logo

బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం

అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం.

Published : 29 Mar 2024 04:05 IST

అభియోగాలు నమోదు చేసిన ఎస్పీ
ఈనాడు, బాపట్ల

ధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. ప్రస్తుతం ఆయనపై మేజర్‌ ఓఈకి ఆదేశించారు. ఈ రకమైన విచారణకు ఆదేశించడంతో పోలీసు వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. శాఖలో మేజర్‌ ఓఈ అంటే చాలా తీవ్రమైన చర్య కిందకు వస్తుంది. ఈ విచారణను ఎదుర్కొన్న అధికారులకు పదోన్నతులు రావడానికి చాలా ఆలస్యమవుతుంది. ఆపై జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుదల ఉండదు. ఇన్ని అంశాలతో ఈ విచారణ ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలో పని చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులు ఆచితూచి వ్యవహరించాలి. అడ్డదిడ్డంగా వ్యవహరించినట్లు తేలితే ఈసీ నివేదిక కోరుతుంది. దీంతో ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగి, అధికారిపై తీసుకున్న చర్యలను ఈసీకి నివేదించాలి. ఆ చర్యలతో ఈసీ సంతృప్తి చెందేలా ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. ఈ మధ్య బల్లికురవ ఎస్పై పని తీరు వివాదస్పదమైంది. విధి నిర్వహణలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సై నాగశివారెడ్డిని వైకాపా గ్రామ నాయకుడొకరు ఠాణాలోనే సన్మానించిన ఫొటోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. ఈ విషయమై తెదేపా వర్గాలు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అదొక్కటే కాదు వేమవరం గ్రామంలో జై గొట్టిపాటి అని నినాదాలు చేసినందుకు తెదేపా కార్యకర్తలపై నమోదు చేసిన కేసు వివాదస్పదమైంది. తెదేపా నాయకురాలి షాపులో పని చేస్తున్న ఓ వృద్ధుడిపై చేయిచేసుకోవటం అతను అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నారని నమోదు చేసిన కేసుపైనా బాధితులు విచారణాధికారి ముందు కేసు నమోదు చేసే సమయానికి ఆ వృద్ధుడు ఎక్కడ ఉన్నారో సీసీ ఫుటేజీలు సైతం తీసుకెళ్లి అందజేశారు. ఇటీవల మద్యం తాగుతూ తెదేపా, వైకాపా కార్యకర్తలు గొడవపడితే వారిలో ఓ వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు చేయటం దానిపై బాధిత వర్గం అభ్యంతరం తెలిపి ఆ రోజున ఏం జరిగిందో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలా వరుస వివాదాల్లో ఆయన ఇరుక్కున్నారు. అయినా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఎట్టకేలకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్పందించి ఆయన్ని తక్షణమే స్టేషన్‌ ఎస్సై బాధ్యతల నుంచి తప్పించి లూప్‌లైన్‌కు పంపారు. ఈ మేరకు ఆయనపై అభియోగాలు నమోదుచేశారు. తాజాగా డీఎస్పీ స్థాయి అధికారితో మేజర్‌ ఓఈకి ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ విచారణలో ప్రతిదీ వీడియో రికార్డు చేసి ఎన్నికల కమిషన్‌కు పంపుతామని ఈ విచారణ చాలా తీవ్రమైన చర్య కిందకు వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని