logo

ట్రాఫిక్‌ చిక్కులు.. ఛార్జింగ్‌కు తిప్పలు

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల శక్తినంతటినీ ఈ రద్దీ పీల్చేస్తోంది.

Published : 13 Jun 2023 02:01 IST

నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులకు ఎదురవుతున్న సవాలు
జూన్‌ నెలాఖరులోగా మరో 28 వాహనాలు
ఈనాడు, హైదరాబాద్‌

గరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల శక్తినంతటినీ ఈ రద్దీ పీల్చేస్తోంది. విద్యుత్‌ స్కూటీలు, కార్లు, బస్సులు ఇలా ప్రతి ఒక్క వాహనంలో ఈ సమస్య ఏర్పడుతోంది. ఛార్జింగ్‌ చేసిన అనంతరం ఎక్కువ దూరం ప్రయాణిస్తే తిరుగు ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతున్న సందర్భాలున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీసీని సైతం ఈ సమస్య వెంటాడుతోంది. ఇటీవలే 10 ఇ-గరుడ బస్సులను విజయవాడకు నడపడం ప్రారంభించారు. ట్రాఫిక్‌ రద్దీని దాటుకుని అక్కడికి చేరుకునే క్రమంలో రెండుసార్లు ఛార్జింగ్‌ చేయాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్‌ నెలాఖరులో కంటోన్మెంట్‌ నుంచి 28 సిటీ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ట్రాఫిక్‌ సవాళ్లను ఎదుర్కొంటూ కేవలం రెండు ఛార్జింగ్‌ స్టేషన్లున్న నగరంలో వీటిని నడిపేదెలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 10 ఎలక్ట్రిక్‌ గరుడ బస్సులను నడుపుతోంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మియాపూర్‌లో ఛార్జింగ్‌ పెట్టిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంజీబీఎస్‌కు, అక్కడి నుంచి మరిన్ని ట్రాఫిక్‌ కూడళ్లు దాటి చౌటుప్పల్‌ చేరుకునే సరికి 60-70 శాతం ఛార్జింగ్‌ అయిపోతోంది. దీంతో సూర్యాపేటలో ఛార్జింగ్‌ చేస్తున్నారు. ఏడాది చివరికల్లా 570కి పైగా విద్యుత్‌ బస్సులు తీసుకురావాలన్న ప్రణాళికలతో ముందుకెళ్తున్న ఆర్టీసీ ‘రీఛార్జింగ్‌’ సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో. ప్రధానంగా రద్దీగా ఉండే నగరంలో ఈ సమస్యలు పరిష్కరించాలి. పైగా మియాపూర్‌ డిపో-2, కంటోన్మెంట్‌లో రెండే ఛార్జింగ్‌ స్టేషన్‌ యూనిట్లు ఉండటం నిర్వహణ సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మొత్తం 350 కూడళ్లున్నాయి. అందులో 100 జంక్షన్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక వర్షాకాలంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు