logo

హమ్మయ్యా.. మనోళ్లు కుశలమే!

ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు, క్షతగాత్రుల సమాచారం తెలుసుకోవటానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Published : 04 Jun 2023 04:54 IST

ఈనాడు-అమరావతి

తెనాలి హెల్ప్‌ డెస్క్‌లో అధికారులు, సిబ్బంది

ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు, క్షతగాత్రుల సమాచారం తెలుసుకోవటానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. గుంటూరు కలెక్టరేట్‌లోనూ రెవెన్యూ అధికారులు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రైల్వే ఉన్నతాధికారుల సమాచారం అందుకుని ఈ జిల్లాల వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఆ రైళ్లల్లో ప్రయాణించిన వారుంటే.. వారి కుటుంబీకులు, బంధువులు హెల్ప్‌లైన్‌కు సమాచారమివ్వాలని కోరారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తోందని వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు గుంటూరు కలెక్టరేట్‌కు సమాచారం అందింది.

సమాచారం తెలియక అవస్థలు...

రైల్వే ట్రాకు మరమ్మతుల కారణంగా గుంటూరు నుంచి బయలుదేరే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలను శనివారం నుంచి ఈనెల 9 వరకు ఆపేశారు. అయితే ఈ సమాచారం తెలియక కొందరు యథావిధిగా శనివారం ఉదయమే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. నిత్యం ఉదయం 8 గంటలకు ఇది గుంటూరులో బయలుదేరి సాయంత్రానికి విశాఖ చేరుకుంటుంది. విశాఖ వైపు ప్రయాణించే పేద, మధ్యతరగతి వర్గాలు వారు ఎక్కువగా సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. వారి రాకపోకలతో ప్రతి రోజు ఉదయం 7-8 గంటల మధ్య రైల్వే స్టేషన్‌ కిటకిటలాడుతుంది. అలాంటిది శనివారం బండి రద్దుతో స్టేషన్‌ కళ తప్పింది. అయితే ఒడిశా రైలు దుర్ఘటనకు, సింహాద్రి రద్దుకు సంబంధం లేదని ఈ రైలును ముందుగానే రద్దు చేశామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఇది మినహా గుంటూరు డివిజన్‌లో రైళ్లు ఏవీ రద్దు చేయలేదన్నారు. విశాఖ నుంచి ఒడిశా వెళ్లే మార్గంలోనే రైళ్లు రద్దుకావటం, రాకపోకలు మళ్లించటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనివల్ల అటు నుంచి ఇటు వచ్చే ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేరుకోవటానికి కొంత ఆలస్యమవుతుందని రైల్వేవర్గాలు వెల్లడించాయి.


గుంటూరు స్టేషన్లోనే పాట్లు

వీరంతా ఒడిశా ప్రాంతం వారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తారు. ఆయా ప్రాంతాల నుంచి వీరంతా గుంటూరు నుంచి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో తొలుత విశాఖ వెళ్లి అక్కడ నుంచి ఒడిశా చేరాలనుకున్నారు. సింహాద్రి లేకపోవడం.. అక్కడి నుంచి ఒడిశా వెళ్లే రైళ్లు రద్దు...
దారి మళ్లించారని తెలిసి స్టేషన్‌లోనే ఆగిపోయారు.


పిల్లలిద్దరినీ గట్టిగా పట్టుకున్నా..

- సయ్యద్‌ హబీబునీ, గుంటూరు

నా భర్త సయ్యద్‌ మదర్‌వలి.. పశ్చిమ బెంగాల్‌లో సిగ్నల్‌ రెజిమెంట్‌లో నాయక్‌గా పని చేస్తున్నారు. నెల రోజులు ఆయనకు శిక్షణ ఉండడంతో ఇద్దరు పిల్లలతో కలసి నేను గుంటూరు బయలుదేరా. నా భర్త సహోద్యోగి మణిబాబు కుటుంబం విశాఖ వరకు వస్తుండడంతో వారితో కలిసి కోరమాండల్‌ ఎక్కాం.  పెద్ద శబ్దంతో ప్రమాదం జరగ్గా.. ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. భయమేసి.. నిద్రపోతున్న పిల్లల్ని గట్టిగా పట్టుకున్నా. మా బోగీలో ఉన్న కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

న్యూస్‌టుడే, విజయవాడ.


సహాయ కేంద్రాల ఏర్పాటు

కలెక్టరేట్‌ (గుంటూరు), గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి తక్షణ సహాయం కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 0863 2234014 నంబరును సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

* కోరమాండల్‌ ఘటన నేపథ్యంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ శనివారం తెలిపారు. ఇందులో ఎస్సై సెల్‌ నంబర్‌ 8688831362 సంప్రదించాలన్నారు. జిల్లా పోలీసు కంట్రోల్‌ రూం నంబర్‌ 8688831568 అందుబాటులో ఉంటుందన్నారు. ఆయా రైళ్లల్లో ప్రయాణించిన వారు ఎవరైనా కనిపించకపోతే వారి సమాచారం కోసం ప్రయాణికుడి ఫొటో ఇతర వివరాలు వాట్సాప్‌ చేస్తే వారి వివరాలను తెలియజేస్తామని ఎస్పీ తెలిపారు.

తెనాలిలో..

తెనాలి టౌన్‌: తెనాలి రైల్వే స్టేషన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు స్టేషన్‌ మేనేజర్‌ రమణ శనివారం తెలిపారు. 08644  227600 నంబరు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన రైలుకు సంబంధించి తెనాలి నుంచి ఎవ్వరూ టిక్కెట్లు రిజర్వ్‌ చేయించుకోలేదని, విజయవాడ, బాపట్ల, చీరాల నుంచి పలువురు ప్రయాణికులు రిజర్వ్‌ చేయించుకున్నట్లు సమాచారం ఉందన్నారు. రాత్రి వరకు ఇతరత్రా ఎటువంటి వివరాలు రాలేదన్నారు. తెనాలి మీదుగా వెళ్లే యశ్వంత్‌పూర్‌, మెయిల్‌ ఈ రెండు రైళ్లు మాత్రమే రద్దు అయ్యాయని వివరించారు.  


వీరు ఏమయ్యారు?

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటనలో విజయవాడ వరకు రిజర్వేషన్‌ చేయించుకున్న వారిలో స్వల్ప గాయాలతో కొందరు, సురక్షితంగా ఎక్కువ మంది బయటపడ్డారు. ఇక్కడి వరకు మొదటి, ద్వితీయ, తృతీయ ఏసీ, స్లీపర్‌ కోచ్‌ల్లో మొత్తం 39 మంది ప్రయాణించారు. వీరిలో 13 మంది పరిస్థితి తెలియరాలేదు. అయిదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. ఎనిమిది మంది ప్రయాణికుల ఫోన్లు మోగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. వీరు మరణించారా? లేక ప్రాణాలతో ఉన్నారా? అన్నది ఇంకా ఇతిమిత్థంగా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్‌నెంబర్లు అందుబాటులో లేవు. మిగిలిన వారిలో పది మందే తెలుగు ప్రయాణికులు. ఇందులో విజయవాడ నగరానికి చెందిన వారు నలుగురు, గుంటూరు జిల్లా వారు ఇద్దరు, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలవాసి.. ఇద్దరు కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. విజయవాడకు రిజర్వేషన్‌ చేయించుకున్న ఇతర రాష్ట్రాల వారిలో ఎక్కువ మంది ఇక్కడ దిగి వేరే రైలు అందుకోవాల్సిన వారే ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించారు. మరికొందరు తమ సొంత ఏర్పాట్లతో సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల వివరాలివీ..

* మొత్తం రిజర్వేషన్‌ చేసుకున్న వారు : 39
* స్విచ్ఛాఫ్‌ : 05
* స్పందించని వారు : 08
* ఫోన్‌నెంబరు లేని వారు : 02
* ఇతర రాష్ట్రాల వారు : 14
* తెలుగు ప్రయాణికులు : 10

వీరిలో..

* విజయవాడ నగరం : 4
* వీరంకి లాకు (పమిడిముక్కల మండలం) : 02
* గుంటూరు : 01
* తెనాలి : 01
* ఖమ్మం జిల్లా (తెలంగాణ) : 02

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని