాన్యం’..

ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముంపును తట్టుకునే వరి ధాన్యం రకాలనే సాగు చేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఎంటీయూ విభాగానికి చెందిన 1318, 1064, 1061 రకాలను ఎంచుకోవాలంటున్నారు. వీటి పంట కాలం 150 రోజులు ఉంటుంది. ప్రైవేటు రకానికి చెందిన సంపద ఎన్‌పీ 9558 పంట కాలం 135 రోజులైనా, ఈ రకాలు ఈదురు గాలులకు తట్టుకుని నిలబడతాయంటున్నారు. స్వర్ణ రకానికి చెందిన 7029 అధిక దిగుబడి ఇచ్చినా ముంపునకు పడిపోతుందని, రైతులు నష్టాల బారినపడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తిగా  అందుబాటులో ఉంచుతాం

జిల్లావ్యాప్తంగా మండలం, డివిజన్‌ల వారీగా ఏ రకం ఎరువులు ఎన్ని మెట్రిక్‌ టన్నులు అవసరమో వ్యవసాయ సిబ్బంది ద్వారా సమాచారం సేకరించాం. జిల్లాకు కేటాంయించిన ఎరువుల్లో 50 శాతం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి మిగతాది సహకార సంఘాలు, ఆర్‌బీకేల ద్వారా అమ్మేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం.

 వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని