logo

అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే

జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్‌జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది.

Published : 10 May 2024 05:38 IST

అన్నదాతను నిలువునా ముంచిన మిగ్‌జాం తుపాను
సాయం చేస్తున్నామంటూ ఉత్తుత్తి బటన్‌ నొక్కిన ప్రభుత్వం
సీఎం భరోసా ఇచ్చి అయిదు నెలలైనా.. అమలు శూన్యం
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - బాపట్ల

మిగ్‌జాం తుపానుకు నీట మునిగిన వరి పనలు (పాత చిత్రం)


2023, డిసెంబరు 8

మిగ్‌జాం తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా, పెట్టుబడి రాయితీలు రావనే అపోహలు వద్దు. ప్రతి రైతును ఆదుకుంటాం. సంక్రాంతికి పెట్టుబడి రాయితీ జమ చేస్తాం. బీమా సొమ్ము వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి అందిస్తానని హామీ ఇస్తున్నా..

కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ పలికిన పలుకులు


2024, మార్చి 6

తేడాది ఖరీఫ్‌ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులు, రబీ సీజన్‌ ప్రారంభంలో మిగ్‌జాం తుపాను వల్ల జరిగిన నష్టానికి పెట్టుబడి రాయితీ విడుదల చేస్తున్నాం. రైతులకు అందాల్సిన సాయం సమయానికి ఇచ్చే నమ్మకాన్ని కలిగించాం. వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఈ రోజు విడుదల చేస్తున్నాం.

పెట్టుబడి రాయితీకి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు బటన్‌ నొక్కిన సందర్భంలో సీఎం జగన్‌ ప్రగల్భాలు


జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్‌జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలగజేసింది. పూత, కాయలతో ఉన్న మిర్చి పంటలో కాయలు రాలిపోయి నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి, నీటమునిగి సర్వం వర్షార్పణం అయింది. నీటమునిగిన పంట ఆరిన తర్వాత కోత ఖర్చు తడిసిమోపెడైంది. కొందరు రైతులకు కోత ఖర్చులు కూడా రావని భావించి పంటను నీటిలో తొక్కించేశారు. ఉద్యాన పంటలకు కోలుకోలేని నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులు, భారీ వర్షంతో ఉద్యానపంటల నేలకొరిగి కాయలు రాలిపోయి, చెట్లు పడిపోయి తీరని నష్టం వాటిల్లింది. తుపాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోవడానికి సాగుదారులకు చాలారోజులు పట్టింది. అప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పెట్టుబడి రాయితీ సకాలంలో వస్తే ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావించారు. ఆలస్యంగానైనా మార్చి నెలలో బటన్‌ నొక్కితే సొమ్ము వస్తాయని ఆశపడ్డారు. అయితే ఇప్పటికీ సొమ్ము జమకాకపోవడంతో బటన్‌ నొక్కి రైతులను మోసం చేశారని మండిపడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలు కోటలు దాటినా అమలు గడప దాటని పరిస్థితి.


వాస్తవంలో ఇలా..

ఖజానాలో నిధులు లేకుండానే సీఎం జగన్‌ ఉత్తుత్తి బటన్‌ నొక్కడంతో రైతుల ఖాతాకు సొమ్ము జమకాలేదు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అంటే బటన్‌ నొక్కిన తర్వాత 11 రోజులు సమయం ఉన్నా సొమ్ము జమ కాకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కర్షకులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి.


బీమాపై స్పష్టత ఏదీ?

ఈ-పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకు పంటల బీమా పథకం అమలు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ నెలలో రైతులకు బీమా సొమ్ము పంపిణీ చేయాల్సి ఉంది. ఒకవైపు కరవు, మరోవైపు మిగ్‌జాం తుపానుతో రైతులు గత ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. పంటలు నష్టపోయినందున ఏ పంటకు ఎంత బీమా సొమ్ము వస్తుందన్న స్పష్టత ఇప్పటికీ లేదు. జిల్లాలో నష్టం వివరాలు, పంటకోత ప్రయోగాల నివేదికలు ప్రభుత్వానికి పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏపంటకు ఎంత పరిహారం వస్తుందన్న సమాచారం లేదని యంత్రాంగం చెబుతోంది.


బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేశా..
- వెంకయ్య, రైతు

మిగ్‌జాం తుపానుకు కౌలుకు తీసుకున్న పది ఎకరాలతో పాటు సొంతంగా సాగు చేసిన నాలుగు ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. సీఎం జగన్‌ బటన్‌ నొక్కడంతో బ్యాంకు ఖాతాలో పెట్టుబడి రాయితీ సొమ్ము పడి ఉంటుందని భావించి పలు మార్లు బ్యాంకుకు వెళ్లి చూశా. రూపాయి కూడా జమ కాలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగి వచ్చా. ఎన్నికల ముందు వరకు పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ ఎన్నికల సంఘం మీదకు నెపం నెడుతున్నారు.


మాట మీద నిలబడని సీఎం
- విజయ్‌, రైతు

రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట కోత దశలో మిగ్‌జాం తుపాను వల్ల ముంపు బారినపడి దెబ్బతింది. పండిన పంట తుపాన్‌ వల్ల తుడిచిపెట్టుకుపోయింది. సంక్రాంతిలోగా పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్‌ ప్రకటించి మాట తప్పారు. బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో నగదు రెండు నెలల వరకు ఎందుకు జమ చేయలేదు. పరిహారం చెల్లించకుండా ఇప్పుడు ఎన్నికల సంఘం అడ్డుకుందని చెబితే రైతులు ఎవరూ నమ్మే స్థితిలో లేరు.

మిగ్‌జాం తుపానుతో పంట నష్టం ప్రాథమిక అంచనా 1.01 లక్షల హెక్టార్లు
ప్రభుత్వం సవరించిన నష్టం 64,634 హెక్టార్లు
నష్టపోయిన రైతులు: 93,471
ప్రకటించిన పెట్టుబడి రాయితీ రూ.104.73 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు