logo
Updated : 11 Aug 2022 04:06 IST

దొరకని డీఏపీ.. సాగని వరి!

దుకాణాల్లో నో స్టాక్‌ బోర్డులు ● అవస్థలు పడుతున్న రైతులు

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ గ్రామీణ


మడి నుంచి నారు తీస్తున్న కూలీలు

అసలే ఎడతెరిపిలేని వర్షాలు.. దెబ్బతింటున్న పంటలు.. పొలాల్లో నీరు నిలిచి ఏంచేయాలో తోచని జిల్లా రైతులు. పెట్టుబడుల కోసం ఎదురుచూపులు.. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఇదే వర్షాలతో వరి సాగుకు అనుకూలమని కొందరు సాగు పనులు చేపడదామని చూస్తే...ఎరువుల కొరత.. వెరసి రైతుకు ఎటూ పాలుపోని పరిస్థితి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

నిరాశతో వెనుదిరగడమే..

జిల్లాలో ప్రధానంగా డీఏపీ ఎరువు ఎక్కడా దొరకడం లేదు. నిత్యం వివిధ గ్రామాల నుంచి రైతులు మండల కేంద్రాల్లోని వ్యాపారుల వద్దకు వచ్చి ఆరా తీస్తున్నారు. డీఏపీ రావడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఈ ప్రభావం వరి సాగుపై ప్రత్యక్షంగా పడుతోంది. అధిక వానలు కేవలం వరి పంటకు మాత్రమే అనుకూలంగా మారాయి. దీంతో వరి సాగుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. 20రోజుల క్రితమే నారుమళ్లను పోసుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. పలుచోట్ల నాట్లు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధానంగా డీఏపీ ఎరువుల అవసరత ఉంది. పది రోజులుగా ఎక్కడా బస్తా డీఏపీ ఎరువు దొరకడం లేదని వాపోతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతన్నలు సతమతమవుతున్నారు. అరకొరగా ఉన్న చోట్ల అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

* దోమ మండలం బాసుపల్లి గ్రామానికి చెందిన మొగులయ్యకు రెండెకరాల విస్తీర్ణంలో పొలం ఉంది. వరి సాగుకు నెల రోజుల క్రితం నారుమడి పోసుకున్నాడు. దమ్ము పనులు పూర్తయ్యాక ఎరువుల కోసం వారం రోజులుగా నిత్యం పరిగికి తిరుగుతున్నాడు. పది దుకాణాల్లో అడిగినా డీఏపీ లేదన్న సమాధానమే

* ప్రభుత్వం బస్తా డీఏపీ ధరను రూ.1,350కి నిర్ణయించగా వ్యాపారులు మాత్రం రూ.50 నుంచి రూ.80 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ ప్రాంతాల్లో ఈ వ్యవహారం కొనసాగుతోంది.

కోటాలో కోత..

జిల్లాకు సరిపడా కోటా రాకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. వచ్చినా అరకొరగానే వస్తోందని ఇదే కొరతకు కారణమని పేర్కొంటున్నారు. వానాకాలం అన్ని రకాల పంటల సాధారణ సాగు 5,31,500 ఎకరాలు. ఇందులో ఇప్పటివరకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలకు సాగులోకి వచ్చాయి. మొత్తంగా 88,200 ఎకరాల్లో వరి సాగుకు అధికారులు అంచనా వేశారు.

* డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సీజన్‌కు యూరియా 36,229 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 15,615, ఎంఓపి 9,248, కాంప్లెక్సు ఎరువులు 25,732, ఎస్‌ఎస్‌పి 8,798 మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రతిపాదించారు. సాగు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు విడతల వారీగా డిమాండును బట్టి సరఫరా కావాల్సి ఉంది. ఇందులో డీఏపీ కనీసం సగానికి సగం కూడా సరఫరా కాలేదని సమాచారం.

* జిల్లా వ్యాప్తంగా డీఏపీ కేవలం 829 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని అధికారుల సమాధానం. ఇతర ఎరువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.


లేవని చెబుతున్నారు : అంజిలయ్య, దోమ

రెండెకరాల్లో వరి సాగుకు నారు పోసుకున్నాం. నాట్లు వేసుకునేందుకు అదను వచ్చింది. తీరా డీఏపీ ఎరువు కోసం పరిగికి వెళ్తే వ్యాపారులు లేవని చెబుతున్నారు. జాప్యం చేస్తే సాగు సమయం దాటిపోతుందన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే వేసుకున్న పత్తి పంట వర్షాలకు పాడైంది. కనీసం వరి సాగు చేసుకుందామని అనుకున్నా ఎరువులు దొరకడం లేదు.


చర్యలు తీసుకుంటాం: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

డీఏపీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. వరి సాగుకు ఒక డీఏపీ ఎరువు కాకుండా 20:20 ఎరువును వాడవచ్ఛుజిల్లాలోని నేలల్లో భాస్వరం అధికంగానే ఉంది. డీఏపీ బదులుగా పీఎస్‌బి (పాస్ఫరస్‌ సాలిబులైజింగ్‌ బాక్టీరియా)ను ఎకరానికి 2 కిలోలు వాడితే చాలు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని