logo

ఏటా మాటలు.. ఇవ్వరే మూటలు?

నాగార్జునసాగర్‌ కుడి కాలువ పరిధిలో గత ఐదేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.

Updated : 26 May 2024 05:08 IST

ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు
మరమ్మతుకు నోచుకోని కాల్వలు
8.48లక్షల ఎకరాల ఆయకట్టుపై నీలినీడలు
ఈనాడు-అమరావతి

పెదనందిపాడు బ్రాంచ్‌ కాలువలో పెరిగిన పిచ్చిమొక్కలు

నాగార్జునసాగర్‌ కుడి కాలువ పరిధిలో గత ఐదేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నీటితీరువా వసూలు కాకపోవడం, ప్రభుత్వం నుంచి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో నిధుల కొరత వెంటాడుతోంది. ఏటా క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు పంపడం.. నిధుల కొరతతో ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవడంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా కాలువ మరమ్మతుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 8.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. నిధుల కొరతతో ఇప్పటికీ కాలువల మరమ్మతుపై స్పష్టత లేకపోవడంతో జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా పనులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో కాల్వకట్టలు అధ్వానంగా ఉండడంతోపాటు పిచ్చిమొక్కలు పెరిగి నీటిప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస మరమ్మతు చేయకపోతే ఈఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పవని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.

గుంటూరు గ్రామీణ మండలం ఓబుళనాయుడుపాలెం వద్ద
కోతకు గురైన వంకాయలపాడు మేజరు కాలువ కట్ట

ఐదేళ్లుగా అటకెక్కిన నిర్వహణ

నాగార్జునసాగర్‌ కుడికాలువ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయకట్టు ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల నిర్వహణ అటకెక్కింది. ఏటా నిధులు మరమ్మతు చేసి నిర్వహణ చేపట్టకపోవడంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. గతేడాది సాగునీరు రాకపోవడంతో కట్టలు జారిపోయి కొన్నిచోట్ల బలహీనమయ్యాయి. గతేడాది కనీస మరమ్మతులు చేయడానికి సుమారు రూ.37కోట్లతో ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయాలని కోరారు.  బడ్జెట్‌లో రూ.2.04కోట్లు కేటాయించగా ఆ నిధులు కూడా గతంలో చేసిన బకాయిలకు రూ.2కోట్ల సొమ్ము జమకావడంతో కొత్తగా పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదనంగా మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వడంతో కొన్ని పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో గతేడాది కూడా కాలువల నిర్వహణ పనులు చేయలేకపోయారు. బ్రాంచ్, మేజరు కాలువల్లో కొన్నిచోట్ల రివెట్‌మెంట్లు, సిమెంట్‌ నిర్మాణాలు కూలిపోయాయి. మైనరు కాలువల్లో పిచ్చిమొక్కలు, తూటుకాడ పెరిగి నీటిప్రవాహం ముందుకు వెళ్లలేని పరిస్థితి. కాలువకట్టలు దెబ్బతిని కొన్నిచోట్ల పగుళ్లు వచ్చాయి. పిచ్చిమొక్కలు పెరిగి మైనరు కాలువలు ఆనవాలు కనిపించని పరిస్థితి నెలకొంది. కాలువల నిర్వహణ లేకపోవడంతో అత్యంత అధ్వానంగా తయారై నీటిప్రవాహం ముందుకు వెళ్లకుండా అడ్డంకులు ఉన్నాయి.  

కీలక సమయంలో నిర్లక్ష్యం

నాగార్జునసాగర్‌ కాలువల మరమ్మతులు నీటి విడుదలకు ముందే పూర్తి చేయాలి. ప్రస్తుతం కాలువలకు నీటి విడుదల లేనందున మరమ్మతు చేయడానికి అనువైన సమయం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే జులై నెల నాటికి పూర్తిచేయవచ్చు. కాల్వల్లో పిచ్చిమొక్కలు తొలగించడం, షట్టర్లు సరిచేయడం, కాలువకట్టలు బలోపేతం చేయడం, తూటుకాడ తీయడం వంటి చిన్న చిన్న పనులు రోజుల వ్యవధిలోనే పూర్తిచేయవచ్చు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి జలాశయాలకు నీరు వచ్చిన తర్వాతే కాలువలకు నీటిని విడుదల చేస్తారు. జూన్, జులై నెలలు కీలకమైనందున వెంటనే ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

ప్రతిపాదనలు సిద్ధం చేశాం

నాగార్జునసాగర్‌ కుడికాలువ పరిధిలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలు పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేసి సిద్ధం చేశారు. కాల్వల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నాం. అనుమతి ఇస్తే ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందిన వెంటనే పనులు చేపడతాం.

 వరలక్ష్మి, పర్యవేక్షక ఇంజినీరు, లింగంగుంట్ల సర్కిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు