మామిడి.. మగ్గుతోంది ఇలా!

వేసవి సీజన్‌లో ప్రతి ఒక్కరి ఆహారంలో పండ్లకు ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ క్రమంలో మామిడి పండ్ల కొనుగోళ్లూ జోరుగా సాగుతాయి.

Updated : 02 Apr 2023 04:07 IST

నిబంధనలు విస్మరిస్తున్న వ్యాపారులు

కాయల మధ్య పెట్టిన రసాయన ప్యాకెట్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: వేసవి సీజన్‌లో ప్రతి ఒక్కరి ఆహారంలో పండ్లకు ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ క్రమంలో మామిడి పండ్ల కొనుగోళ్లూ జోరుగా సాగుతాయి. అయితే, పక్వానికి రాకముందే  మామిడికాయలను తెంపి మార్కెట్‌కు తరలిస్తుండటం, ఆనక వాటిని మగ్గ పెట్టడానికి వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కు నిత్యం 1000 టన్నుల మామిడి వస్తోంది.  ఈ క్రమంలో మామిడికాయలను మగ్గపెట్టడంలో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు గతేడాది అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతులు పొందిన రసాయనాలనే, సూచించిన మోతాదులోనే వాడాలని,  నిబంధనలు పాటించాలని ఆదేశించారు.  

ప్రస్తుతం ఇలా..: మామిడిని ఎగుమతికి, విక్రయాలకు అనుగుణంగా డబ్బాల్లో ప్యాక్‌ చేసి సిద్ధం చేస్తున్నారు. 20 కిలోల మామిడి డబ్బాలో ఏడెనిమిది వరకు రసాయన ప్యాకెట్లను నేరుగా కాయల మధ్యలోనే ఉంచుతున్నారు.  దీంతో అవి త్వరగా మగ్గి మంచి రంగులోకి మారుతున్నాయి. ఈ పండ్లను తినేవారు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సర్క్యులర్‌ జారీ చేశాం..

నిబంధనలు పాటించాలని  సర్క్యులర్‌ జారీ చేసినట్లు బాటసింగారం పండ్ల మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి తెలిపారు.  నిషేధిత రసాయనాలు వాడినట్లు తనిఖీల్లో వెలుగుచూస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు చెప్పారు.

నిబంధనలివీ..

* మామిడి కాయలను మగ్గపెట్టే క్రమంలో.. రసాయనాలున్న ప్యాకెట్‌ నేరుగా కాయలకు తగలకుండా సబ్బుపెట్టెలో ఉంచి వాటి మధ్యలో పెట్టాలి.

* ప్రతి 20 కిలోల డబ్బాలో ఒక ప్యాకెటే ఉంచాలి.

* ప్యాకింగ్‌ చేసిన డబ్బాలోని రసాయన పొట్లాన్ని 24 గంటల తర్వాత తొలగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని