logo

ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు బోర్డు

గాజులరామారం పరిధిలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని 12, 13 సర్వే నంబర్లలోని సింహభాగం భూమి ఇప్పటికే కబ్జాదారుల వశమైంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని..

Updated : 13 Aug 2022 05:17 IST

రూ. 40 కోట్ల విలువైన రెండు ఎకరాల కబ్జా

ప్రభుత్వ బోర్డు తొలగించి ఏర్పాటు చేసిన ప్రైవేటు సూచిక

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: గాజులరామారం పరిధిలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని 12, 13 సర్వే నంబర్లలోని సింహభాగం భూమి ఇప్పటికే కబ్జాదారుల వశమైంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని.. ఓ స్థిరాస్తి వ్యాపారి ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. తర్వాత 12 సర్వే నంబరులోని రూ.40 కోట్ల విలువైన రెండు ఎకరాల కబ్జాకు మరో స్తిరాస్థి వ్యాపారి పథకం పన్నాడు. గతంలో ఈ విషయమై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించి మొక్కలు నాటి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ సూచికలు ఏర్పాటు చేశారు. తాజాగా దీని పక్కనే ఉన్న 445 సర్వే నంబరు పేరుతో.. వ్యాపారులు సర్వే నంబరు 12లోని ప్రభుత్వ సూచికలను తొలగించి ప్రైవేటు స్థలంగా కోర్టు ఆర్డరు పేరుతో సూచికలను ఏర్పాటు చేశారు. ఏకంగా ప్రహారీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఏప్రిల్‌లో ఇదే వ్యక్తులు ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నించగా ‘ఈనాడు’లో కథనం రావడంతో జేసీబీతో వారు ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలను అధికారులు తొలగించారు. మళ్లీ మరోసారి రాత్రికి రాత్రే ప్రభుత్వ సూచికలు తొలగించి తమ బోర్డులను ఏర్పాటుచేసుకున్నారు. 12 సర్వే నంబరులో మొత్తం 12.24 గుంటల స్థలం ఉండేది. ఇందులో స్థానికుల పోరాటంతో ప్రభుత్వ పాఠశాల, క్రీడామైదానం కోసం 6.24 గుంటలను కేటాయించగా ప్రభుత్వ పాఠశాలతో పాటు మైదానం ఏర్పాటుచేశారు. మరో 2 ఎకరాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాన్ని నిర్మించారు. ఇవన్నీ పోను రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇంకా 4 ఎకరాలు ఉండాలి. అయితే గృహసముదాయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో కొంత కబ్జా కాగా.. రోడ్డుకు ఇవతలి వైపున 2 ఎకరాలు ఉంది. ఇది ప్రభుత్వ స్థలమేనని అధికారులకు తెలుసు. ఇదే స్థలంలో మూడు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మొక్కలూ నాటారు. తాజాగా ఈ స్థలం 445 సర్వే నంబరులోకి వస్తుందని.. రెవెన్యూ సర్వే విభాగం ఏడీఐ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటూ వ్యాపారులు కబ్జా తతంగాన్ని చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే రూ. 40 కోట్ల విలువైన స్థలం కనుమరుగయ్యే అవకాశముంది.

ఇదే స్థలంలో 2019లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

వివేకానంద్‌, అప్పటి కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి

సర్వే చేయిస్తాం

ఈ విషయమై తహసీల్దారు సంజీవరావును వివరణ కోరగా.. స్థిరాస్తి వ్యాపారి 12 సర్వే నంబరు స్థలంలోని ప్రభుత్వ సూచికలు తొలగించి ప్రైవేటు స్థలంగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సదరు వ్యక్తులను ప్రశ్నించగా ఈ స్థలం 445 సర్వే నంబరులోకి వస్తుందని పత్రాలు చూపించినట్లు తెలిపారు. సోమవారం స్థలాన్ని సర్వే చేయించి ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణాలను తొలగిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని