logo

అమ్మకు ఆడపిల్ల గండం

అమ్మ కడుపులో ఊపిరిపోసుకునే కొత్తప్రాణం.. ఆడపిల్ల అని తెలియగానే మట్టిపాలవుతోంది. కాలం మారినా లింగవివక్ష తగ్గలేదు.

Updated : 03 Dec 2022 06:26 IST

గ్రేటర్‌లో లింగనిర్ధారణ పరీక్షలు.. భ్రూణహత్యలు

ఈనాడు, హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే: అమ్మ కడుపులో ఊపిరిపోసుకునే కొత్తప్రాణం.. ఆడపిల్ల అని తెలియగానే మట్టిపాలవుతోంది. కాలం మారినా లింగవివక్ష తగ్గలేదు. పోలీసులు తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నా.. గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కంచన్‌బాగ్‌లో పుట్టబోతుంది ఆడపిల్ల అని అనుమానించి భార్యకు బలవంతంగా మాత్రలు మింగించి గర్భవిచ్ఛిత్తి చేయించటం కలకలం రేకెత్తించింది. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దారుణం బయటపడింది. శివారు, పాతబస్తీ ప్రాంతాల్లో ఎన్నో భ్రూణహత్యలు చీకటిలో కలసిపోతున్నాయి.

పుట్టబోయేది ఎవరో ఎలా చెబుతారంటే

కేవలం గర్భిణులను నిశితంగా పరిశీలించి కడుపులో ఉన్నది ఆడ/మగ అనేది అంచనా వేస్తారు. నిరక్షరాస్యుల అవగాహన లోపాన్ని ఆసరాగా తీసుకున్న బ్లాక్‌ మెజీషియన్లు, బురిడీ బాబాలు వేసే ఎత్తుగడలకు ఇవి ఉదాహరణలు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో మకాంవేసిన మాయగాళ్లు ఇల్లిల్లూ తిరుగుతుంటారు. దంపతులకు మగపిల్లాడు జన్మించేలా క్షుద్రపూజలు జరిపిస్తామంటూ భారీగా డబ్బులు గుంజుతుంటారు. స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు.. గర్భిణుల నడక, శారీరక మార్పులను చూసి పుట్టబోయేది ఎవరో చెబుతుంటారు. ఆడపిల్లని చెబితే.. భార్యాభర్తలు నిజమనుకొని.. కడుపులో పిండాన్ని తొలగించేందుకు సిద్ధపడతారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్షకేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. రూ.5000-6000 అదనంగా వసూలు చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు వాహనాల్లోనే స్కానింగ్‌ యంత్రాలను తీసుకెళ్లి పరీక్షలు చేసి భారీగా ఫీజులు గుంజుతున్నారు.

వైద్యుడి సిఫార్సు లేకుండానే..

పేద, మధ్యతరగతి కాలనీల్లో ప్రాథమిక వైద్యం చేసే కొందరు ఆర్‌ఎంపీలు, మందుల దుకాణ నిర్వాహకులు వైద్యుడి సిఫార్సు లేకుండానే అశాస్త్రీయంగా, మాత్రలతో అబార్షన్‌లకు పాల్పడుతున్నారు. ప్రేమ, ఆకర్షణ వలలో చిక్కి తప్పటడుగు వేసిన మైనర్లను కుటుంబసభ్యులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ బాలిక గర్భందాల్చినట్టు తెలియగానే.. మందుల దుకాణాల్లో మాత్రలు వేస్తున్నారంటూ ఓ వైద్యురాలు ఆందోళన వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని