logo

కోటయ్యా.. నువ్వే ఆదుకోవయ్యా..

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు.

Updated : 05 Mar 2024 06:03 IST

 మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి
నత్తనడకన ఏర్పాట్లు.. పట్టించుకోని ఉన్నతాధికారులు

కోటప్పకొండపై అరకొరగా చలువ పందిళ్లు

 రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. కోటయ్య జాతరకు మరో మూడు రోజులే ఉన్నా కనీసం అధికార యంత్రాంగం రెండోసారి సమీక్ష కూడా నిర్వహించకపోవడం గమనార్హం. పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఎప్పుడు పూర్తిచేస్తారని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు  జోక్యం చేసుకొని పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

కోటప్పకొండపై ఏర్పాట్లను మాత్రమే దేవస్థానం చూసుకుంటోంది. కొండ కింది భాగంలో మాత్రం తమకు సంబంధం లేదంటున్నారు ఆలయ అధికారులు. కొండపై చలువ పందిళ్లు ఆలయ పరిసరాల మొత్తం వేస్తే బాగుంటుంది. కానీ కొంత వరకే ప్రస్తుతం వేశారు. క్యూలైన్ల కోసం బారికేడ్లు వేయాల్సి ఉంది. ఇప్పుడున్న మరుగుదొడ్లకు అదనంగా మరో 20 బయో టాయిలెట్స్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. ఇంకా రావాల్సి ఉంది. మెట్ల మార్గం చాలావరకూ అధ్వానంగా ఉండేది. ప్రస్తుతం మరమ్మతు పనులు పూర్తి చేశారు. అయితే తాగునీటి ఏర్పాట్లు మాత్రం సరిగా లేవు. 900పైగా ఉండే మెట్లు ఉండే ఈ మార్గంలో రెండే కుళాయిలు ఏర్పాటుచేశారు. అదీ మెట్ల ప్రారంభం వద్ద ట్యాంకు ఉండగా మధ్యలో ఓ కుళాయి పెట్టారు. మెట్ల ప్రారంభం వద్ద ఉన్న ట్యాంకుకు కూడా ఒక కుళాయి మాత్రమే ఉంది. త్రికోటేశ్వర ఆలయం వద్ద ఆర్వో ప్లాంటు పనులు తుదిదశకు వచ్చాయి. ఇది కాకుండా రద్దీకనుగుణంగా మరో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మెట్ల మార్గంలో ఒకవైపు రెయిలింగ్‌ వేయిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. కానీ ఆ ఊసే లేదు.

రోడ్లకు మరమ్మతులు

శివరాత్రి రోజు కొండకు దిగువన రద్దీ నెలకొంటుంది. ప్రభల ప్రదర్శనలతో పాటు ఫుడ్‌ స్టాల్స్‌, నృత్యాలు తదితరాలు కొండకావూరు(కొండ కింద)లో జరుగుతాయి. వీటికోసం జనాలు పోటెత్తుతారు. తిరునాళ్ల జరిగే రాత్రి సమయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. యలమంద మీదుగా కోటప్పకొండ వైపు మొత్తం నాలుగుచోట్ల పెద్ద గుంతలు ఉంటే వాటిని అధికారులు పూడ్చించారు. అలాగే, యలమంద గ్రామం చివర లోచప్టా బ్రిడ్జి రెండువైపులా కంకర తేలియాడుతున్నందున దీనిని పూర్తి చేశారు.

రెండో సమీక్ష సమావేశం ఉందా? లేదా?

ఈనెల 13న కోటప్పకొండ తిరునాళ్లపై మొదటి సమీక్ష సమావేశం జరిగింది. గతేడాది ఎలాంటి పొరపాట్లు జరిగాయి? ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఎక్కువగా ట్రాఫిక్‌ జాం, తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలని కలెక్టర్‌ కోరారు. అయితే రెండో సమీక్ష సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదు. పనుల ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? నిధుల సమస్య ఉందా? పనుల్లో వేగం ఉందా లేదా? అనే దానిపై రెండో సమీక్షలో చర్చించాలి. కానీ ఇంత వరకూ ఎప్పుడు నిర్వహిస్తారో, అసలు ఉందో లేదో కూడా తెలియరావడం లేదు.


అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తాం

కోటప్పకొండ తిరునాళ్లను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ తీసుకొస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూస్తాం.

 శ్రీనివాస్‌రెడ్డి, కోటప్పకొండ ఆలయ ఈవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని