logo

కౌమార సమస్యలకు చెక్‌.. ‘యువ’ క్లినిక్‌

కౌమార దశలో యువతలో కొందరు అటు కుటుంబం, ఇటు సమాజం నుంచి సరైన ఆదరణ లేక కొంతమంది పక్కదారి పడుతున్నారు. శరీరంలో వచ్చిన మార్పులు.. మానసికంగా దాని ప్రభావం తదితర అంశాలపై విశదీకరించే వారు లేక కట్టుతప్పుతున్నారు.

Published : 14 Aug 2022 03:03 IST

నిలోఫర్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి
నెలకు 200-300 మంది రాక

యువకులతో నిలోఫర్‌ వైద్య బృందం

ఈనాడు, హైదరాబాద్‌: కౌమార దశలో యువతలో కొందరు అటు కుటుంబం, ఇటు సమాజం నుంచి సరైన ఆదరణ లేక కొంతమంది పక్కదారి పడుతున్నారు. శరీరంలో వచ్చిన మార్పులు.. మానసికంగా దాని ప్రభావం తదితర అంశాలపై విశదీకరించే వారు లేక కట్టుతప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నిలోఫర్‌లోని యువ క్లినిక్‌ ఆ దిశగా కృషి చేస్తోంది. గతంలోనే ఈ కేంద్రం ప్రారంభమైనప్పటికీ.. వివిధ కారణాలతో సేవలు ఆగిపోయాయి. తాజాగా మళ్లీ ఈ కేంద్రంలో కార్యకలాపాలను ప్రారంభించారు. నోడల్‌ అధికారిగా ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్‌ దంపురి రమేష్‌ బాధ్యతలు చేపట్టారు.
చాలా కీలక దశ...
ఎంతో మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా...ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కొన్నిసార్లు ఆత్మహత్య లాంటి విపరీత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. యువత ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపి దారిలోకి తేవడమే ఈ క్లినిక్‌ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రోజూ ఇక్కడకు 15 నుంచి 20 మంది యువత వివిధ సమస్యలపై కౌన్సిలింగ్‌ తీసుకుంటున్నారు. యువతలో అనారోగ్య సమస్యలకు ఉచితంగానే చికిత్స అందిస్తామని డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. క్లినిక్‌కు వచ్చే వారిలో 70 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. మానసిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు కౌన్సిలర్‌ అందుబాటులో ఉంటారన్నారు. యువతలో ఇలాంటి సమస్యలు గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే ఈ క్లినిక్‌లను సంప్రదించాలని సూచించారు.
ఏ సమస్యలకు పరిష్కారం...
యువత ఎదుర్కొనే ఎలాంటి సామాజిక, మానసిక, ఆరోగ్య సమస్యలకైనా ఇక్కడ పరిష్కారం చూపిస్తారు. ఆ సమస్యలు ఏంటంటే...* యువత ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు..* శారీరకంగా జరిగే మార్పులపై అవగాహన ః సామాజిక, మానసిక ఇబ్బందులపై..* శరీర ఆకృతిలో కలిగే మార్పులు....*ఆత్మన్యూనత, మానసిక వ్యాకులత ః పౌష్టికాహార లోపంపై....* వ్యక్తిగత శుభ్రత గురించి  * టీకాలు, మందులపై అవగాహన..* లైంగిక పరమైన ఇబ్బందులపై..* లైంగిక వేధింపుల గురించి...* విచ్చలవిడి ప్రవర్తనలు...మార్చుకునే పద్ధతులు..*మత్తు మందు, ఆల్కహాల్‌కు బానిసైతే.....*కుటుంబ బంధాలు...తలెత్తే సమస్యలపై..* కేరీర్‌ గైడెన్స్‌ గురించి..* జీవితం విలువ చెప్పడం...చదువుపై ఆసక్తి పెంచడం..*హక్కులపై అవగాహన పెంచడం...బాధ్యతలను తెలపడం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని