logo

సహజ ప్రసవం.. అందుకో ప్రోత్సాహం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను పెంచటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం నుంచి

Published : 08 Aug 2022 02:58 IST

వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం
చొరవ చూపుతున్న ప్రభుత్వం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను పెంచటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 4న వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సాధారణ కాన్పుకు గాను సిబ్బందికి రూ.3000 అందించనున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అన్ని కేంద్రాల్లో నిర్వహణ

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. తాండూరు మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ఆధునిక సౌకర్యాలున్నాయి. జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఆ తర్వాత వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది.  జిల్లాలో 24 గంటల పాటు కొనసాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 7 ఉన్నాయి. వీటిలో నెలకు 8 నుంచి 10 వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు 1518

జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ, 2 పట్టణ దవాఖానాలున్నాయి. నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు పరిగి, వికారాబాద్‌, మర్పల్లి, కొడంగల్‌లో ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి తాండూరులో ఉంది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాలు 1518 జరపగా సిజేరియన్‌ ప్రసవాలు 842 ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉంది. వీటిల్లో ఎక్కువగా కోతలే జరుగుతున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలు 257 జరిగితే సిజేరియన్‌ 800 ఉన్నాయి. కొంత కాలంగా ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టింది. తాండూరులో ప్రతి నెల 250 నుంచి 350 వరకు కాన్పులు జరుగుతున్నాయి. వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 నుంచి 180 వరకు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 8నుంచి 10 ప్రసవాలు చేస్తున్నారు.

85 శాతం సాధిస్తేనే...  

సహజ ప్రసవాల్లో 85 శాతం లక్ష్యం సాధిస్తేనే ప్రోత్సాహకంగా రూ.3000 చెల్లించనున్నారు. నెలకు జిల్లా ఆసుపత్రిలో 250, ప్రాంతీయ ఆసుపత్రిలో 150, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 50, ఇరవై నాలుగు గంటలు పాటు కొనసాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 5 సాధారణ ప్రసవాలు జరపాలని లక్ష్యం నిర్ణయించారు. ఇవి పూర్తిచేస్తేనే ప్రోత్సహకం అందజేస్తారు.

గర్భిణులకు వివరించాలి - డాక్టర్‌ జీవరాజ్‌, జిల్లా ఉప వైద్యాధికారి, వికారాబాద్‌

ప్రోత్సాహకాల నేపథ్యంలో సిబ్బంది, అధికారులు తగిన చొరవ చూపాలి. గర్భిణులకు సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలి. ప్రస్తుతం 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీల్లో ప్రతి నెల 8 నుంచి10 వరకు కాన్పులు చేస్తున్నారు. చాలావరకు సహజ ప్రసవాలే ఉంటున్నాయి. ఇక నుంచి ఆసుపత్రుల్లో సహజ కాన్పులు ఎక్కువ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాల గురించి వివరిస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని