logo

ఎన్నికల సమరం.. నిఘా నిరంతరం

జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశాయి.

Published : 27 Mar 2024 03:07 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కసరత్తు చేస్తోంది. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల పోలీసు సబ్‌ డివిజన్ల పరిధిలో సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా కట్టుదిట్టం చేస్తోంది. ఇక్కడ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో తొలి దఫా కవాతును నిర్వహించాయి.

 కానుకల పంపిణీపై దృష్టి

 లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వెలువడనుంది. మే 13న పోలింగ్‌ ఉంటుంది. జిల్లాలో ఈ మధ్య కాలంలో రాజకీయ వేడి పెరగనుంది. దీనిలో భాగంగా ఓటర్లను ప్రలోభాల పర్వంలో భాగంగా ధనం, మద్యం ఏరులై పారుతుందని ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిని నియంత్రించేలా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నగదు, మద్యం, కానుకలు పంపిణీపై దృష్టి సారిస్తున్నాయి. ప్లయింగ్‌ స్క్వాడ్‌, సర్వైలెన్స్‌ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లాకు ఆరువైపులా వైపులా అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి నగదు మద్యం, కానుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వీటితో పాటు ఎస్‌ఎస్‌టీ, ప్లయింగ్‌ స్క్వాడ్‌, వీవీటీ బృందాలను ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత అదనంగా మరికొన్ని బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికీ వీటి పనితీరు నామమాత్రంగా జరుగుతుంది.

87 సమస్యాత్మక ప్రాంతాలు..  

జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో 87 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. వీటిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే అక్కడ జరిగిన ఓటింగ్‌ సరళి.. పోలింగ్‌ ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు పరిశీలన జరిపారు. అలాంటి వాటిని సమస్యాత్మక కేంద్రాల జాబితా నుంచి తొలగించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు, గ్రామస్థుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరికొన్నిచోట్ల సీసీ కెమెరాలు అమర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. వీటన్నింటిని దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ను అనుసంధానం చేయడం, అక్కడే కంట్రోల్‌ గదిని ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ రోజు ఇక్కడ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను ఏర్పాటు చేయనున్నారు. రెండు పోలీసు సబ్‌ డివిజన్లలోని ఠాణాల పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితులకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌లు కలిగిన వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.


తనిఖీలు జరుగుతున్న తీరు..

  •  పట్టుబడిన నగదు : రూ.2.63 లక్షలు
  •  స్వాధీనం చేసుకున్న మద్యం విలువ : రూ.4.86 లక్షలు
  •  నమోదైన కేసులు : 59
  •  బైండోవర్‌ కేసులు : 71
  •  బైండోవర్‌ చూపిన వ్యక్తులు : 151
  •  రౌడీషీటర్లు : 135
  • శాసనసభ ఎన్నికల్లో ఇలా..
  •  ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు : 43
  •  పట్టుబడిన నగదు: రూ.93.82 లక్షలు
  •   పట్టుబడిన గంజాయి : 32.26 కిలోలు (విలువ: రూ.7.96 లక్షలు, కేసులు: 16)
  •  పట్టుబడిన మద్యం: 1,374 లీటర్లు (విలువ: రూ.7.72 లక్షలు)
  •  బైండోవర్‌ కేసులు: 672
  •  పట్టుబడిన వస్తువుల విలువ: రూ.1.53 లక్షలు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని