logo

అధికార పార్టీనా..అయితే వదిలేయ్‌!

సోమవారం మధ్యాహ్నం.. తెలంగాణ నుంచి మాచర్ల వైపు వస్తున్న కారు రెంటచింతల వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడినట్లు తెలిసింది.

Published : 24 May 2023 05:35 IST

తెలంగాణ నుంచి భారీగా మద్యం రవాణా 
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఈనాడు - నరసరావుపేట, బాపట్ల : సోమవారం మధ్యాహ్నం.. తెలంగాణ నుంచి మాచర్ల వైపు వస్తున్న కారు రెంటచింతల వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడినట్లు తెలిసింది. ఈ కారు మాచర్ల పట్టణానికి చెందిన వైకాపా నేతకు చెందింది. కారు బోల్తా పడిన కొద్దిసేపటికే కొందరు వచ్చి కారు తీసుకెళ్లిపోవడంతో పాటు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో తెలంగాణ మద్యం ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు కేసు నమోదు చేయలేదు. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తుంటే సరిహద్దు తనిఖీ కేంద్రం పొందుగల వద్ద ఈ వాహనాన్ని తనిఖీ చేయలేదా? చేస్తే మద్యాన్ని గుర్తించినా నేతల ఒత్తిడితో వదిలేశారా? దారిలో దాచేపల్లి, గురజాల, రెంటచింతల పోలీసులు గుర్తించలేదా? వాహనంలో మద్యం లేనట్లయితే ఘటన జరిగిన వెంటనే వాహనాన్ని క్రేన్‌ తీసుకువచ్చి ఎందుకు తీసుకెళ్లారు? గాయపడిన వారిని ఎక్కడికి తరలించారన్న విషయం ఎందుకు గోప్యంగా ఉంచారు? బోల్తాపడిన వాహనం ఎవరిది? వంటి అంశాలన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అధికార పార్టీకి చెందినవారైతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్లు ఇక్కడి ఘటన నిలవడం నిదర్శనం.    

పల్నాడు జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలైన గురజాల, మాచర్లతోపాటు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోనూ తెలంగాణ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో వారి అనుచరులు యథేచ్ఛగా సరిహద్దు దాటించి ఇక్కడికి తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి బొలెరో వాహనాల్లో మద్యం రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరగానే సంబంధిత వాహనాల నంబర్లు సరిహద్దులో ఉన్న సిబ్బందికి పంపి వాటికి తనిఖీలు లేకుండా దాటిస్తున్నారు. కొన్నిసార్లు కృష్ణానదిపై పడవల ద్వారా పెద్దమొత్తంలో మద్యం ఏపీ వైపు తీసుకువస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా యంత్రాంగం అడ్డుకునే పరిస్థితి లేదు. పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని గ్రామాల్లో మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారమే అండగా అక్రమాలు

పల్నాడు జిల్లాలో సరిహద్దు నియోజకవర్గంలో మద్యం వ్యాపారం మొత్తం ఓ ప్రజాప్రతినిధి సోదరుడు తన గుప్పెట్లో పెట్టుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం మద్యం వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ అక్కడి మద్యం తెచ్చి ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు బార్లు సైతం తానే నిర్వహిస్తూ అన్ని బ్రాండ్లు తన బారులో మాత్రమే లభించేలా చక్రం తిప్పుతున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలకు వేలం నిర్వహించి పాటదారుల నుంచి రూ.లక్షల సొమ్ము డిపాజిట్లు రూపంలో తీసుకుని చక్రం తిప్పుతున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వినుకొండ రోడ్డులో ఒక బారులో ఏడుగురు వైకాపా నేతలు భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో నిత్యం తెలంగాణ బీర్లు విక్రయిస్తున్నారు. అదే విధంగా రొంపిచర్ల రోడ్డులోని మరో బారులో కూడా తెలంగాణ మద్యం ఎప్పుడూ లభిస్తోంది. ఇందులో ఒక ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉందని ప్రచారం జరగడంతో అటువైపు పోలీసులు, సెబ్‌ అధికారులు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానది సరిహద్దుగా ఉండటం, నిత్యం నీటిప్రవాహం ఉండటంతో పడవల ద్వారా అటు నుంచి సరకు రవాణా చేస్తున్నారు. స్థానిక పోలీసులు, సెబ్‌ అధికారులకు ఆయా ప్రజాప్రతినిధుల నుంచి మనవాళ్లే వదిలేయండంటూ కొందరి పేర్లు చెప్పడంతో వారు పట్టుబడినా వదిలేయాల్సిన దుస్థితి. మంగళవారం నరసరావుపేట నుంచి కోటప్పకొండ వైపు ఒక కారులో తెలంగాణ మద్యం తరలిస్తున్నారని సెబ్‌ అధికారులకు సమాచారం వస్తే ఆ కారును వెంబడించారు. అయితే యల్లమంద గ్రామం దాటిన తర్వాత కారు కనిపించలేదని వెనక్కి వచ్చేశారు. ఎవరి నుంచో ఒత్తిడి రావడంతోనే వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని