logo

పోస్టల్‌ బ్యాలట్‌ గందరగోళం

జిల్లాలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం పీవో, ఏపీవోలకు ఉదయం శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడే పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించారు.

Published : 06 May 2024 05:09 IST

వారికి శిక్షణ ఒకచోట.. ఓటు మరోచోట
సాయంత్రం 4గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభం
ఉద్యోగుల ఓటు వినియోగంలో తీవ్ర జాప్యం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌

తెనాలి: ఇతర జిల్లాల ఉద్యోగుల ఎదురుచూపులు

జిల్లాలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం పీవో, ఏపీవోలకు ఉదయం శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడే పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇతర జిల్లాల వారు అధికంగా ఉండడంతో పాటు ఈసారి అనుసరించిన మార్గదర్శకాలతో తీవ్రజాప్యం జరిగింది. దీనిపై ఉద్యోగులకు అవగాహన కల్పించకపోవడంతో అస్తవ్యస్తమైంది. ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రిటర్నింగ్‌ అధికారి పరిధిలో ఫారం-12 తీసుకుని అక్కడే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు వేసుకోవాలి. ఈ విషయమై ఉద్యోగులందరికీ స్పష్టత లేకపోవడంతో వారి ఓటు ఉన్న ప్రాంతంలోనే పోస్టల్‌ బ్యాలట్‌ వేసుకోవడానికి వెళ్లడంతో సమస్య మొదలైంది. ఇప్పటికే సదరు ఉద్యోగికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్‌ను వారు పనిచేస్తున్న ఆర్వోకు పంపినందున వారికి మళ్లీ వారు నివాసం ఉన్న ప్రాంతంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వలేమని రిటర్నింగ్‌ అధికారులు వారిని పంపేశారు. దీనికితోడు ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తుండడంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పట్టుదలతో ఓటేసిన ఉద్యోగులు

ఆదివారం ఉదయమే శిక్షణకు హాజరైన ఉద్యోగులు వివిధ కారణాలతో రాత్రి 9గంటల వరకు ఓటు వేయడానికి వేచిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒక్కరూ కూడా ఓటు వేయకుండా వెళ్లకుండా వేచి ఉండి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోత ఉన్నప్పటికీ పట్టుదలతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి మొగ్గుచూపారు. ఉద్యోగులందరిలో ఓటుహక్కు వినియోగించుకోవాలన్న ఆత్రుత ప్రదర్శించడం గమనార్హం. తాము వేసిన ఓటు భద్రంగా ఆయా నియోజకవర్గాలకు ఎలా చేర్చుతారో ప్రొసీజర్‌ కూడా కొందరు కనుక్కుని వెళ్లడం కనిపించింది. ఇంతసేపు వేచిచూసి ఓటు వేసిన సందర్భాలు చాలా తక్కువని, ఈసారి గట్టి పట్టుదలతో ఓటు వేస్తున్నారని పోలింగ్‌ పర్యవేక్షించిన అధికారి ఒకరు తెలిపారు.

తాడికొండ: జాబితా రాకపోవడంతో బయటే వేచి చూస్తూ..

అధికార పార్టీ ప్రలోభాల పర్వం

జిల్లాలో పోస్టల్‌ బ్యాలట్‌ ఉద్యోగుల వివరాలు తీసుకున్న అధికార పార్టీ నేతలు వారిని ప్రలోభ పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఉద్యోగులు వారిని కలవడానికి ఇష్టపడలేదు. కొందరు అధికార పార్టీ నేతలు తాము వచ్చి ఒకసారి కలిసి ఓటు అడుగుతామని అభ్యర్థిస్తే ఉద్యోగులు తాము కార్యాలయంలోనే ఉన్నామని, అక్కడికే రావాలని చెప్పడంతో మిన్నకుండిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు గరిష్ఠంగా రూ.5వేలు పంపిణీ చేశారు. ఆయా ఉద్యోగులకు సంబంధిత శాఖలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి చేత ఫోన్లు చేయించి నేరుగా ఉద్యోగుల చరవాణికి యూపీఐ ద్వారా సొమ్ము బదిలీ చేయడం గమనార్హం. అయితే సొమ్ములు పంచినా లోపలికి వెళ్లిన తర్వాత ఓటు ఎవరికి వేశారోనన్న ఆందోళన అధికార పార్టీ నేతలను వెంటాడింది. అధికార పార్టీ తరఫున ప్రతినిధులు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసి తిరిగి వెళ్తున్న వారితో మాట్లాడుతూ ఏ నియోజకవర్గం, ఎవరికి ఓటు వేశారంటూ ఆరా తీస్తుండడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.

ఇతర జిల్లాల వారు 5900 మంది

జిల్లాలో ఇతర జిల్లాలకు చెందినవారు 5900 మంది ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల నుంచి పోస్టల్‌ బ్యాలట్లు తెప్పించుకోవడం, వాటిని ఆయా ఉద్యోగులు ఉన్న రిటర్నింగ్‌ అధికారులకు పంపే క్రమంలో కొంత జాప్యం చోటుచేసుకుంది. ఇతర జిల్లాల వారు ఎక్కువ మంది ఉన్నందున కొందరికి పోస్టల్‌ బ్యాలట్‌ అందని పరిస్థితి ఉంది. అలా పోస్టల్‌ బ్యాలట్‌ రానివారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఒకవైపు శిక్షణ, మరోవైపు పోస్టల్‌ బ్యాలట్‌, పోలింగ్‌ నాటికి ఈవీఎంలు సిద్ధం చేసుకోవడం వంటి పనులతో గందరగోళం నెలకొంది. దీనికితోడు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో ఈసారి మారిన మార్గదర్శకాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.

ఒక్కొక్కరికి 10 నిమిషాలకు పైగా సమయం

గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పీవో, ఏపీవోలకు ఆదివారం మధ్యాహ్నం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసుకునే అవకాశం ఇచ్చారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓటింగ్‌ ప్రారంభించడంతో ఉద్యోగులు మూడు గంటల పాటు వరుసలో నిలబడాల్సి వచ్చింది. ఒక్కొక్క ఉద్యోగి ఓటు వేయడానికి లోపలికి వెళ్లిన తర్వాత 10 నిమిషాలకుపైగా సమయం పట్టింది. ప్రతి ఆర్వో పరిధిలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా రాత్రి 9గంటల వరకు ఓటింగ్‌ కొనసాగింది. ఎండ వేడి ఎక్కువగా ఉండఢం, కొన్నిచోట్ల టెంట్లు సరిపోకపోవడంతో ఉక్కపోతతో వరుసలో నిలబడడానికి ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రక్రియ మొత్తం కొత్తగా ఉండడం ఆలస్యానికి కారణమైంది. పోలింగ్‌ కేంద్రం బయట బ్యాలట్‌ పేపర్‌, పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునే విధానంపై సూచనలు లేకపోవడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు.

  • పొన్నూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. అక్కడి నుంచి సుమారు కి.మీ పైగా దూరంలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేయడంతో ఇబ్బందులు పడ్డారు.
  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ మహిళా కళాశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఓటుహక్కు ఉన్న సిబ్బంది పలువురు ప్రభుత్వ మహిళా కళాశాలలో పోస్టల్‌ బ్యాలట్‌ నిర్వహిస్తున్నారని అక్కడికి వస్తే వారికి కనీస సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి గుంటూరు పశ్చిమలో ఓటు ఉందని, ఇక్కడ ఓటు వేసేందుకు వస్తే మీ ఓటు ఇక్కడ లేదని చెబుతున్నారని వాపోయారు. చాలా సేపటి తర్వాత వారికి సమాచారం ఇవ్వడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఉదయం ఏడు గంటలకు ఇళ్ల నుంచి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన వారు రాత్రి వరకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని