logo

ఎత్తిపోతల పథకాలు హుళక్కే

పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు.

Published : 29 Mar 2024 03:51 IST

నిధుల కేటాయింపుపై జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం
ఆశలొదులుకున్న రైతులు
వినుకొండ, గురజాల, చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

ల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. గుండ్లకమ్మ, నేండ్రవాగు, తంగేడు, రాళ్లవాగులపై తొమ్మిది చోట్ల ఎత్తిపోతల ద్వారా సుమారు 31 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు సాగునీటి అభివృద్ధి సంస్థ (ఐడీసీ) అధికారులు అంచనాలు పంపినా ఫలితం శూన్యం. గత ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్‌, ఆ పార్టీ శాసనసభ్యులు రైతులకిచ్చిన హామీలు గాలిమేడలుగా మారాయి. ఓటు కోసం మరోసారి ప్రజల ముందుకు రానున్న అధికార పార్టీ నేతలు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది.

  • నీటి వసతి లేని సాగు గాలిలో దీపమని చెప్పొచ్చు. పంట చేతికొస్తుందో లేదో చెప్పలేని దయనీయ పరిస్థితి పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నెలకొంది. ఈ సమస్య వృథా జలాల ద్వారా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లోపించిన కారణంగా నేటికీ నీటి తడులందక వేల ఎకరాలు బీటలు బారుతున్నాయి.
  • పశ్చిమ కనుమల్లో పుట్టిన గుండ్లకమ్మ నదిపై ఆరు చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించి వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలంలోని 10 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు సుమారు రూ.110 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. నీటి వినియోగానికి అనుమతులిచ్చిన పాలకులు నిధులివ్వలేదు. తమ జీవితాలు బాగుపడతాయని రైతులు సొంత ఖర్చుతో సర్వేపూర్తి చేసేందుకు సహకరించినా ప్రయోజనం లేదు. గత ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్‌ 28 మార్చి, 2019లో వినుకొండలో జరిగిన బహిరంగ సభలో గుండ్లకమ్మ నదిపైన ఎత్తిపోతల పథకాలు పట్టించుకోలేదని అప్పటి తెదేపా పాలనను విమర్శించారు. తర్వాత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివిధ సభల్లో వీటిని ప్రస్తావించారు. వాటర్‌ క్లియరెన్స్‌ వచ్చిందని, త్వరలో నిధుల తెచ్చి పనులు చేస్తామని నొక్కి చెప్పినా ఫలితం మాత్రం శూన్యం.

గురజాల గోడు ఇదే..

గురజాల నియోజకవర్గంలో రాళ్లవాగు, తంగేడువాగులపై సుమారు 22 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు రెండు భారీ ఎత్తిపోతల పథకాలు ప్రతిపాదించారు. ఈ రెండింటికి సర్వే కోసం రూ.50 లక్షలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. వీటితో పాటు వీరవట్నం వద్ద నక్కవాగుపై 1150 ఎకరాల్లో మరో ఎత్తిపోతల నిర్మించాలని నిర్ణయించారు. ఐడీసీ అధికారులు వీటికి సంబంధించిన అంచనాలు ప్రభుత్వానికి పంపినా నిధులు ఇవ్వలేదు. కాగితాలు ఆటు ఇటు తిరిగాయి తప్ప పనులు మొదలు కాలేదు.

అప్పుడు అనిల్‌.. ఇప్పుడు అంబటి

ఇప్పుడు వైకాపా నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్‌కుమార్‌ ఐదేళ్లలో సగం భాగం నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత ఆయన స్థానంలో జిల్లాకు చెందిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చారు. ఇద్దరూ పల్నాడు జిల్లాలోనే ఇప్పుడు పని చేస్తున్నారు. రేపు ఎన్నికల కోసం ఓట్లడగనున్నారు. సాగునీటి పథకాల నిర్లక్ష్యంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన ఉందనడంలో సందేహం లేదు.

చిలకలూరిపేటలోనూ అంతే

ఐదు నెలల క్రితం చిలకలూరిపేట మండలం కావూరు, లింగంగుంట్ల మధ్య జరిగిన సీఎం జగన్‌ సభలో ఈ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు కేటాయిస్తానని ఇచ్చిన హామీ నీటి మీద రాతలానే మిగిలింది. ఈ ప్రాంతంలో పశుమర్రు, తిమ్మాపురం, కావూరు, యడ్లవల్లి, నాదెండ్ల మండలంలో పలు గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు నాలుగేళ్లుగా నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని