logo

అనిశాదాడులు.. అధికారుల గుబులు

పట్టణ స్థానిక సంస్థల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై అనిశా అధికారులు దాడులు చేస్తుండడంతో అవినీతి అధికారుల గుండెల్లో అలజడి మొదలైంది. కొన్నేళ్లుగా రామగుండం నగరపాలికలోను పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో

Published : 19 Jan 2022 02:22 IST

రామగుండంలో అక్రమాల జాతర
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


రామగుండం నగరపాలక కార్యాలయం

ట్టణ స్థానిక సంస్థల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై అనిశా అధికారులు దాడులు చేస్తుండడంతో అవినీతి అధికారుల గుండెల్లో అలజడి మొదలైంది. కొన్నేళ్లుగా రామగుండం నగరపాలికలోను పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నా పాలకవర్గం, ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల రామగుండం నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో అనిశా అధికారులకు చిక్కగా.. తాజాగా కరీంనగర్‌ నగరపాలక ఈఈ రామన్‌ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. సుదీర్ఘకాలం రామగుండం నగరపాలికలో ఏఈగా పనిచేసిన రామన్‌ పదోన్నతితో ఇతర నగరాలకు బదిలీ అయి ఈఈగా కరీంనగర్‌లో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రామగుండం నగరపాలక ఈఈ సైతం ఇదే తరహాలో ఏసీబీకి చిక్కారు.  అందరూ గుత్తేదారులకు బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకుంటూనే అవినీతి నిరోధక శాఖకు చిక్కడం గమనార్హం.

నగరపాలికపై ఏసీబీ నజర్‌
రామగుండం నగరపాలికలో పలువురు అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు భావిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు నగరపాలికలోని అక్రమాలపై ఏసీబీ, విజిలెన్సు అధికారులు సంబంధిత దస్త్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన సంఘటనలున్నాయి.
కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు పదోన్నతులు పొందకుండానే ఉద్యోగ విరమణ పొందినప్పటికీ విచారణ పూర్తికాకపోగా వారికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేశారు.
రామగుండం నగరపాలికలో బి.పి.ఎల్‌. కొళాయి కనెక్షన్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన విజిలెన్సు అధికారులు వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ వారి నుంచి డబ్బులు రికవరీ చేశారు.
గౌతమినగర్‌లోని చెత్త నిర్వహణ కేంద్రంలో రోడ్డు వేయకుండానే వేసినట్లుగా రూ.10 లక్షలు చెల్లించిన ఘనత రామగుండం నగరపాలికకు ఉండగా విజిలెన్సు విచారణతో సంబంధిత గుత్తేదారు నుంచి నిధులు రాబట్టారు. బిల్లు రాసిన గుత్తేదారుతో పాటు డబ్బులు చెల్లించడంలో కీలకమైన కమిషనర్‌, ఎక్జామినర్‌పై చర్యలు చేపట్టారు.
తాజాగా రామగుండం నగరపాలికలో పనిచేయని మూడు ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మంగళవారం కరీంనగర్‌లో అనిశా అధికారులకు చిక్కిన రామన్‌ రామగుండంలో పనిచేస్తున్న కాలంలో మీటరు మందంతో డి.ఎఫ్‌.ఐ.డి. నిధులతో రోడ్డు వేయడం, నీటి సరఫరా విడిభాగాల కొనుగోలులో అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కోవడంతో విజిలెన్సు అధికారులు విచారణ చేపట్టారు.
తాజాగా రాజేశ్‌ థియేటర్‌ నుంచి ఇందిరానగర్‌ వరకు డివైడర్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టు కేటాయింపులు, అంచనాల తయారీపై విజిలెన్సు అధికారులు విచారణ చేపడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం చేపట్టిన అభివృద్ధి పనులను తాజాగా చేపట్టినట్లు బిల్లులు చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
పారిశుద్ధ్య విభాగంలో విడిభాగాల కొనుగోలు మొదలుకొని, డీజిల్‌, వాహనాల నిర్వహణ వరకు తీవ్రస్థాయిలో అక్రమాలు నెలకొంటున్నాయి.
మురుగు కాల్వల్లో పూడికతీత పేరిట ఏటా రూ.50 లక్షలకు పైగా అక్రమాలు నెలకొంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఆరోపణల్లో బాధ్యులైన కొందరు అధికారులు దీర్ఘకాలిక సెలవుల్లోనే గడుపుతుండగా ఉన్నవారు సైతం మరింత అక్రమాలకు కారకులవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులే గుత్తేదారులుగా..
రామగుండం నగరపాలికలో కొందరు ఇంజినీరింగు అధికారులే బినామీ గుత్తేదార్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు అనుగుణంగా ఉండే ఒకరిద్దరు గుత్తేదార్లను ఎంచుకొని వారికి లాభసాటిగా ఉండేలా అంచనాలు రూపొందించి నామినేషన్‌ విధానంలో పనులు కట్టబెడుతున్నారు. నగరపాలికకు అవసరమైన కొంత కొనుగోలులోను ఇంజినీరింగు అధికారి బినామీ గుత్తేదారుగా వ్యవహరించారు. తాజాగా రామగుండం నగరపాలికలో అవినీతి, అక్రమాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో పనిచేసిన ఓ కమిషనర్‌ రిజక్టు చేసిన బిల్లులను ఇప్పుడు చెల్లించేందుకు దస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొందరు గుత్తేదార్లే తమకు అనుగుణంగా అంచనాలు సిద్ధం చేసుకోవడం, ఎం.బి. రికార్డులు రాసుకోవడం దాకా వెళ్లడం రామగుండంలో పరిస్థితి అద్దం పడుతోంది. నగరపాలికలో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ స్వయంగా ప్రజాప్రతినిధులే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని