logo

వర్సిటీల పాలక మండళ్లు.. చుట్టుముడుతున్న వివాదాలు

విశ్వవిద్యాలయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదస్పదమవుతున్నాయి. పాలకమండళ్ల ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగులు, ఆచార్యులు ఆందోళన బాట పడుతున్నారు. ఉపకులపతులు చెప్పే మాటలకు తలూపుతూ, భిన్న కోణాల్లో చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 05 Oct 2022 03:10 IST

ఉపకులపతుల మాటలకు తలూపుతున్న వైనం

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదస్పదమవుతున్నాయి. పాలకమండళ్ల ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగులు, ఆచార్యులు ఆందోళన బాట పడుతున్నారు. ఉపకులపతులు చెప్పే మాటలకు తలూపుతూ, భిన్న కోణాల్లో చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూ, తెలుగు వర్సిటీ, హెచ్‌సీయూ.. ఇలా ప్రతి విశ్వవిద్యాలయంలోని పాలకమండలి నిర్ణయాలపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో పాలకమండళ్ల పాత్ర కీలకం. ఏడాదిన్నర కిందట ప్రభుత్వం పాలకమండళ్లను నియమించింది. వీటిల్లో సభ్యులు సమావేశాలకు గైర్హాజరవడం, హాజరైనా పట్టించుకోకపోవడం వర్సిటీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  

నిర్ణయాలు.. వివాదాలు

ఉస్మానియాలో ఒప్పంద సహాయ ఆచార్యులతో బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించాలని పాలకమండలి రెండుసార్లు తీర్మానం చేసింది.  ఒప్పంద ఆచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఓయూలో పీహెచ్‌డీ సమర్పణలకు నిర్దేశిత గడువు ఇచ్చి ఆలోగా సమర్పించాలని ఆదేశించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ దిగొచ్చి పలుమార్లు గడువు పొడిగించాల్సి వచ్చింది. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష విషయంలో తీసుకున్న నిర్ణయం సైతం వివాదానికి దారి తీసింది.

జేఎన్‌టీయూలో ఓఎస్డీగా ధర్మానాయక్‌ నియామకంపైనా వివాదం ముసురుకుంది. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో ఉపసంచాలకుడిగా ఉన్న ఆయన్ను జేఎన్‌టీయూలో డిప్యుటేషన్‌పై నియమించడంపై ప్రభుత్వానికి విద్యార్థి నాయకులు ఫిర్యాదులు చేశారు. ఆయన్ను వెనక్కి పంపించాలని అంబేడ్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ జేఎన్‌టీయూకు లేఖ రాశారు. పాలకమండలి నిర్ణయం కావడంతో.. అందులో చర్చించాకే ముందుకు వెళ్తామని ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి వివరించారు.

జేఎన్‌టీయూలో ఐఎస్‌టీ, ఇంజినీరింగ్‌ కళాశాల విలీనం చేస్తూ పాలకమండలి చేసిన తీర్మానాన్ని ఆచార్యులు వ్యతిరేకిస్తున్నారు.

హెచ్‌సీయూలోని ఉద్యోగులు, ఆచార్యుల మెడికల్‌ కేంద్రంలో ఔషధాలపై పరిమితి, వీసీ పరిశోధనలకు ఏడాదికి రూ.20లక్షలు కేటాయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని