logo

హక్కులకు రక్షణ కవచాలు

ఇలా చదువుకు దూరమవడం, బాల్య వివాహాలు, శారీరక, మానసిక వేధింపులు బాలలకు శాపంగా మారుతున్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతున్నారు. తమకు హక్కులు ఉన్నాయన్న సంగతి కూడా వారికి తెలియదు.

Published : 26 Sep 2022 06:20 IST

గ్రామాల్లో బాలల పంచాయతీలే వేదిక  
నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే

సమావేశంలో సమస్యలపై చర్చిస్తున్న బాల, బాలికలు

ఇలా చదువుకు దూరమవడం, బాల్య వివాహాలు, శారీరక, మానసిక వేధింపులు బాలలకు శాపంగా మారుతున్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతున్నారు. తమకు హక్కులు ఉన్నాయన్న సంగతి కూడా వారికి తెలియదు. ఇందుకు ఒక వేదిక, ఆసరా అవసరమని చైల్డు రైట్స్‌ అడ్వకెసీ ఫౌండేషన్‌ (క్రాఫ్‌) స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. బాలల సమస్యలపై వారితోనే ఓ కమిటీ ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని భావించింది. అలా రూపుదిద్దుకున్నవే బాలల పంచాయతీలు. ఈ క్రమంలో క్రాఫ్‌ సంస్థకు జిల్లా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల సంరక్షణ కేంద్రం అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఒక్కొక్క బాల పంచాయతీలో 30 మంది బాల, బాలికలు ఉంటారు. ఆ గ్రామంలోని 13 నుంచి 18 ఏళ్ల లోపు 7వ తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ చదివే వాళ్లను తీసుకుంటారు. అన్ని సామాజిక తరగతుల వారు ఉంటారు. 30 మందితో ఒక కోర్‌ కమిటీని ఎన్నుకుంటారు. సర్పంచి, కార్యదర్శి, ముగ్గురు వార్డు సభ్యులు కూడా కోర్‌ కమిటీలో ఉంటారు. గ్రామ సర్పంచి ఛైర్మన్‌గా ప్రతి గ్రామంలో బాలల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు.


200కు పైగా సమస్యల పరిష్కారం..

క్రాఫ్‌ స్వచ్ఛంద సంస్థ గత ఏడేళ్లుగా బాలల హక్కుల పరిరక్షణ, వారిలో నాయకత్వ లక్షణాల పెంపుపై వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. క్రాఫ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ తంబి పర్యవేక్షణలో జిల్లాలో వెంకట్‌, జయరాజులు ఈ కార్యక్రమాలను సమన్వయపరుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు జిల్లాలో బాల పంచాయతీల ద్వారా గుర్తించిన 200కు పైగా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.


కమిటీ తీర్మానంతో...

ప్రతి నెల నిర్వహించే బాల పంచాయతీ సమావేశంలో సభ్యులు గుర్తించిన సమస్యలను కోర్‌ కమిటీ దృష్టికి తీసుకు వచ్చి ఒక తీర్మానం చేస్తారు. దానిని కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సర్పంచి ద్వారా సంబంధిత అధికారులు, ఆయా కుటుంబాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకు బాలల పంచాయతీకి ప్రజాప్రతినిధులు, గ్రామ మహిళా కార్యదర్శులు, జిల్లా బాలల సంరక్షణ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, క్రాఫ్‌ ప్రతినిధులు అన్ని రకాలుగా అండగా ఉంటారు.


స్నేహ గ్రామాలుగా 15 ఎంపిక...

బాల, బాలికలకు ఎటువంటి సమస్యలు లేకుండా బాలల స్నేహ గ్రామాలుగా తీర్చిదిద్దాలని భావించారు. జిల్లాలో 15 గ్రామాలు ఎంపిక చేసుకున్నారు. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, తంగెళ్లమూడి, అనమర్లపూడి, ఉప్పలపాడు, తుళ్లూరు మండలంలో అనంతవరం, వడ్లమాను, నెక్కొల్లు, బోరుపాలెం, తాడికొండ మండలంలో నిడుముక్కల, కంతేరు, లచ్చన్నగుడిపూడి, తెనాలి మండలంలో హాఫ్‌పేట, చేబ్రోలు మండలంలో చేకూరు, గుంటూరులో కృష్ణబాబుకాలనీ, కొండా వెంకటప్పయ్యకాలనీలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో బాలల హక్కులు, వాటి పరిరక్షణపై అవగాహన సదస్సులు, బాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

* 16 సంవత్సరాల బాలిక తండ్రి మృతి చెందాడు. మత్తుకు బానిసైన తల్లి పట్టించుకోవడం లేదు. బాలల పంచాయతీ గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యుసీ) ఆ తల్లికి కౌన్సెలింగ్‌ ఇప్పించడంతోపాటు బాలికను పునరావాస కేంద్రానికి తరలించారు. చేతి వృత్తులు నేర్పిస్తూ 10వ తరగతి ప్రైవేటుగా రాయిస్తున్నారు.

* అనారోగ్య సమస్యతో 6వ తరగతిలో బాలిక చదువు ఆపేసింది. అయిదేళ్ల తర్వాత ఆరోగ్యం కుదుట పడడంతో చదువుకోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న బాలల పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. ఆ బాలికతో ప్రైవేటుగా 10వ తరగతి రాయించారు. ఇప్పడు ఆ యువతి ఇంటర్‌ చదువుతోంది.

* ఓ గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు గుర్తించిన బాలల పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన అధికారులు దానిని నిలిపి వేయించారు.

పెద్దలు పట్టించుకోవాలి -ఫ్రాన్సిస్‌ తంబి, క్రాఫ్‌, రాష్ట్ర ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌

బాలల్లో చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో పంచాయతీల ఏర్పాటు చేపట్టాం. పిల్లలు సమస్యలు, వారి బాధలు చెప్పిన వెంటనే పెద్దలు పట్టించుకోవాలనేది మా ఉద్దేశం. ప్రతి గ్రామ, పట్టణాల్లో ఇటువంటి పంచాయతీల విధానాన్ని అంది పుచ్చుకొని వారి సమస్యల పరిష్కారానికి అందరూ చొరవ తీసుకుంటే బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని