logo

పరిశోధన శిక్షణ... విజ్ఞాన సముపార్జన

దేశ భవిష్యత్తు ఆశా దీపాలు నేటి విద్యార్థులు.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయుల మేధకు పదును పెట్టేదే ఐఐఆర్‌ఎస్‌. అంటే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌. ఏటా వేసవి సెలవుల్లో ఇస్రో ఆధ్వర్యంలో ఐఐఆర్‌ఎస్‌

Published : 20 May 2022 03:36 IST

 ఐఐఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బోధన
 ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

న్యూస్‌టుడే, యోవేవి(కడప) దేశ భవిష్యత్తు ఆశా దీపాలు నేటి విద్యార్థులు.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయుల మేధకు పదును పెట్టేదే ఐఐఆర్‌ఎస్‌. అంటే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌. ఏటా వేసవి సెలవుల్లో ఇస్రో ఆధ్వర్యంలో ఐఐఆర్‌ఎస్‌ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తోంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. శిక్షణ పొందినవారు విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు. ఇస్రో అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పరిశోధన, విజ్ఞానంపై పట్టు పెరుగుతుంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 20వ తేదీతో గడువు ముగియనుంది. 
* రిమోట్‌ సెన్సింగ్‌ అంటే ఒక వస్తువును తాకకుండా దూరం నుంచి గమనించి దాని గురించి చెప్పగలిగే విధానం. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాల ద్వారా ఈ రిమోట్‌ సెన్సింగ్‌ జరుగుతుంది. ఇటీవల డ్రోన్‌లు వాడటం కూడా మొదలైంది. అంతరిక్ష శాస్త్రంలో ఈ విధానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు భూమినే కాకుండా సౌర కుటుంబంలోని కొన్ని ఇతర గ్రహాలనూ మనం ఉపగ్రహాల సాయంతో చూస్తున్నాం. ఈ సాంకేతికత ఎన్నో రంగాలను ప్రభావితం చేస్తోంది. ఒక ప్రదేశానికి భౌతికంగా వెళ్లకుండానే అక్కడ ఏమి ఉందో తెలుసుకోగలుగుతున్నాం. అంతరిక్ష పరిశోధనకు మూలం ఇదే. భూగోళ, భూగర్భ, జల విజ్ఞాన, వ్యవసాయ, జీవావరణ, వాతావరణ తదితర శాస్త్ర రంగాల్లో రిమోట్‌ సెన్సింగ్‌ ప్రాధాన్యం చాలా ఉంది. ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి పంపే భూ ఛాయాచిత్రాలను విశ్లేషించడం ద్వారా భూగర్భంలోని ఖనిజ నిక్షేపాల గురించి తెలుసుకోవచ్చు. వాతావరణం గురించి, అగ్నిపర్వతాల ఆచూకీ, నీటి జాడలు, అడవులు, వ్యవసాయ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. 
* ఒక ప్రాంతంలో నేలలు, అటవీ ప్రాంతం, సహజ వనరులు, ఖనిజాలు తదితరాల్లో వచ్చిన భౌగోళిక మార్పులు తెలుసుకునేందుకు ఉపగ్రహ ఛాయాచిత్రాలు దోహదపడుతాయి. అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి శీతోష్ణస్థితులు ఎలా మారతాయో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారానే విశ్లేషిస్తారు. ఈ అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఉపాధ్యాయులు ఉపగ్రహ పాఠాలు సమగ్రంగా బోధించవచ్చు. 2007లో ఈ విధానాన్ని ప్రారంభించారు. 312 మందితో శిక్షణ ప్రారంభం కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4.8 లక్షల మంది శిక్షణ తీసుకుని ధ్రువపత్రాలు పొందారు. 
దరఖాస్తు చేసుకోవడం ఇలా.. : ఆసక్తిగల ఉపాధ్యాయులు www.iirs.gov.in అనే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి మొబైల్, జీమెయిల్, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సుమారు 70 శాతం హాజరుండి, ప్రతిభచాటిన ఉపాధ్యాయులకు ఇస్రో అధికారులు మెయిల్‌ ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. 
శిక్షణ : అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌(12వ తరగతి) వరకు భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తారు. 

సద్వినియోగం చేసుకోవాలి
శాస్త్రీయ అంశాలపై ఉపాధ్యాయులు మరింత పట్టు సాధించేందుకు ఇస్రో శిక్షణ దోహదపడుతుంది. సైన్స్‌ గురించిన అంశాలు విద్యార్థులకు బోధించేందుకు మరింత సులువవుతుంది. ఆధునిక సాంకేతికతను ఎలా అందిపుచ్చుకోవాలో అవగాహన పెరుగుతుంది. అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి. - మహేశ్వరరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని