logo

Hyderabad News: రూ.1.50 కోట్లు కొట్టేసిన అయిదుగురు దొరికారు

‘పేమెంట్‌ గేట్‌వే నుంచి అనధికారికంగా రూ.1.50 కోట్లు కొట్టేసిన అయిదుగురు సైబర్‌ కేటుగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు భువనేశ్వర్‌లో అరెస్టు చేసి....

Updated : 11 Dec 2021 08:43 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘పేమెంట్‌ గేట్‌వే నుంచి అనధికారికంగా రూ.1.50 కోట్లు కొట్టేసిన అయిదుగురు సైబర్‌ కేటుగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు భువనేశ్వర్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... 2021 నవంబరు 8న స్టార్‌ గ్లో ఎలక్ట్రికల్స్‌ యజమాని గోబింద్‌ చంద్రజెన (27) సీఎఫ్‌ఎల్‌ బల్బులను తయారీ, మరమ్మతులు చేస్తుంటాడు. ఇతనికి రాజు అనే వ్యక్తి ఫోన్‌ చేసి ‘ఆన్‌లైన్‌ పేమెంట్‌ సర్వీస్‌’ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పాడు. అతను చెప్పిన విధంగా సభ్యత్వం కోస దరఖాస్తు చేసుకున్నాడు. పేమెంట్‌ గేట్‌వే అధికారులు కేవైసీ వివరాలను పరిశీలించి సభ్యత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రూ.20 లక్షలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. రాజ్‌ ఆ మొత్తాన్ని కట్టేశాడు. రాజ్‌ ద్వారా యాక్సెస్‌ అయిన మెయిల్‌ ఐడీకి పేమెంట్‌ గేట్‌వే సేవలను ఉపయోగించడానికి అవసరమైన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను పంపించేశారు. ఈ గేట్‌వే పేమెంట్‌ ద్వారా డిపాజిట్‌కు మించి డబ్బు తీసుకునే అవకాశం లేదని ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సంస్థ స్పష్టం చేసింది. ఆ తర్వాత రాజు.. గోబింద్‌ చంద్రజెన పేరుతోనే లావాదేవీలు సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో రాజు.. పలుమార్లు డబ్బు డ్రా చేశాడు. తనకున్న లిమిట్‌ దాటినప్పటికీ డబ్బులు వస్తుండటంతో పేజీ సిస్టమ్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. ఇదే అదునుగా సుమారు రూ.1.50 కోట్లు కొట్టేశాడు. ఆ డబ్బును భువనేశ్వర్‌కు చెందిన బిమల్‌ ప్రసాద్‌ సమంతారే (26), బలభద్రదాస్‌ (26), దినేష్‌ మోహంతి (24)ల ఖాతాలకు బదిలీ చేసేశాడు. ఈ ఖాతాలను మనోజ్‌ కుమార రౌత్‌ (36) నిర్వహిస్తున్నాడు. దీనిపై ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సంస్థ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ పర్యవేక్షణలో పోలీసుల బృందం భువనేశ్వర్‌కు వెళ్లింది. అయితే అక్కడ ప్రధాన నిందితుడు రాజ్‌ దొరకలేదు. గోబింద్‌ చంద్రజెన, అలాగే దొంగ డబ్బు కోసం తమ ఖాతాలను అద్దెకు ఇచ్చిన బిమల్‌ ప్రసాద్‌ సమంతారే, బలభద్రదాస్‌, దినేష్‌ మోహంతిలతో పాటు ఖాతాలను నిర్వహిస్తున్న మనోజ్‌కుమార్‌ రౌత్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని