logo

డివిజన్‌ కేంద్రం.. సేవలు జాప్యం

మంథని డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదు.

Published : 23 May 2024 03:25 IST

మంథని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు

న్యూస్‌టుడే, మంథని: మంథని డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. ఎంపీడీవో, ఆర్డీవో, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, పురపాలక సంఘం, ఆసుపత్రులు, ఎస్‌టీవో కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. కొన్ని కార్యాలయాల ఉద్యోగులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో పని చేస్తుండటంతో స్థానికంగా సేవల్లో జాప్యం జరుగుతోంది.

ఆర్డీవో కార్యాలయం

  •  ఖాళీలు: రెండు డిప్యూటీ తహసీల్దారు, రెండు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.
  • ప్రభావం: దస్త్రాలు త్వరగా కదలక భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం.

మున్సిపాలిటీ

  •  మేనేజర్, పట్టణ ప్రణాళిక అధికారి(టీపీవో), ఏఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.
  • ఇళ్ల నిర్మాణాలకు అనుమతిలో జాప్యం జరుగుతోంది. మంచిర్యాలకు చెందిన ఇన్‌ఛార్జి అధికారి వారానికి ఒక రోజు కూడా మంథనికి రాకపోవడంతో కొన్ని ఇళ్లను పరిశీలించకుండానే అనుమతి ఇస్తున్నారని, అన్నీ సక్రమంగా ఉన్నా కొన్నింటికి అనుమతి రావడం లేదన్న ఆరోపణలున్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లేక పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. మేనేజర్, సిబ్బంది అందుబాటులో లేక కార్యాలయంలో దస్త్రాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

మండల పరిషత్తు

  • ఎంపీడీవో, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.
  • ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లు తదితర పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎంపీడీవో అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కమాన్‌పూర్‌ ఎంపీడీవో మంథని బాధ్యతలు అదనంగా నిర్వర్తిస్తుండగా వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మిగతా రోజుల్లో ఎంపీడీవో వద్దకు దస్త్రాలు తీసుకెళ్దామంటే కార్యాలయంలో సిబ్బంది కొరత నెలకొంది.

పంచాయతీరాజ్‌ సబ్‌డివిజన్‌

  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, మూడు ఏఈ పోస్టులు.  (మంథని, ముత్తారం, రామగిరి, ముత్తారం మండలాలకు నలుగురు ఏఈలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు.)
  • ఒకే ఏఈ ఉండటం, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో నిర్మాణం పనుల్లో జాప్యం.

కోశాగార శాఖ

  • ఏటీవో, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.
  •  పంచాయతీలు, గుత్తేదారులు, ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు పాస్‌ కావడం లేదు.
  • ఆర్‌ అండ్‌ బీ శాఖ సబ్‌ డివిజన్‌ సీనియర్‌ అసిస్టెంట్, రెండు ఏఈ పోస్టులు.
  • ఒకే ఏఈ ఉండటంతో కళాశాల భవనాలు, వంతెనలు, రహదారి నిర్మాణం పనులు ఆలస్యం.

వ్యవసాయ శాఖ

  •  మండల వ్యవసాయాధికారి పోస్టు. రామగిరి అధికారికి అదనపు బాధ్యతలు.
  •  సీజన్‌లో సేవలందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు తెగుళ్లు వచ్చినపుడు నివారణపై రైతులకు అవగాహన కల్పించడం లేదు.

గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం

  •  జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.
  •  గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తినపుడు అటు మిషన్‌ భగీరథ అధికారులు లేక, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విద్యా శాఖ

  •  మండల విద్యాధికారి పోస్టు.
  •  గుంజపడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి మంథని, ముత్తారం మండలాలకు ఇన్‌ఛార్జి అధికారిగా బాధ్యతలు. పాఠశాలలపై పర్యవేక్షణ లోపంతో పాటు సకాలంలో పనులు జరగడం లేదు.

ఐసీడీఎస్‌ కార్యాలయం

  •  సీడీపీవో, గ్రేడ్‌-2 సుపర్‌వైజర్, టైపిస్టు, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులు.
  •  గోదావరిఖని సీడీపీవో మంథని బాధ్యతలు చూస్తుండగా వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారు. కార్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులపై పర్యవేక్షణ కరవైంది.

మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం

  •  గైనకాలజిస్టు, మత్తు వైద్య నిపుణుడు, నాలుగు స్టాఫ్‌ నర్సు, రెండు ల్యాబ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, మూడు థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, మూడు డాటా ఎంట్రీ ఆపరేటర్, నాలుగు ఒప్పంద ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  •  గైనకాలజిస్టులు లేక గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్‌ సమయంలో థియేటర్‌ అసిస్టెంట్లు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు.

సామాజిక వైద్యశాల

  • నలుగురు వైద్యులు, 12 స్టాఫ్‌ నర్సులు, ఒక ఎంఎన్‌వో పోస్టులు.
  • వైద్యుల కొరతతో రోగుల ఇబ్బందులు. వైద్యులు మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉండటంతో సాయంత్రం, రాత్రి వేళల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదు.

నీటి పారుదల శాఖ సబ్‌ డివిజన్‌

  •  రెండు ఏఈ, అటెండర్, వాచ్‌మెన్‌ పోస్టులు.
  •  చెరువులపై పర్యవేక్షణ కొరవడింది. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదల సమయంలో పర్యవేక్షణ సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు అందని పరిస్థితి.

త్వరలోనే భర్తీకి చర్యలు

మంథని నియోజకవర్గ పరిధిలో అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశించాం. ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులతో పాటు త్వరలో జరిగే ఉద్యోగ నియామకాల్లో నియాజకవర్గానికి ప్రాధాన్యమిస్తాం.

డి.శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఐటీ,  పరిశ్రమల శాఖల మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు