logo

టిడ్కో ఇళ్లా?.. చూద్దాంలే!

గుంటూరు నగరంలోని పేద, మధ్య తరగతి వర్గాల కోసం అడవితక్కెళ్లపాడులో నిర్మించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎంతో ఆశతో వచ్చిన లబ్ధిదారులకు చివరకు నిరాశే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చటానికి పట్టణాల్లో ఇళ్లు నిర్మించి వాటిని రాయితీ ధరలకు కేటాయిస్తామని చెప్పటంతో చాలా మంది తమ వాటాను ముందుగానే

Published : 21 May 2022 04:12 IST

రిజిస్ట్రేషనుకు ఆ శాఖ మోకాలడ్డు

ఈనాడు-అమరావతి: గుంటూరు నగరంలోని పేద, మధ్య తరగతి వర్గాల కోసం అడవితక్కెళ్లపాడులో నిర్మించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎంతో ఆశతో వచ్చిన లబ్ధిదారులకు చివరకు నిరాశే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చటానికి పట్టణాల్లో ఇళ్లు నిర్మించి వాటిని రాయితీ ధరలకు కేటాయిస్తామని చెప్పటంతో చాలా మంది తమ వాటాను ముందుగానే డీడీ తీసి గుంటూరు నగరపాలక సంస్థకు అందజేశారు. ఆ ఇళ్లకు ఇప్పుడు మోక్షం కలిగింది. వాటిని లబ్ధిదారుని పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియను గుంటూరు నగరపాలక ప్రారంభించింది. అయితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. గుంటూరు కన్నా చిన్నదైన రాజమహేంద్రవరంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వటంలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. రోజుకు సగటున 200  ఇళ్లు రిజిస్ట్రేషన్‌చేసి ఇవ్వాలని 20-25 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆచరణలో ఆ లక్ష్యం నీరుగారిపోయింది. గుంటూరు, నల్లపాడు, కొరిటిపాడు, పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో సగటున 35-40 చేయటానికి వీలుగా మెప్మా సిబ్బంది లబ్ధిదారులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు తీసుకెళుతున్నారు. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు వీటికి అంతగా ప్రాధాన్యమివ్వటం లేదు. తీరిక ఉన్న సమయాల్లో వీటిని చేస్తున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా మార్టిగేజ్‌ చేసుకుని రుణాలు ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాయి. ఇదే జరిగితే  రిజిస్ట్రేషన్లు నెలల తరబడి జరిగే అవకాశం లేకపోలేదు. 

డీఆర్వో ఆదేశాలు బేఖాతరు

టిడ్కో ఇళ్లను ప్రాధాన్యక్రమంలో రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇంతకు ముందే డీఆర్వో సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. 4320 ప్లాట్లకు పక్షం రోజుల్లో కేవలం 1489 మాత్రమే చేశారు. రోజుకు నాలుగు కార్యాలయాల్లో కలిపి 90-100కు మించి చేయటం లేదు. ఒక్కో కార్యాలయంలో 30 చొప్పున చేసినా సగటున రోజుకు వందకు పైబడి అవుతాయి. అయితే ఆమేరకు చేయటం లేదు. ఈ రిజిస్ట్రేషన్లు వేగవంతం కావటానికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మిగిలిన కార్యాలయాల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై సమకూర్చుకుని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని