logo

పురలో మారిన ముఖచిత్రం

గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్‌గా మారాయి.

Published : 06 May 2024 06:15 IST

పార్టీలు మారుతున్న కౌన్సిలర్లు

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం: గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్‌గా మారాయి. 2020 జనవరి 28న తొలిసారి భారాస(తెరాస) పాలకవర్గం ఏర్పడింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో 48 వార్డులకు భారాస(తెరాస) 31 వార్డులు, ఆరుగురు స్వతంత్రులుగా విజయం సాధించగా కాంగ్రెస్‌కు 07, భాజపా 03, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందారు. అధ్యక్ష స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో 37వ వార్డు కౌన్సిలర్‌ శ్రావణికి అవకాశం వచ్చింది. రెండేళ్ల తరువాత ఎమ్మెల్యే సంజయ్‌, ఛైర్‌పర్సన్‌ శ్రావణి మధ్య రాజకీయపరంగా విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీకి, కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆ తరువాత రెండేళ్లపాటు ఛైర్‌పర్సన్‌ పదవి ఎవరికి కేటాయించకపోగా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ను కొనసాగించడం భారాస కౌన్సిలర్లలోనూ వ్యతిరేకత ఏర్పడింది.

  • స్వతంత్రులుగా గెలుపొందిన వొల్లెపు రేణుక, వానరాసి మల్లవ్వ, గుగ్గిళ్ల హరీశ్‌, చాంద్‌పాషా, భాజపా సభ్యుడు గుర్రం రాము భారాసలో చేరారు. తాజాగా ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా పలువురు భారాస కౌన్సిలర్లు అనూహ్యంగా పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో భారాస కౌన్సిలర్‌ తిరుగుబాటు 36వ వార్డు కౌన్సిలర్‌ అడువాల జ్యోతిని అధ్యక్ష పీఠం వరించింది. ఈ పరిణామంతో అధ్యక్షురాలు జ్యోతితోపాటు ఏకంగా 13 మంది భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఇందులో భారాసతోపాటు, భాజపా, స్వతంత్రులు సైతం ఉన్నారు.  

పుంజుకున్న కాంగ్రెస్‌

2020లో పురపగ్గాలు చేపట్టిన సందర్భంలో 31 స్థానాలు గెలిచిన భారాస ప్రస్తుతం 22 స్థానాలకు చేరి అధ్యక్ష పీఠం చేజార్చుకుంది. అప్పుడు ఏడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ సంఖ్య 23కు చేరడంతోపాటు అధ్యక్ష స్థానం దక్కించుకుంది. పుర ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్న కౌన్సిలర్ల సంఖ్యతో పలు పార్టీల్లో అంతర్మథనం మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని