logo

భాజపాకు బుద్ధి చెప్పాలి

శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Published : 06 May 2024 06:22 IST

మెట్‌పల్లిలో మాట్లాడుతున్న విప్‌ శ్రీనివాస్‌, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. మెట్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్రంలో భారాస చేసిన అవినీతి, కుంభకోణాలతో ప్రజలు పక్కన పెట్టి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, దేశంలో నల్ల చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ఉన్నత వర్గాలకు పెద్దపీట వేస్తున్న భాజపాను కూడా ఓడించాలన్నారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం పునరుద్ధరణ అంశం మ్యానిఫెస్టోలో పెట్టించింది జీవన్‌రెడ్డి అని, గల్ఫ్‌ బోర్డు అంశం కూడా ఆయన ఆలోచనే అన్నారు. భారాస కారు గ్యారేజ్‌కు పోయిందని, రోడ్డు ఎక్కడం కష్టం కావడంతో పదేళ్లు ప్రగతిభవన్‌కు పరిమితమైన కేసీఆర్‌ బస్సు యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ రైతుల పక్షపాతి అని, ప్రతిసారి రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్‌ అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్‌ నుంచి రూ.500 బోనస్‌ ఇస్తుందని చెప్పారు. నర్సింగరావు, కొమిరెడ్డి కరంచంద్‌, విజయ్‌ఆజాద్‌, జెట్టి లింగం, లింగారెడ్డి, వెంకట్‌, పురుషోత్తం, రాజరెడ్డి, దేవేందర్‌, వేణు, అశోక్‌, పలువురు మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు.  

చక్కెర పరిశ్రమలను తెరిపిస్తాం

మల్లాపూర్‌: నష్టాల నేపంతో మూసివేసిన రాష్ట్రంలోని ముత్యంపేట, బోధన్‌, ముంబోజిపల్లి ఎన్‌డీఎస్‌ఎల్‌ చక్కెర పరిశ్రమలను తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే బ్యాంకులకు రూ.43 కోట్లు విడుదల చేసిందని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ మొహం పెట్టుకుని ఆర్వింద్‌ తనను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు..? అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆర్వింద్‌ సిద్ధమా..? అంటూ సవాలు విసిరారు. నర్సింగరావు, సుజీత్‌రావు, చిన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, ఆనంద్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన భారాస కౌన్సిలర్లు

కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లతో జీవన్‌ రెడ్డి

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాలకు చెందిన ఏడుగురు భారాస కౌన్సిలర్లు ఆదివారం నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 6, 7, 10. 17, 21, 33, 38 వార్డు కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత, పల్లెపు రేణుక, సిరికొండ భారతి, సిరికొండ పద్మ, అల్లె గంగాసాగర్‌, బండారి రజిని, దాసరి లావణ్య కాంగ్రెస్‌లో చేరగా జీవన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధరూర్‌ క్యాంప్‌ రామాలయం మాజీ ఛైర్మన్‌ బ్రహ్మాండభేరి నరేశ్‌, డైరెక్టర్‌ ఒంటిపులి రాము, అక్బర్‌, దరూర్‌ క్యాంప్‌నకు చెందిన పలువురు, భారాస అర్బన్‌ యూత్‌ అధ్యక్షుడు మతలాపురం శేఖర్‌, కార్యదర్శి పుల్లా రంజిత్‌, ఎస్సీ సెల్‌ యూత్‌ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఆదిత్య, ప్రచార కార్యదర్శి పల్లికొండ రాజు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నిజమైన హిందూ రక్షకుడిని అని అన్నారు. జగిత్యాలలో దేవాలయ భూముల రక్షణలో జైశ్రీరాం అంటూ జెండా పట్టింది తానే అని, ఊరూరా హనుమాన్‌ ఆలయాలను పునరుద్ధరించి ఆధ్యాత్మికత కోసం పాటుపడ్డానన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని