logo

OTT: ఓటీటీ.. సైబర్‌ నేరగాళ్ల లూటీ

అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.50.. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ జీవితకాల సభ్యత్వం రూ.1,499.. రూ.20 కట్టి నెట్‌ఫ్లిక్స్‌ నెలంతా వాడుకోవచ్చు.. ఇలాంటి ఈ మెయిళ్లు, వాట్సాప్‌ సందేశాలు మీకు అందుతున్నాయా..

Updated : 03 Oct 2023 08:37 IST

తక్కువ ధరకే సభ్యత్వమంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు
నకిలీ లింకులతో సందేశాలు

ఈనాడు- హైదరాబాద్‌: అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.50.. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ జీవితకాల సభ్యత్వం రూ.1,499.. రూ.20 కట్టి నెట్‌ఫ్లిక్స్‌ నెలంతా వాడుకోవచ్చు.. ఇలాంటి ఈ మెయిళ్లు, వాట్సాప్‌ సందేశాలు మీకు అందుతున్నాయా.. భలే ఆఫర్‌ అనుకుని లింకు క్లిక్‌చేసి.. ఓటీపీ నమోదు చేస్తే నిండా మునిగిపోయినట్టే.  పెరుగుతున్న ఓటీటీల వినియోగం సైబర్‌ నేరగాళ్లకు జేబు నింపుతోంది. తప్పుడు సందేశాలతో రూ.లక్షలు కొట్టేస్తున్నారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వరుసగా నమోదవుతున్నాయి.  

ప్రకటనతో ఎర.. ఓటీపీతో మాయ

కరోనా తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్‌ తదితర ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. ప్రకటనలు లేకుండా(యాడ్‌ ఫ్రీ), ఒకేసారి ఎక్కువ తెరపై కంటెంట్‌ చూసేందుకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు నెలవారీ సభ్యత్వానికి బదులు, వార్షిక చందా తీసుకుంటే ధర తగ్గిస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు  ఇలాంటి ఆఫర్లతోనే మోసం చేస్తున్నారు. సాధారణంగా ఓటీటీ సంస్థలు నెలవారీ, వార్షిక గడువు ముగిస్తే పునరుద్ధరించుకోవడానికి ఖాతాలో రిజిస్టర్‌చేసిన ఈమెయిల్‌కు సందేశం పంపిస్తాయి. అచ్చం సైబర్‌ ముఠాలు ఇదే పనిచేసి బోల్తా కొట్టిస్తున్నాయి. ఈ లింకుపై క్లిక్‌ చేశాక అచ్చం ఓటీటీ చెల్లింపుల తరహాలోనే బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నంబర్లు, పిన్‌ నమోదుచేసే వ్యవస్థలుంటాయి. ఇవి నమోదు చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బంతా క్షణాల్లో మాయమవుతుంది.

గూగుల్‌ అల్గారిథమ్‌తో మాయ

నేరగాళ్లు మోసం చేసేందుకు గూగుల్‌ అల్గారిథమ్‌ వ్యవస్థా కారణమవుతోంది. ఆన్‌లైన్‌లో ఓటీటీ సభ్యత్వ రుసుములు, ఇతర వివరాలను శోధించినప్పుడు అదే అంశానికి సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. ఇందులోనే సైబర్‌ నేరగాళ్లు రూపొందించిన నకిలీ ప్రకటనలు వస్తాయి. వాటిని కొందరు క్లిక్‌ చేసి మోసపోతున్నారు. కోట్లాదిమంది  వ్యక్తిగత ఈమెయిళ్ల వివరాలు డేటా ప్రొవైడర్ల దగ్గర లభిస్తున్నాయి. ఈ మెయిళ్లకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని