logo

కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్‌?

జగన్‌ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి.

Updated : 08 May 2024 07:20 IST

నైపుణ్య కేంద్రాల్లో మొక్కుబడి శిక్షణ
చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువత
ఈనాడు - బాపట్ల, న్యూస్‌టుడే - చీరాల అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ యువ రాష్ట్రం.. ఇక్కడ యువతకు మంచి సామర్థ్యం ఉంది. రాష్ట్ర యువకుల సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచం అంతా గుర్తించింది.

సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోదీ అన్న మాటలివి.

జగన్‌ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. తన ఐదేళ్లకాలంలో జగన్‌ ఒక్క కొత్త పరిశ్రమను తేలేదు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా యువత నైపుణ్య శిక్షణకు పూర్తిస్థాయిలో నోచుకోలేదు. ఈ శిక్షణ అరకొరగా ఇవ్వడంతో ఉద్యోగాలు అంతంత మాత్రమే. 2.30 లక్షల ఉద్యోగాలిచ్చానని ముఖ్యమంత్రి సభల్లో గొప్పలకు పోతారు. ఆయన దృష్టిలో ఉద్యోగాలు అంటే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వైపో చూడాల్సిన పరిస్థితి.

బాపట్ల ఐటీఐ కళాశాలలో ఏర్పాటుచేసిన స్కిల్‌ కేంద్రం

జగన్‌ గుర్తించింది ఏదీ?

తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో సోమవారం జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో మన యువత శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాల గురించి ప్రధానమంత్రి ఎంత గొప్పగా చెప్పారో ఇట్టే అర్థమవుతోంది. కానీ ఇంతటి ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను మాత్రం వైకాపా ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్ధ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్‌ సర్కార్‌ మూటగట్టుకుంది. ఉపాధి కల్పనకు పరిశ్రమలు కావాలి. వాటిని కక్షపూరితంగా రాష్ట్రం నుంచి తరిమేశారు. కొత్తవి తీసుకురాలేదు. కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం చేతకాని సీఎం.. ఉన్న వాటిని ధ్వంసం చేయడంలో రికార్డులకెక్కారు. మొత్తంగా యువత బంగారు కలలను చిదిమేశారు. లక్షలాది తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చారు.

వైకాపా హయాంలో ఉద్యోగ మేళాలే లేవు

2019 నుంచి 2022 అక్టోబరు వరకు తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల్లోనే శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత 2022 అక్టోబరు నుంచి స్కిల్‌ హబ్‌లు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్పినా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ మొత్తానికి కలిపి తొలుత చీరాలలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాన్ని బాపట్లలోని రక్షణసైన్యం ఐటీఐ కళాశాలకు మార్చారు. ప్రస్తుతం ఇక్కడే శిక్షణ కొనసాగుతోంది. 300 మంది వరకు శిక్షణ పొందారు. పాలిటెక్నిక్‌, బీటెక్‌ విద్యార్థులకు ఆటోమోటివ్‌ క్యాడ్‌ టెక్నీషియన్‌, ప్రొడక్టు డిజైన్‌ ఇంజినీర్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్టు కోర్సులు నేర్పిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తొలుత అప్టిట్యూడ్‌ టెస్ట్‌ పెట్టి అర్హులను ఎంపిక చేస్తారు. శిక్షణా వ్యవధి నాలుగు మాసాలు కాగా, శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మెంటార్లు ఉన్నారు. బ్యాచ్‌కు 30 మంది విద్యార్థులనే తీసుకుంటారు.

తెదేపా హయాంలో ఇలా..

గత తెదేపా ప్రభుత్వ హయాంలో యువత ఉపాధి కల్పనకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో చొరవ తీసుకున్నారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి శిక్షణిస్తే అద్భుతాలు చేస్తారని ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. అప్పట్లో శిక్షణ ఓ ఉద్యమంలా సాగింది. పరిశ్రమల అవసరాలేమిటో ముందుగానే కళాశాలలు, నైపుణ్య కేంద్రాల నిర్వాహకులు తెలుసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేవారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర నైపుణ్య విద్యనభ్యసించిన ప్రతిఒక్కరికీ ఉద్యోగాలు చేయడానికి సరిపడా మెలకువలు నేర్పించి వారు ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు. బాపట్లలో అర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాల, ఫార్మసీ కళాశాలలో ఐదేళ్ల పాటు శిక్షణ సాగింది.

అప్పట్లో శిక్షణా కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలివీ..

  • ప్రతి కేంద్రంలో కంప్యూటర్లు
  • విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత   శిక్షణ నీ ఏడాది మొత్తం సిబ్బంది అందుబాటులో ఉండి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేవారు
  • 2014-19లో 2 వేల మందికి పైగా శిక్షణ పొంది కొలువులు సాధించారు.
  • ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం
  • ప్రతి కేంద్రంలో 120 మందికి శిక్షణ
  • రెండు వారాల సమయంలో 40 గంటల శిక్షణ ఇచ్చారు
  • కోర్సులు పూర్తికాగానే ఉద్యోగ మేళాల ద్వారా కొలువులు దక్కేలా చేశారు.

ఉద్యోగం లేక డెలివరీ బాయ్‌గా చేస్తున్నా..

ఎంబీఏ పూర్తి చేశా. సరైన ఉద్యోగం లభించకపోవడంతో జొమాటో బాయ్‌గా రెండేళ్ల నుంచి పని చేస్తున్నా. రోజుకు 10 గంటలు పనిచేసినా రూ.600 కూడా రావడం లేదు.  నెల మొత్తం కష్టపడి చేసినా రూ.6వేలు దాటడం లేదు. జగన్‌ ప్రభుత్వ నిబంధనలతో బహుళజాతి సంస్థలు రావడం లేదు. తెదేపా హయాంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయి. ఈ అయిదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉంటే మరో సైబరాబాద్‌లో మారేది.

ఎం.శ్రీనివాసరావు, చంద్రమౌళినగర్‌


డబ్బులు కేటాయించకే..

తెదేపా హయాంలో బహుళజాతి సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ముందే గ్రహించి శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు అందేలా చేశారు. గత ఐదేళ్లలో నైపుణ్యాభివృద్ధి సంస్థలు మరుగునపడ్డాయి. డబ్బులు కేటాయించకపోవడంతో వాటి ప్రయోజనం నెరవేరలేదు. ఉద్యోగులను తగ్గించారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గాయి. ఇంటర్న్‌షిప్‌ వ్యవస్థ తూతూమంత్రంగా నడుస్తోంది.

డాక్టర్‌ సురేష్‌బాబు, ప్రాంగణ ఎంపికల నిపుణుడు


కోర్సులు నేర్చుకున్నా ప్రయోజనం శూన్యం

నేను బీఎస్సీ కంప్యూటర్‌ రెండేళ్లక్రితం పూర్తి చేశాను. ఈ సమయంలో కంప్యూటర్‌ బేసిక్స్‌ దగ్గర నుంచి సి-లాంగ్వేజి, జావా, ఫైతాన్‌ కోర్సులపై కళాశాలలో శిక్షణ పొందాను. ఈ ప్రభుత్వ హయాంలో ప్రాంగణ ఎంపికలు జరగడం లేదు. దీనివలన ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. నాలాగే ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు.

మణికంఠ, చీరాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు