logo

ఇంజినీర్‌ను.. విజన్‌ ఉంది.. సాంకేతికతతో అభివృద్ధి చేస్తా

‘‘దేశంలోని లోక్‌సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైనది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా మరికొన్నిచోట్ల కనీస సౌకర్యాల్లేవ్‌. ఐటీ, రియల్‌ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని.

Published : 08 May 2024 03:58 IST

చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

‘‘దేశంలోని లోక్‌సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైనది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా మరికొన్నిచోట్ల కనీస సౌకర్యాల్లేవ్‌. ఐటీ, రియల్‌ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని. పేదరికం ఉంది.. సంపన్న వర్గాలూ ఉన్నాయి. ఔటర్‌ రింగు రోడ్డు ఉంది.. సరైన రోడ్లే లేని పల్లెలూ ఉన్నాయి. దీంతో అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరిగేలా చూడడమే నా కర్తవ్యం. నియోజకవర్గ అభివృద్ధికి నాకో విజన్‌ ఉంది.’’ అని చేవెళ్ల లోకసభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సమస్యలు, ప్రాధామ్యాలు, ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇక్కడ భాజపా విజయం సాధిస్తుంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన్ను నేరుగా పల్లెలకు తీసుకొస్తాను. ఇక్కడి సమస్యలు వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బీజాపూర్‌ జాతీయ రహదారికి రూ.930 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నాను. గతంలోనే కొన్ని గ్రామాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. వీటి మిగతా పల్లెలకు విస్తరిస్తాం. కేంద్రం సహకారంతో అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాను.

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ప్రధాన సమస్యలేంటి?
పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాలు నగరానికి చేరువగా ఉన్నా అభివృద్ధి ఫలాలు అందనంత దూరంగా ఉన్నాయి. ఎంఎంటీస్‌ రెండోదశ ఎల్లాపూర్‌ వరకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని నాగులపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటాను. పై మూడు నియోజకవర్గాల్లో సరైన రహదారులు లేవు, ప్రయాణ వనరు లేదు, కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం లేదు. ఇక్కడ ఎవరిని పలకరించినా సమస్యలు చెబుతుంటారు. ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులు లేక కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. తాండూరులోని షాబాద్‌ బండలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నగరానికి సరిపడా కూరగాయలను అందించే భూములున్నాయి. కానీ సాగునీరే కరవైంది.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడి ప్రాంతంతో నాది విడదీయరాని బంధం. ప్రతి గ్రామం తెలుసు. ప్రతి ఒక్కరితో పరిచయం ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ట్రస్టు ద్వారా అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇవన్నీ నా గెలుపునకు ఉపయోగపడతాయి. ప్రత్యర్థి విషయానికి వస్తే కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డితో పాటు భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌నూ సమానంగా చూస్తాను.

అభివృద్ధిని విస్తరించేందుకు ప్రణాళికలు ఏమున్నాయి?
దేశవిదేశాలకు చెందిన ఐటీ ఉద్యోగులు, సంపన్నులు ఇక్కడ ఉంటున్నారు. ఇవే అవకాశాలను పరిగి, తాండూరు, వికారాబాద్‌ నివాసితులు కూడా అందుకునేలా చర్యలు తీసుకుంటాను. నగరానికి చేరువగా ఉన్న అనంతగిరి, వికారాబాద్‌ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. అనంతగిరిలో కేంద్రం రూ.100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పలు ప్రాజెక్టులు చేపట్టింది. మూసీనది జన్మస్థలం ఇక్కడే. కోట్‌పల్లి రిజర్వాయర్‌ పరిసరాల్లో పర్యాటకం ఎంతో అభివృద్ధి చెందాల్సింది. ఐటీ, పర్యాటక, వ్యవసాయ రంగాల ప్రగతికి అవకాశం ఉన్న నియోజకవర్గంగా దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాను.


ముఖ్యాంశాలు

  • వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఆ రంగానికి ఊతమిస్తాం. తాండూరు కందిపప్పునకు ఎంతో ప్రసిద్ధి. ఇంటి పైకప్పుగా, లోపల వేసుకునేలా తక్కువ ధర చలువరాతి బండల ఉత్పత్తిని పరిశ్రమగా మార్చితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. వీటికి జియో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా.
  • మోదీని మించిన నాయకుడు లేరు. కేంద్రంలో మూడోసారి భాజపా అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో చేవెళ్ల సహా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది.
  • నేను స్వతహాగా ఇంజినీర్‌ను. సాంకేతిక అంశాలపై పట్టుంది. ఆ సాధికారతతో నియోజకవర్గఅభివృద్ధికి కృషి చేస్తాను.  
  • ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా, చేరువలో ఉన్న ఐటీ రంగ ఫలాలు అందుకునేలా యువతను తీర్చిదిద్దడం నా బాధ్యత. ఇప్పటికే మా ట్రస్టు ద్వారా 210 గ్రామాల్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు