logo

WhatsApp: వాట్సాప్‌ వినియోగదారులూ.. తస్మాత్‌ జాగ్రత్త!

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. ఆన్‌లైన్‌ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్‌ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్‌ ఉపయోగిస్తున్నారు.

Updated : 24 Jan 2024 07:41 IST

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. ఆన్‌లైన్‌ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్‌ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్‌ ఉపయోగిస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ) సూచిస్తోంది.  

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

మిస్డ్‌ కాల్స్‌తో అప్రమత్తం

అపరిచిత నంబర్లతో వాట్సప్‌ మిస్డ్‌ కాల్స్‌ వస్తుంటాయి. రెండు మూడు రింగ్‌ల తరువాత కాల్‌ ఆగిపోతుంది. వీటిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. అయితే హ్యాకర్స్‌ యాక్టివ్‌ వినియోగదారులను గుర్తించేందుకు మిస్డ్‌ కాల్స్‌ చేస్తుంటారని బీపీఆర్‌డీ పేర్కొంది. వాట్సప్‌లో వారిని గుర్తించి వివిధ రకాలుగా సైబర్‌ ముప్పులోకి లాగుతారు. ఎక్కువగా +254, +63, +1(218) వంటి ప్రారంభ సంఖ్యలతో మిస్డ్‌ కాల్స్‌ వస్తుంటాయి. ఇవి వియత్నాం, కెన్యా, ఇథియోపియా, మలేసియా దేశాలకు చెందిన నంబర్లుగా బీపీఆర్‌డీ గుర్తించింది. ఆయా నంబర్లతో వచ్చిన ఫోన్లకు దూరంగా ఉండాలని తెలిపింది.

ఉద్యోగాల పేరిట మోసం

 మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ సైబర్‌ మోసగాళ్లు సందేశాలు పంపుతుంటారు. ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగాల పేరిట డీపీలు లేని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని, రిప్లయ్‌లు ఇవ్వొద్దని బీపీఆర్‌డీ హెచ్చరిస్తోంది.

బ్యాంక్‌ వివరాలు కొల్లగొడతారు

వాట్సప్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోకాల్‌ మాట్లాడుతున్నప్పుడు ఈ ఆప్షన్‌ వస్తుంది. తద్వారా తమ స్క్రీన్‌ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్‌ కేటుగాళ్లు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, రహస్యమైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. దాంతోపాటు హానికరమైన యాప్‌లను బాధితుడి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు.

ట్రేడింగ్‌ సలహాలిస్తామంటూ..

ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తుంటారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో లేని అనధికారిక అప్లికేషన్‌ లింక్‌లను పంపించి.. దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు మాయంచేస్తారు. మరికొందరు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగులమంటూ నమ్మిస్తారు. కొన్ని వస్తువులను విక్రయించడంతో లాభాలు పొందొచ్చని చెప్పి.. ముందుగా కొంతమొత్తం చెల్లించమని సూచిస్తారు.. తీరా వినియోగదారులు డబ్బులు చెల్లించిన తరువాత వస్తువులు రాకా.. కట్టిన మొత్తం తిరిగి పొందక మోసపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని