logo

ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..

2019లో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్‌సీని ప్రకటించారు. 11వ పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో 4 శాతం కోత పడింది.

Published : 10 May 2024 05:31 IST

వయో వృద్ధ పెన్షనర్ల పింఛన్‌లో కోత
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

‘ప్రభుత్వ ఉద్యోగులుగా దీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారు పింఛన్‌ పొందటం వారికున్న హక్కు. పింఛన్‌ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు..’ అని భారత అత్యున్నత న్యాయస్థానం పలు కేసులు విచారణ సమయంలో వ్యాఖ్యానించింది. పాలకులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి పింఛన్‌ చెల్లించాలని ఆదేశించింది కూడా.


రాష్ట్రంలో అయిదేళ్లలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. విశ్రాంత ఉద్యోగులు పింఛన్‌ కోసం ఏ నెలకు ఆ నెలలో రోజులుగా నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము ఎప్పుడు పడుతుందోనని మొబైల్‌ ఫోన్‌ చూసుకోవడం, మెసేజ్‌ రాకపోవడంతో నిరుత్సాహానికి గురవడం పరిపాటిగా మారింది. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులతో పాటు పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు.


2019లో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్‌సీని ప్రకటించారు. 11వ పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో 4 శాతం కోత పడింది. ఒక్కో ఉద్యోగి ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 10 శాతాన్ని 7కు, 75 సంవత్సరాలు పైబడిన పెన్షన్‌దారులకు 15 శాతాన్ని 12కు తగ్గించింది. దీనివల్ల జీవిత కాలం పింఛన్‌దారులకు నష్టం జరుగుతూనే ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలో అడిషినల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ని ప్రవేశపెట్టగా వైకాపా ప్రభుత్వం వారికిచ్చే పింఛనులో కోత విధించడం గమనార్హం. పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ని 4 శాతం, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో 3 శాతం చొప్పున తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.


వేలి ముద్ర పడలేదని పింఛన్‌ నిలిపివేశారు

గత ఫిబ్రవరి నెల వరకు పెన్షనర్లకు పింఛన్‌ని ప్రభుత్వం చెల్లించింది. మార్చి నెల నుంచి జీవన ధ్రువీకరణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లో వేలిముద్ర వేయాలి. సాంకేతిక సమస్యలతో యాప్‌ పని చేయకపోవడంతో సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్ర వేయాలని ట్రెజరీ ఉన్నతాధికారులు సూచించారు. ఎక్కువ మంది ఎస్‌టీవో కార్యాలయాలకు వెళ్లి వేలిముద్ర వేశారు. కొందరు విశ్రాంత ఉద్యోగుల వేలిముద్రలు చెదిరిపోవడంతో పరికరంలో పడలేదు. దాంతో వారికి మార్చి నెలకు సంబంధించి 2 వేల మంది వరకు పింఛన్‌ విడుదల చేయలేదు. పెన్షనర్ల సంఘం నాయకులు ఉన్నతాధికారులను కలిసి మాట్లాడగా సాంకేతిక సమస్యలతో సీఎఫ్‌ఎంఎస్‌లో సిస్టం స్వీకరించలేదని తెలిపారు. ఏప్రిల్‌ పింఛన్‌ని మే నెలలో విడుదల చేయనున్నారు. అప్పుడైనా బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.


వివరాలు పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆదాయ పన్ను పాత విధానంలో రూ.3 నుంచి 5 లక్షల లోపు పన్ను పడదు. సేవింగ్స్‌ పరిగణనలోకి తీసుకుంటారు. పన్ను వేసినా రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే తిరిగి చెల్లిస్తారు. నూతన విధానంలో రూ.7.50 లక్షల లోపు పన్ను ఉండదు. సేవింగ్స్‌ని పరిగణనలోకి తీసుకోరు. ఆదాయ పన్ను శాఖ అధికారులు పాత విధానంలో కాకుండా నూతన విధానంలో పన్ను విధిస్తుండటంతో పెన్షనర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదాయ పన్నుకు వివరాలు పంపడంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య నెలకొందని విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆదాయం తగ్గి.. రోగాలతో మగ్గి..

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అప్పటి వరకు పొందుతున్న వేతనంలో 50 శాతం మాత్రమే పెన్షన్‌గా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు వయసు రీత్యా వచ్చే అనారోగ్యాలకు ఆస్పత్రుల్లో చికిత్స పొందడం, వైద్యుల సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారు ఆస్పత్రుల్లో వైద్యం కోసమే పింఛన్‌లో సింహభాగం ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ తగ్గించటం వలన వచ్చే పింఛన్‌ సొమ్ములో కోత పడటంతో కుటుంబాల పోషణ, అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం డబ్బులు ఖర్చయిపోతున్నాయి.

  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు.
  • గుంటూరు తాలూకా సబ్‌ ట్రెజరీ కార్యాలయం పరిధిలోనే 16 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.

కోలుకోలేని నష్టం
పి.నాగరాజు, అఖిల భారత పింఛన్‌దారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి

పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ 27 నుంచి 23 శాతానికి, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో రెండు కేటగిరిల్లో 3 శాతం చొప్పున తగ్గించడంతో  కోలుకోలేని నష్టం జరిగింది. పెన్షన్‌ ఆసరాగా జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు మేలు చేయాల్సి ఉండగా వచ్చే పింఛనులో కోత విధించడం దారుణం. ఈ నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు.


రూ.లక్షల్లో బకాయిలు చెల్లించాలి
- శ్రీనివాసరావు, అఖిల భారత పింఛన్‌దారుల వాయిస్‌ పత్రిక ఛైర్మన్‌

2018 నుంచి విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో నాకు రూ.8 లక్షల వరకు రావాల్సి ఉంది. నేను ఉద్యోగ విరమణ చేసి మూడేళ్లవుతోంది. బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు