logo

చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం

దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.

Updated : 25 Apr 2024 02:36 IST

సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు

ఈనాడు, హైదరాబాద్‌: దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు. చిట్టీల పేరుతో రూ.4.15 కోట్లు వసూలు చేసి పత్తాలేకుండా పోయారు. నగరంలోని బాలానగర్‌ చింతల్‌ కేంద్రంగా జరిగిన ఈ మోసంపై సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే మేకల నాగమునెయ్య, ఆయన భార్య నాగమణి, సమీప బంధువులు చేకూరి రంగనాయకులు, గురుస్వామి15 ఏళ్లుగా బాలానగర్‌ చింతల్‌ వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నారు. నాగమణి 2006 నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో కుటుంబాలు చిట్టీలు వేసేవారు. నాగమణి ఆమె కుటుంబం అందరూ కలిసి 6 చిట్టీ గ్రూపులు నిర్వహించేవారు. 2022లో నాగమణి.. తన దగ్గర చిట్టీలు వేసే ఓ మహిళ నుంచి రూ.40.85 లక్షలు రుణం తీసుకుంది. బదులుగా కొన్ని చెక్కులు ఇచ్చింది. ఏడాది గడిచినా తీసుకున్న అప్పు.. చిట్టీ డబ్బు ఇవ్వలేదు. మరికొందరిదీ ఇదే పరిస్థితి. రెండు వారాల క్రితం బాధితులు వెళ్లి ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి నాగమునెయ్య, నాగమణి, రంగనాయకులు, గురుస్వామి పత్తాలేకుండా పోయారు. మొత్తం 35 మంది నుంచి రూ.4.15 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు తెలుసుకున్నారు. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒక్కొక్కరూ రూ.10 లక్షల కంటే ఎక్కువ మోసపోయినవారే అధికంగా ఉండడం గమనార్హం. పోలీసులు ఆ నలుగురి మీద కేసు నమోదు చేశారు.


బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2022లో జరిగిన ఈ నేరం జరిగింది. అమీర్‌పేటలోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బాలిక(3)ను ప్రతీరోజు ఇంటి నుంచి పాఠశాలకు, తిరిగి ఇంటికి వ్యాన్‌ డ్రైవర్‌ జి.రామకృష్ణ(44) చేరుస్తుండేవాడు. 2022 డిసెంబరు 7న పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చాక బాలికను పరిశీలించిన తల్లి ఆరా తీయగా విషయం వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన అప్పటి ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు డ్రైవర్‌ రామకృష్ణపై ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి టి.అనిత 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


తలాక్‌ అని మొయిల్‌ పంపిన భర్తపై ఫిర్యాదు.. కేసు

ఫిల్మ్‌నగర్‌: ప్రేమ పెళ్లి చేసుకుని తలాక్‌ ఇ-బయాన్‌ అంటూ మొయిల్‌ పంపించిన భర్తపై చట్టరీత్యా చర్యలుకోరుతూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలప్రకారం.. షేక్‌పేట మధురిహిల్స్‌కు చెందిన మహిళ, ఇమ్రాన్‌ ఖాదర్‌ ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీరికిఇద్దరు సంతానం. కోవిడ్‌ నుంచి భార్య, పిల్లలను ఆమె తల్లిదండ్రులవద్ద వదిలి వేరుగా ఉంటున్నాడు. అనేకమార్లు ఆమె ఫోన్‌చేసినా స్పందన కరవైంది. తాజాగా ఇమ్రాన్‌ తలాక్‌ ఇ-బయాన్‌ను మెయిల్‌ ద్వారా పంపాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.


సస్పెండైన విద్యుత్తు అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

అల్వాల్‌, న్యూస్‌టుడే: అల్వాల్‌లోని మచ్చబొల్లారం-హరేకృష్ణ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న విద్యుత్తు అధికారి అనిల్‌కుమార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ నాయకత్వంలోని బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అనిల్‌కుమార్‌ కీసర అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం ఫిబ్రవరిలో రూ.12వేల లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండయ్యారు. దర్యాప్తులో విస్తుగొలిపే ఆస్తుల చిట్టా బయటపడింది. ఇంట్లో రూ.12 లక్షల నగదు, అనిల్‌ జేబులో రూ.74వేల నగదు, 223 గ్రాముల బంగారం, కోటి ఆస్తులను గుర్తించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. అనంతరం అనిల్‌కుమార్‌ బోయిన్‌పల్లి నుంచి తన నివాసాన్ని హరేకృష్ణ కాలనీకి మార్చారు. బుధవారం సోదాలు చేసి కొన్ని స్థిరాస్తి దస్తావేజులు, వడ్డీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా భారీగానే ఉంటుందని ఆనంద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు