logo

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన

కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్‌ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.

Updated : 06 May 2024 06:30 IST

ఫర్నిచర్‌ ధ్వంసం.. వైద్య సిబ్బందిపై దాడి

కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళనకారులు

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్‌ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్‌ రెహమాన్‌(44) ప్యాసింజర్‌ ఆటో నడిపిస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారులోని ఢీ-40 ఏరియాలో ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిబ్బంది పరిశీలించి చలనం లేదని తెలుపగా వైద్యులను పిలిపించి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, బంధువులు వారితో తెలిపారు. ఈ క్రమంలో కాలయాపన జరగడంతో వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే మృతి చెందాడని బంధువులు, ఇతరులు ఆసుపత్రి ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యుడు శ్రవణ్‌, సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించగా వారు గదిలోకి వెళ్లి తలదాచుకున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్‌ పోలీస్‌ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గదిలో ఉన్న వైద్యసిబ్బందిపై కిటికిలోంచి ఆందోళనకారులు డీజిల్‌పోసి నిప్పుపెట్టే యత్నం చేశారు. దీంతో వైద్యుడు శ్రవణ్‌, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడున్న పోలీసులు వైద్యుడు శ్రవణ్‌ను ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తరలించే యత్నం చేయగా వెంబడించి దాడికి పాల్పడగా గాయాలయ్యాయి. సుమారు 3 గంటలపాటు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. బాధితులతో మాట్లాడి గొడవ సద్దుమనిగేలా చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆందోళనకారులపై వైద్య బృందం ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని