logo

పాత సూట్‌కేసే కదా అనుకుంటే.. బయటపడిన రూ.ఐదు లక్షల ఆభరణాలు

ఆర్టీసీ బస్సులో ఓ పాత సూట్‌కేసు, అందులోని సుమారు రూ.ఐదు లక్షల ఆభరణాలు.. వీటిని నిజాయతీగా ప్రయాణికులకు అప్పగించిన ఆర్టీసీ డ్రైవరు..

Updated : 29 Sep 2023 10:30 IST

ఆర్టీసీ డ్రైవర్‌ నిజాయతీ

బంగారు ఆభరణాలు అందుకుంటున్న ప్రయాణికుడి బంధువులు

అద్దంకి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ఓ పాత సూట్‌కేసు, అందులోని సుమారు రూ.ఐదు లక్షల ఆభరణాలు.. వీటిని నిజాయతీగా ప్రయాణికులకు అప్పగించిన ఆర్టీసీ డ్రైవరు.. ఈ సంఘటన అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద చోటుచేసుకుంది. డిపో మేనేజరు బెల్లం రామ్మోహనరావు అందించిన సమాచారం మేరకు.. అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లు బేల్దారి మేస్త్రీగా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలో నివాసముంటున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చారు. బుధవారం ఉదయం తిరిగి కొత్తగూడెం బయల్దేరారు. అద్దంకి నుంచి విజయవాడకు ప్రయాణించిన ఆయన చేతిలోని సూట్‌కేసును బస్సులోనే మరిచిపోయి, దిగి వెళ్లిపోయారు. సాయంత్రం ఆర్టీసీ బస్సు అద్దంకి డిపోకు చేరింది. బస్సులో ఉన్న సూట్‌కేసును చోదకుడు ఎంఆర్‌ఎస్‌.రెడ్డి గుర్తించారు. పాతసూట్‌కేసు అయినందున చెత్తలో పడేద్దామనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆర్టీసీ గ్యారేజి వద్ద రక్షణదళం సమక్షంలో తెరవగా ఆశ్చర్యపోయే విధంగా అందులో బంగారు, వెండి ఆభరణాలు, విలువైన పత్రాలు ఉన్నాయి. ఊహించని పరిణామంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సుమారు రూ.ఐదు లక్షల విలువైనవిగా తెలుసుకుని విషయాన్ని డిపో మేనేజరు దృష్టికి తీసుకెళ్లారు. ఆభరణాల సూట్‌కేసులోని రసీదును పరిశీలించి బాధితుడికి సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు కొత్తగూడం చేరుకున్నారు. కంగారు పడిన ఆయన కలవకూరులో నివసించే సోదరిని ఆర్టీసీ డిపో వద్దకు పంపించారు. సూట్‌కేసుతోపాటు అందులోని వస్తువుల్ని ఆమెకు అప్పగించారు. నిజాయతీగా సూట్‌కేసును అప్పగించిన ఆర్టీసీ బస్సు చోదకుడు ఎంఆర్‌ఎస్‌.రెడ్డిని పలువురు ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని