logo

12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట

సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది.

Published : 29 Mar 2024 03:48 IST

చక్రం తిప్పిన వైకాపా అసమ్మతి నేత రాజేష్‌నాయుడు
తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం

గణపవరం (నాదెండ్ల), చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వలస వెళ్లారు. మంత్రి సూచనతో ఈ స్థానంలో మల్లెల రాజేష్‌ నాయుడిని సమన్వయకర్తగా ఎంపిక చేసిన అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ప్రకటించారు. అయితే మంత్రి తన వద్ద రూ.6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్‌ నాయుడు ఆరోపణలు చేశారు. అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టి రూ.3 కోట్లు వెనక్కి తీసుకున్నట్లు ఆయన బహిరంగంగా ప్రచారం చేయడం మంత్రికి ఆగ్రహం కలిగించింది. తానే అభ్యర్థిగా భావించి సిద్ధం సభకు జనాన్ని సమీకరించడం, పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లోకి దూసుకుపోతున్న రాజేష్‌ నాయుడుని సమన్వయకర్త పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఆ స్థానంలో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిని నియమించారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు సహకరించనని భీష్మించిన రాజేష్‌ నాయుడు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైకాపా నాయకులను తన వైపు తిప్పుకున్నారు.

పురపాలక వైకాపా పక్షంలో చీలిక

చిలకలూరిపేట పురపాలక సంఘంలో అధికార వైకాపాకు సొంత కౌన్సిలర్లు జలక్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెండ్రోజులుగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పురపాలక ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలు సాధించింది. తెదేపా ఎనిమిది స్థానాలకు పరిమితమైంది. దీంతో వైకాపా నుంచి రఫాని ఛైర్‌పర్సన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా వైకాపా కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు శాసనసభ అభ్యర్థి మార్పుతో కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల మల్లెల రాజేష్‌ నాయుడు నిర్వహించిన సన్మానసభకు 18 మంది వైకాపా కౌన్సిలర్లు హాజరు కావడం చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు చల్లిన పార్టీ అధిష్టానంపై ఆయన రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు అనుచరులు చర్చించుకుంటున్నారు. 12 మంది కౌన్సిలర్లు రెండు రోజులుగా నియోజకవర్గంలో కనిపించక పోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వీరితో విజయవాడలో శిబిరం ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఒకట్రెండు రోజుల్లో వైకాపాకు జలక్‌ ఇచ్చేందుకు రహస్య ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెదేపా నేతలు మల్లెలతో మాటలు కలిపినట్లు సమాచారం. కౌన్సిలర్ల వేరు కుంపటి పెట్టడం పురపాలక సంఘ పాలక పక్షంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. మరో వైపు రాజేష్‌నాయుడు సైతం తెదేపా చేరతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని