logo

హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

ఈనెల 17న మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో జరిగిన వివాహిత కరిపె అంజలి(22)ని హత్య చేసిన సంఘటనలో  నిందితుడు కొల్లూరి నరేష్‌ను మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 27 Mar 2024 05:56 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవి

మల్యాల, న్యూస్‌టుడే: ఈనెల 17న మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో జరిగిన వివాహిత కరిపె అంజలి(22)ని హత్య చేసిన సంఘటనలో  నిందితుడు కొల్లూరి నరేష్‌ను మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఆయా వివరాలను మల్యాల సీఐ నీలం రవి వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. .గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన కొల్లూరి నరేష్‌ జగిత్యాలకు చెందిన కరిపె అంజలిని ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు కలగకపోవడంతో మనస్పర్థలు ఏర్పడి పంచాయతీ పెద్దల సమక్షంలో 2022లో విడాకులు తీసుకున్నారు. తర్వాత అంజలికి యాదాద్రి జిల్లా మాసంపల్లికి చెందిన యువకుడితో రెండో వివాహం జరిగింది. కాగా నరేష్‌ తన మాజీ భార్య అంజలిని మరచిపోలేక తరచూ ఫోన్‌ చేసేవాడు. తనను కాదని రెండో పెళ్లి చేసుకున్న అంజలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. జగిత్యాలలోని నానమ్మ ఇంటికి అంజలి వచ్చినట్లు తెలుసుకుని ఆదివారం ఆమెకు ఫోన్‌లో మాయమాటలు చెప్పి తన వద్దకు పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై జగిత్యాల నుంచి జాబితాపూర్‌ మీదుగా మ్యాడంపల్లి శివారుకు చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో అంజలిని కొట్టి గొంతునులిమి హత్యచేసి పక్కనేగల పిల్లకాలువలోని చెట్లపొదల్లో పడేశాడు. ఈనెల 18న మ్యాడంపల్లి శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి అంజలి తల్లికి సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి గుర్తించింది. నరేశ్‌ ఫోన్‌కాల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్సైలు అబ్దుల్‌రహీం, కుమారస్వామి పాల్గొన్నారు.


రౌడీషీటర్‌ సహా ఇద్దరికి రిమాండ్‌

ఈనాడు, కరీంనగర్‌: తప్పుడు పత్రాలు సృష్టించి అసలైన భూమి యజమానిని లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేసిన ఓ రౌడీషీటర్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌ తెలిపిన వివరాల మేరకు.. చొప్పదండి మండలం వెదురుగట్టుకు చెందిన పంబాల శ్రీనివాస్‌ అనే వ్యక్తి తీగలగుట్టపల్లిలో 200 గజాల ప్లాటు కొనుగోలు చేశార[ు. 2022లో నగరపాలక సంస్థ నుంచి అనుమతి పొంది ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇదే క్రమంలో తిరుపతి విష్ణువర్ధన్‌, మంద నగేశ్‌, కొమ్ము భూమయ్య వచ్చారు. ఈ భూమి మంద నగేశ్‌దని.. బద్రుద్దీన్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు తప్పుడు సాదాబైనామా పత్రాలు చూపించారు. భూమి ఇవ్వాలని లేదంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు శ్రీనివాస్‌ గత్యంతరం లేక వారికి విడతల వారీగా ఫోన్‌ పే ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించారు. మిగతా రూ.15 లక్షల కోసం ఒత్తిడి చేస్తుండటంతో బాధితుడు సాదాభైనామా పత్రాల గురించి వాకబు చేయగా అవి నకిలీవని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన వారు నలుగురిపై కేసు నమోదు చేశారు. తిరుపతి విష్ణువర్ధన్‌ అనే వ్యక్తిపై గతంలోనే 9 కేసులున్నాయి. ఇతనిపై రౌడీషీట్‌ కూడా ఉంది. దీంతో పోలీసులు ఇతనితోపాటు మంద నగేశ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కొమ్ము భూమయ్యతోపాటు తిరుపతి విష్ణువర్ధన్‌ కుమారుడు తిరుపతి నితిన్‌వర్ధన్‌పైన కేసులు నమోదు చేశారు.


భూ దందాల్లో ప్రజానిధుల భర్తల అరెస్ట్‌

తహసీల్దార్‌తోపాటు పలువురిపై కేసులు నమోదు

 కరీంనగర్‌, ఈనాడు : కరీంనగర్‌ భూ దందాల్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల భర్తలు జైలుబాట పట్టగా, ఇక్కడ పని చేసిన ఓ తహసీల్దార్‌తోపాటు పలువురిపై కేసు నమోదైంది. కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యురాలి భర్త పిట్టల రవీందర్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఏడో డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త ఆకుల ప్రకాశ్‌లను వేర్వేరు కేసుల్లో కరీంనగర్‌ గ్రామీణ పోలీసులు మంగళవారం రిమాండ్‌ చేసి జైలుకు పంపించారు. ఇప్పటి వరకు వివిధ భూ దందా కేసుల్లో ఇద్దరు కరీంనగర్‌ కార్పొరేటర్లు, ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు, ఓ మాజీ ఎంపీటీసీ, ముగ్గురు భారాస నేతలు అరెస్టవగా తాజాగా వీరిద్దరు జైలుకు వెళ్లారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌ కథనం మేరకు.. పిట్టల రవీందర్‌ కొత్తపల్లి మండలం చింతకుంట సర్పంచిగా ఉన్న సమయంలో 20 గుంటల భూమిని అక్రమంగా తన పేరిట మార్చుకున్నందుకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న పామ్‌ రాజ్‌ దేవి దాస్‌ అనే వ్యక్తి తండ్రి పేరిట చింతకుంట సమీపంలోని సర్వే నంబరు 106లో 5.08 ఎకరాల భూమి ఉండేది. ఇందులో కొంత విక్రయించిన తరువాత 20 గుంటల భూమి మిగిలింది. ఈ జాగాపై కన్నేసిన రవీందర్‌ ఆ భూమిని కాజేయాలని పాత పహాణీలో ఉద్దేశపూర్వకంగా వీరయ్య అనే పేరుని చేర్చారు. ఇందుకు అప్పటి కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి సహకరించారు. తరువాత ఆ భూమిని వీరయ్య తండ్రి పేరు కలిగిన రాజయ్య అనే వ్యక్తికి విరాసత్‌ చేసినట్లు ధ్రువపత్రాల్ని సృష్టించారు. 2009లో ఇదే భూమిని ఆదిరెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. తరువాత ఆదిరెడ్డి నుంచి పిట్టల రవీందర్‌ ఈ 20 గుంటల భూమిని 2010లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పామ్‌ రాజ్‌దేవిదాస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు పిట్టల రవీందర్‌తోపాటు సహకరించిన అప్పటి కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, నాల్యమడుగు రాజయ్య, గడ్డం ఆదిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉండగా రవీందర్‌ను అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఇటీవల రవీందర్‌ జడ్పీటీసీ అయిన తన భార్యతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇది వరకు ఓ భూదందా కేసులో కొత్తపల్లి తహసీల్దార్‌గా పని చేసిన ఒకరు అరెస్టై జైలుకెళ్లగా ఇప్పుడు కరీంనగర్‌ మండలంలో పని చేసిన తహసీల్దార్‌పై కేసు నమోదవడం చర్చనీయాంశమైంది.

కార్పొరేటర్‌ భర్త

కరీంనగర్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ భర్త ఆకుల ప్రకాశ్‌ను మంగళవారం రాత్రి కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే భూమిని పలువురికి విక్రయించి బెదిరింపులకు పాల్పడ్డారని ఈయనతోపాటు మరో నలుగురిపై కేసును నమోదు చేశారు. సీఐ ప్రదీప్‌ కథనం మేరకు.. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన సంపత్‌ అనే వ్యక్తి 1998లో వల్లంపహాడ్‌ వద్ద నర్సింహారావు అనే వ్యక్తి దగ్గర ఓ ప్లాటును ఖరీదు చేశాడు. నర్సింహారావు 33 గుంటల భూమిని ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయిస్తున్నారు. ఇదే 33 గుంటల భూమిని తరువాత గంపగుత్తగా కరీంనగర్‌కు చెందిన అబ్దుల్‌ హఫీజ్‌కు విక్రయించారు. దీంతో హఫీజ్‌ తనకు రిజిస్ట్రేషన్‌ అయిన భూమిలో నుంచి 10 గుంటలను హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త ఆకుల ప్రకాశ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారు. ఇదే సమయంలో ఇందులో మరో 3 గుంటల భూమిని ఉద్దేశపూర్వకంగా కరీంనగర్‌ కట్ట రాంపూర్‌కు చెందిన ఉప్పు సురేశ్‌, వావిలాల పల్లికి చెందిన కట్ట రమ్యలు కొనుగోలు చేసి.. మొదట ప్లాట్‌లు కొన్నవారిని ఈ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. బాధితుడు సంపత్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నర్సింహారావు, ఆకుల ప్రకాశ్‌, మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌, ఉప్పు సురేశ్‌, కట్ట రమ్యలపై కేసు నమోదు చేశారు. ఆకుల ప్రకాశ్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేయగా.. ప్రస్తుతం ఆయన భార్య కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈయనను రిమాండ్‌ చేయగా మిగతా వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని