logo

అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

Published : 29 Mar 2024 04:16 IST

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అనుమతుల్లేకుండా డప్పు మేళాలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే కార్యక్రమాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే గురువారం చేసిన ఎన్నికల ప్రచారం మరో ఎత్తుగా నిలిచింది. సాయంత్రం ఇజ్రాయేల్‌ పేటలో ఇంటింటి ప్రచారాన్ని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చేపట్టారు. అనుమతి తీసుకోలేదని అధికారులు చెబుతున్నా పట్టించుకోలేదు. మేం అనుమతి తీసుకున్నామంటూ కొంతసేపు ప్రచారం చేశారు. ఎన్నికల సంఘం బృందాల సిబ్బంది అక్కడికి చేరుకొని అనుమతి లేనందున ప్రచారాన్ని నిలిపివేయాలని సూచించినా పట్టించుకోలేదు. చాలా సేపటి తర్వాత ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయాల్సిన ప్రాంతం పేరు మారిందన్నారు. అధికారులు ఆ ప్రాంతంలోనే ప్రచారం చేసుకోవాలని సూచించారు. తర్వాత అక్కడి నుంచి సీతానగర్‌లో ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. ప్రచారం ప్రారంభానికి ముందుగానే ఎన్నికల విధుల్లోని సిబ్బంది వచ్చి అనుమతి లేదని చెప్పినా పట్టించుకోకుండా, ప్రాంతం పేరు పొరపాటున సీతానగరం అని నమోదు చేసినట్లు తెలుపుతూ కప్పిపుచ్చుకున్నారు.

ఎమ్మెల్యేకే కాదు... అభ్యర్థికీ పీఏనే

ఎమ్మెల్యే ముస్తఫా వద్ద పీఏగా నియమితులైన మస్తాన్‌వలి, కోడ్‌ అమల్లోకి వచ్చినా తిరిగి విధుల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే కార్యాలయంలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరిఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆమె వెంట కాలనీలకు, పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు తిరిగేస్తున్నారు. గురువారం ఇజ్రాయేల్‌ పేటలో జరిగిన ప్రచారంలోనూ పీఏ పార్టీ నాయకులతో ముచ్చటిస్తూ కనిపించారు. కోడ్‌ అమల్లోకి వచ్చినా తిరిగి మాతృ ప్రభుత్వ శాఖకు రాకపోవడంతో ఇంటర్‌ విద్య అధికారులు పీఏ మస్తాన్‌వలిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని