logo

పూడిక తొలగేనా..?

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వరదకాలువలు ఉండగా ఏటా వర్షాకాలం రాకముందే పూడికతీత పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పూడిక, చెత్తాచెదారం తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.

Updated : 23 May 2024 06:00 IST

మురుగు కాలువల్లో చెత్తాచెదారం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

మంకమ్మతోట రెండో ఠాణా పక్కనుంచి ప్రవహించే వరద కాల్వ 

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వరదకాలువలు ఉండగా ఏటా వర్షాకాలం రాకముందే పూడికతీత పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పూడిక, చెత్తాచెదారం తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవగా ఆ పనులను గుత్తేదారులకు అప్పగించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా పనులు పూర్తి చేసి వర్షం నీరు సాఫీగా ప్రవహించేలా పూడికను తొలగించాలని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో వరద కాల్వలు శుభ్రం చేయకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పూడికను తొలగించేలా టెండర్‌లలో పొందుపర్చారు.

అధ్వానంగా అంతర్గత కాలువలు

ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న మురుగునీటి కాల్వలతో పాటు అంతర్గత వీధుల్లోని డ్రైనేజీలలో మట్టి పేరుకుపోయింది. కొన్నిచోట్ల మూసుకుపోగా, మరికొన్ని చోట్ల చెత్తాచెదారం నిండి ఉంది. ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. డ్రైనేజీలలో చెత్తను తొలగించడం లేదు. మురుగునీరు అలాగే నిలిచి ఉంటుంది. గతంలో ఎప్పటికప్పుడు పనులు చేసే వారు. కొన్ని నెలలుగా కార్మికులు, ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు పట్టనట్లుగా ఉంటున్నారు.

శుభ్రం చేస్తేనే..

నూతన రహదారులు నిర్మించిన చోట బహిరంగ కాల్వలే కనిపించడం లేదు. పైపులైనుతో డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ప్రతీ వంద మీటర్లకు ఒక ఛాంబర్‌ ఇస్తుండగా దాని పక్కనే పైపులతో రంధ్రాలు వదిలేశారు. వర్షం నీరంతా ఇందులోంచే వెళ్లాల్సి ఉండగా అవి మూసుకుపోయాయి. డివిజన్ల వారీగా వీటన్నింటినీ పరిశీలించి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయిస్తే నీరంతా డ్రైనేజీల్లోకి వెళ్లే అవకాశముంది.

15 రోజుల్లో పూర్తికి చర్యలు..

వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ముందస్తుగా నాలాలు, డ్రైనేజీలు శుభ్రం చేసే పనులు వెంటనే ప్రారంభించనున్నాం. వరద కాల్వలు గుత్తేదారులతో, మురుగునీటి కాల్వలు కార్మికులతో శుభ్రం చేయిస్తాం. 15 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలకు ఆదేశించాం.

 బి.శ్రీనివాస్, కమిషనర్, కరీంనగర్‌ నగరపాలిక

పూడికతీత పనులు ఇక్కడే..

  • గౌతమినగర్, అమీర్‌నగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, భగత్‌నగర్‌ వైపు ఉన్న వరదకాల్వ
  • మల్కాపూర్‌ రోడ్డు చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ నుంచి కొత్త లేబర్‌ అడ్డా జ్యోతినగర్‌
  • రాంనగర్‌ పారమిత, సిద్ధార్థ స్కూల్స్‌ నుంచి చేపల మార్కెట్‌
  • వాణినికేతన్‌ స్కూల్‌ వెనుక నుంచి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆర్‌ఆండ్‌బీ రోడ్డు కల్వర్టు
  • రాంనగర్‌ చౌరస్తా నుంచి మార్క్‌ఫెడ్‌ వరకు ఉన్న ఆర్‌ఆండ్‌బీ డ్రైనేజీ
  • రైల్వేట్రాక్‌(ఈ19) నుంచి తీగలగుట్టపల్లి ప్రధాన రహదారి రైల్వే గేట్‌
  • ముకరంపుర పరివార్‌ బేకరీ నుంచి సాయికృష్ణ థియేటర్‌ వరకు, ఇక్కడి నుంచి కలెక్టరేట్, కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ స్టేడియం
  • శనివారం అంగడి బజారు నుంచి వరాహస్వామి గుడి వరకు గల వరదకాల్వ
  • ప్రభుత్వాసుపత్రి ఎదురుగా నుంచి శర్మనగర్‌ మీదుగా శనివారం అంగడి బజారు
  • సాయిబాబా టెంపుల్‌ నుంచి గౌరిశెట్టి కాంప్లెక్స్‌
  • డీ94 కాలువ నుంచి జగిత్యాల రోడ్డు.. అక్కడి నుంచి రేకుర్తి వరకు. డీ94 కాలువ నుంచి గౌడ్స్‌ కాలనీ
  • దోబీఘాట్‌ జంక్షన్‌ నుంచి హోటల్‌ శ్వేత, తారక వరకు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు