Hyderabad: పోలీసు కస్టడీకి వనస్థలిపురం బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్యాషియర్

వనస్థలిపురంలోని బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రవీణ్‌ను వనస్థలిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Published : 19 May 2022 21:58 IST

హైదరాబాద్: వనస్థలిపురంలోని బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రవీణ్‌ను వనస్థలిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ప్రవీణ్‌ను వనస్థలిపురం పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 21వ తేదీతో కస్టడీ ముగియనుంది. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రవీణ్‌ను తిరిగి హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు.

అసలేం జరిగింది..

వనస్థలిపురంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో క్యాషియర్ ప్రవీణ్ రూ.22 లక్షలు మాయం చేసినట్లు, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన బ్యాంకు నుంచి వెళ్లిపోయిన ప్రవీణ్... ఫోన్ స్విచ్‌ఆఫ్‌ చేసి పెట్టుకున్నాడు. మేనేజర్‌ ఫిర్యాదుతో పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రవీణ్ కోసం గాలించారు. తాను క్రికెట్ బెట్టింగులో డబ్బులు పోగొట్టుకున్నట్లు బ్యాంకు సిబ్బందితో పాటు తల్లికి ప్రవీణ్ సందేశం పంపించాడు. ప్రవీణ్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని... బ్యాంకులో నగదు లావాదేవీల్లో తేడాలు వస్తున్నట్లు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రవీణ్ ఓ సెల్ఫీ విడియో పంపించాడు. మేనేజర్ నిర్లక్ష్యం వల్లే నగదు తక్కువగా వస్తోందని ప్రవీణ్ వీడియోలో ఆరోపించాడు. ఈనెల 16వ తేదీన కోర్టులో లొంగిపోయిన ప్రవీణ్.. బ్యాంకులో చాలా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఎన్ఆర్ఐ ఖాతాలోనూ మోసం జరుగుతోందని, త్వరలో ఆ వివరాలు బయట పెడతానని చెప్పాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ప్రవీణ్ ను బ్యాంకులో నగదు లావాదేవీల్లో చోటుచేసుకున్న తేడాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్, సిబ్బందిపై ప్రవీణ్‌ చేసిన ఆరోపణలపై కూడా వివరాలను సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని