logo

రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు

జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు.

Published : 29 Mar 2024 04:11 IST

ఓలేరు రీచ్‌ నుంచి వచ్చే లోడు లారీలతో రహదారి ఛిద్రం
లంక గ్రామాల రాకపోకలకు తప్పని అవస్థలు
ఈనాడు, బాపట్ల

జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. ఇసుక రీచ్‌ నుంచి ఇసుక లారీలను ప్రధాన రహదారి ఎక్కించడానికి లంక గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని వినియోగించారు. ఫలితంగా కరకట్ట నుంచి పెసర్లంక, జువ్వలపాలెం వెళ్లే ప్రధాన రహదారి మోకాల్లోతు గుంతలు పడి ఏమాత్రం ద్విచక్ర వాహనం నడపటానికి వీల్లేకుండా అధ్వానంగా తయారైంది. వాస్తవానికి అది తొలుత పొలంబాట. తర్వాత దాన్ని లంక   గ్రామాలను కలిపే ప్రధాన రహదారిగా ఆర్‌ అండ్‌బీ అధికారులు విస్తరించారు.

రహదారిలో చూద్దామన్నా కంకరు రాయి లేదు. తుదకు మట్టి ఒక్కటే మిగిలింది. అసలే లంక గ్రామాల రహదారి కావటంతో నిత్యం వెళ్లే వందలాది ఇసుక లారీలతో పూర్తిగా కంకరు రాళ్లు లేచిపోయి చివరకు మట్టి బయటపడటమే కాదు వాటి ధాటికి నీళ్లు కింది నుంచి పైకి ఉబికి వచ్చి తేమ కనిపిస్తుంది. చూసేవారికి ఇక్కడేమైనా వర్షం పడిందేమోనన్న భావన కలుగుతుంది. అసలే ఇసుక నేలలు కావడంతో మట్టి సైతం పైకి వచ్చి ఇసుక, మట్టి మిశ్రమంతో ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా ఆ ఆర్‌అండ్‌బీ రహదారి తయారైంది. ఇసుకాసురుల వ్యక్తిగత స్వార్థం ముందు ఆ రహదారే చిన్నబోయింది. ప్రభుత్వంలో కీలకమైన ప్రజాప్రతినిధి ఒకరు గడిచిన ఐదేళ్ల నుంచి ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగించారు. కరోనా సమయంలోనూ అక్కడ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. కరకట్ట నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓలేరు ఇసుక రీచ్‌కు పొలాల నడుమ ఉన్న రహదారి మీదగానే లారీలు రాకపోకలు సాగుతాయి.  

కీలక నేతకు భయపడి..: ప్రభుత్వంలో కీలక నేత కావడంతో రహదారి ఛిద్రమవుతున్నా.. ఆ లారీల రాకపోకల వల్ల ఆ ప్రాంతంలో సేద్యం చేసుకునే అన్నదాతలకు అసౌకర్యం కలిగినా ఎవరూ నోరుమెదపలేదు. ఎవరైనా ఎదురుతిరిగితే చాలు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టించి ఇబ్బంది పెడతారనే భయం కూడా ఉండటంతో ఏ ఒక్కరూ ఇసుక అక్రమాలను అడ్డుకోలేకపోయారు. ఐదేళ్ల పాటు లారీల తాకిడికి లంక గ్రామాల మీద ఓలేరు రీచ్‌ చేరుకునే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. రెండు రోజుల క్రితం రీచ్‌ పరిశీలనకు వచ్చిన అధికారుల బృందం ఈ రహదారి మీదుగా వెళ్లలేమని చెప్పటంతో మరో ప్రత్యామ్నాయ రహదారి గుండా వెళ్లారు. ఒక్క రోజు అధికారులు పరిశీలనకు వెళ్లాలంటేనే హడలిపోయారు. ఐదేళ్ల నుంచి లంక గ్రామాల     వాసులు, అన్నదాతలు ఆ రహదారి మీదుగా ప్రయాణించటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి అటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు కన్నెత్తి చూడలేదు. అసలే కీలక నేత కావడంతో పరిశీలనకు వెళ్లినా ఎక్కడ ఆగ్రహిస్తారోనని భయపడి మిన్నకుండిపోయారు.


ఆ రహదారి ఇంకెప్పటికో!

తంలో పొలం బాటగా ఉన్నప్పుడు సులభంగా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు వచ్చేవని ప్రస్తుతం మోకాల్లోతు గుంతలు పడి ఏ మాత్రం ప్రయాణానికి అనువుగా లేకపోవటంతో ట్రాక్టర్లు కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్ధానిక రైతు సాంబిరెడ్డి చెప్పారు. గత 20 ఏళ్ల నుంచి తమకు ఈ రహదారిలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇక్కడ రీచ్‌లోకి అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు చేయటం వల్ల నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలించడంతో వాటి రాకపోకలతో రోడ్డంతా లేచిపోయింది. దీనికి యంత్రాంగమే సమాధానం చెప్పాలని రైతులు, లంక గ్రామాల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. అసలు ఇసుక రీచ్‌లకు అనుమతి లేనప్పుడు తవ్వకాలు ఎలా జరగనిచ్చారు? అన్ని లారీలు నిత్యం తిరుగుతుంటే భూగర్భ గనులు, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎందుకు మౌనం వహించినట్లు అని ప్రశ్నిస్తున్నారు. రాకపోకలకు రహదారి లేకుండా చేసిన పాపం పూర్తిగా వైకాపాదేనని ఆ పార్టీకి ఓటేయబోమని అటుగా అసౌకర్యంగా రాకపోకలు సాగిస్తున్నవారు సైతం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని