logo

నకిలీ ముద్ర.. నాణ్యతలేని మేక మాంసం సరఫరా

వెటర్నరీ స్టాంపు నకిలీ ముద్రలు వేసి, నాణ్యత లేని మేక మాంసాన్ని వినియోగదారులకు, హోటళ్లకు గుట్టుగా సరఫరా చేస్తున్న ఓ వ్యాపారిని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులు గుర్తించారు. కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 22 May 2022 05:52 IST

జియాగూడ, న్యూస్‌టుడే: వెటర్నరీ స్టాంపు నకిలీ ముద్రలు వేసి, నాణ్యత లేని మేక మాంసాన్ని వినియోగదారులకు, హోటళ్లకు గుట్టుగా సరఫరా చేస్తున్న ఓ వ్యాపారిని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులు గుర్తించారు. కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెటర్నరీ అధికారుల ఫిర్యాదుతో సదరు వ్యాపారిని అరెస్టు చేశారు. సుమారు 380 కేజీల మాంసం, వెటర్నరీ వైద్యుడి నకిలీ స్టాంపు, కారును పోలీసులు సీజ్‌ చేశారు. జియాగూడకు చెందిన సందీప్‌ (38) జియాగూడ మండీలో మేకల విక్రయాలు, మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై టోకుగా నకిలీ స్టాంపుతో ముద్రవేసి సరఫరా చేస్తున్నాడు. కొంతకాలంగా ఇతడి అక్రమ వ్యాపారం కొనసాగుతోందని అధికారులు గుర్తించారు. శనివారం జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.చక్రపాణిరెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వివేకానంద్‌, కార్వాన్‌ సర్కిల్‌ వెటర్నరీ అధికారి డాక్టర్‌ మోహన్‌రెడ్డి తదితరుల బృందం ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాపారిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపురా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ పర్యవేక్షణలో ఎస్సై శేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని